సజ్జలతో వంటలు | Cooking with soups special | Sakshi
Sakshi News home page

సజ్జలతో వంటలు

Published Sun, Dec 30 2018 1:36 AM | Last Updated on Sun, Dec 30 2018 1:36 AM

Cooking with soups special - Sakshi

సజ్జ ఉల్లిపాయ ముత్తియాస్‌
కావలసినవి: సజ్జ పిండి – ఒక కప్పు, సన్నటి ఉల్లి తరుగు – అర కప్పు, పసుపు – పావు టీ స్పూను, మిరప కారం – ఒక టీ స్పూను, ధనియాల పొడి – ఒక టీ స్పూను,  జీలకర్ర పొడి – ఒక టీ స్పూను, అల్లం + వెల్లుల్లి + పచ్చి మిర్చి ముద్ద – అర టీ స్పూను, పంచదార – పావు టీ  స్పూను, బేకింగ్‌ సోడా – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – తగినంత, ఆవాలు – అర టీ స్పూను, జీలకర్ర – అర టీ స్పూను, కరివేపాకు – నాలుగు రెమ్మలు, ఇంగువ – పావు టీ స్పూను, కొత్తిమీర – అలంకరించడానికి తగినంత,  క్యారట్‌ తురుము – అలంకరించడానికి తగినంత

తయారీ: ఒక పాత్రలో సజ్జ పిండి, ఉల్లి తరుగు, పసుపు, మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ముద్ద, పంచదార, బేకింగ్‌ సోడా, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. నీళ్లు పోసి పిండిని ముద్దగా కలపాలి. చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి. ఒక్కో ఉండను పొడవుగా సన్నగా ఒత్తాలి. స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె పోసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి. తయారుచేసి ఉంచుకున్న రోల్స్‌ను వేసి జాగ్రత్తగా కలపాలి. అర కప్పు నీళ్లు జత చేసి, కొద్దిగా కలిపి, సన్నటి మంట మీద సుమారు పది నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యలో ఒకసారి నెమ్మదిగా కలపాలి. బాగా ఉడికాయా లేదా అని టూత్‌ పిక్‌తో గుచ్చి పరిశీలించాలి. ఉడికిన వెంటనే దింపేసి కొత్తిమీర, క్యారట్‌ తురుములతో అలంకరించి, వేడివేడిగా అందించాలి.

100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?
సజ్జలు  (Pearl Millet)  
నియాసిన్‌ (Niacin)mg (B3)    2.3
రిబోఫ్లావిన్‌ (Rivoflavin)mg (B2)     0.25
థయామిన్‌  (Thiamine) mg (B1)    0.33
కెరోటిన్‌ Carotene)ug        132
ఐరన్‌  (Iron)mg        8.0
కాల్షియం  (Calcium)g        0.05
ఫాస్పరస్‌ (Phosphorous)g    0.35
ప్రొటీన్‌  (Protein)g        11.6
ఖనిజాలు (Minerals) g        2.3
పిండిపదార్థం (Carbo Hydrate) g    67.1
పీచు పదార్థం(Fiber) g        1.2
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio)    55.91

సజ్జ పకోడీ
కావలసినవి: సజ్జ పిండి – అర కప్పు, సెనగ పిండి లేదా గోధుమ పిండి – అర కప్పు, 
ఉల్లి తరుగు – పావు కప్పు, క్యారట్‌ తురుము – పావు కప్పు, 
పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంత, మిరప కారం – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ఒక పాత్రలో సజ్జ పిండి, సెనగ పిండి లేదా గోధుమ పిండి, ఉల్లి తరుగు, క్యారట్‌ తురుము, పచ్చి మిర్చి తరుగు, మిరప కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి పకోడీల పిండి మాదిరిగా కలిపి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలుగా వేయాలి. బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి. సజ్జ పకోడీలను టొమాటో సాస్, చిల్లీ సాస్‌లతో తింటే రుచిగా ఉంటుంది.

సజ్జ పెసరట్టు
కావలసినవి: సజ్జలు – ఒక కప్పు, పెసలు – ఒక కప్పు, బియ్యం – గుప్పెడు, జీలకర్ర – అర టీ స్పూను,  ఇంగువ – పావు టీ స్పూను, తరిగిన పచ్చి మిర్చి – 4, అల్లం తురుము – 2 టీ స్పూన్లు, 
ఉప్పు – తగినంత, నూనె లేదా నెయ్యి – అట్లు కాల్చడానికి తగినంత

తయారీ:  ఒక పాత్రలో సజ్జలు, పెసలు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటలపాటు నానబెట్టి, ఒంపేయాలి. గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు, జీలకర్ర, ఇంగువ జత చేసి, మూత పెట్టి, గంటసేపు నాననివ్వాలి. స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేయాలి. గరిటెడు పిండి తీసుకుని, పెనం మీద సమానంగా పరచాలి. రెండు వైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి.

సజ్జ హల్వా
కావలసినవి: సజ్జ పిండి – ఒక కప్పు,బెల్లం పొడి లేదా పటిక బెల్లం పొడి – ఒక కప్పునెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లుఏలకుల పొడి – అర టీ స్పూనుజీడి పప్పులు – తగినన్నికిస్‌మిస్‌ – తగినన్ని

తయారీ: స్టౌ మీద బాణలిలో ఒక టీ స్పూను నెయ్యి వేసి కరిగాక సజ్జ పిండి వేసి దోరగా వేయించాలి. మూడు కప్పుల నీళ్లలో పటిక బెల్లం పొడి వేసి కరిగించి, వేయించుకుంటున్న పిండిలో పోసి కలుపుతుండాలి (బెల్లం పొడి వాడుతుంటే, మందపాటి పాత్రలో కొద్దిగా నీళ్లు, బెల్లం పొడి వేసి లేత పాకం పట్టాలి. ఆ పాకాన్ని వేయించుకుంటున్న పిండిలో వేసి కలియబెట్టాలి). బాగా ఉడుకుతుండగా ఏలకుల పొడి జత చేయాలి. కమ్మని వాసన వచ్చి హల్వాలా తయారయ్యేవరకు కలిపి దింపేయాలి. ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి పూసి, ఆ ప్లేట్‌లో హల్వా పోసి సమానంగా సర్దాలి. చిన్న బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీడిపప్పులు, కిస్‌మిస్‌ వేసి వేయించి తీసేయాలి. తయారుచేసుకున్న హల్వా మీద అలంకరించి వేడివేడిగా అందించాలి.

సజ్జ తెప్లా
కావలసినవి: సజ్జ పిండి – ఒకటిన్నర కప్పులు, గోధుమ పిండి – అర కప్పునూనె – 2 టేబుల్‌ స్పూన్లు, మెంతి పొడి – చిటికెడు,పచ్చి మిర్చి + అల్లం + వెల్లుల్లి + ఉప్పు కలిపిన ముద్ద – 2 టీ స్పూన్లుకొత్తిమీర – 2 టీ స్పూన్లు, పంచదార పొడి – ఒక టీ స్పూనుపెరుగు – పిండి కలపడానికి తగినంత, ఉప్పు – తగినంత

తయారీ: ఒక పెద్ద గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. నీళ్లు మరుగుతుండగా ఉప్పు వేసి కలిపి దింపేయాలి. ఒక పాత్రలో గోధుమ పిండి, సజ్జ పిండి, మెంతి పొడి, పంచదార పొడి, పచ్చిమిర్చి మిశ్రమం ముద్ద జత చేసి కలపాలి. వేడి నీళ్లు జత చేస్తూ పిండిని కలపాలి. పెరుగు జత చేస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలపాలి. పరాఠాల మాదిరిగా ఒత్తాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాగాక, ఒత్తుకున్న తెప్లాలను (పరాఠా మాదిరిగా) రెండు వైపులా దోరగా కాల్చి తీసేయాలి. కొత్తిమీరతో అలంకరించి చట్నీతో అందించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement