ఉహ్‌.. ఒహ్‌.. సిరి | usiri special | Sakshi
Sakshi News home page

ఉహ్‌.. ఒహ్‌.. సిరి

Published Sat, Oct 28 2017 12:04 AM | Last Updated on Sat, Oct 28 2017 12:04 AM

usiri  special

కొరికితే ఉహ్‌ వండితే అహ్‌ తింటే ఒహ్‌ ఉసిరండీ.. దానికి సరిలేదండీ! ఉహ్‌.. ఒహ్‌.. ఉసిరి.

ఉసిరికాయ జ్యూస్‌

కావలసినవి: ఉసిరికాయలు – 2;  మిరియాలు – 2; జీలకర్రపొడి – అర టీ స్పూన్, కరివేపాకు – 1 రెబ్బ, ఉప్పు – 1/4 టీ స్పూన్, నీళ్లు – 1/2 లీటరు; తేనె – 1 టీ స్పూన్‌.
తయారి: ∙ఉసిరికాయలను కడిగి గింజలు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లో ఉసిరికాయ ముక్కలు, మిరియాలు, జీలకర్రపొడి, కరివేపాకు, ఉప్పు వేసి నీళ్లు పోసి బాగా బ్లెండ్‌ చేయాలి ∙ఈ మిశ్రమాన్ని వడకట్టి, తేనె కలిపితే ఉసిరికాయ జ్యూస్‌ రెడీ.

ఉసిరి, కీరా పెరుగు పచ్చడి

కావలసినవి: చిలికిన పెరుగు – 2 కప్పులు; ఉసిరికాయలు – 4 (తురుముకోవాలి); తురిమిన కొబ్బరి – 1/4 కప్పు; కీర దోస – 1 (తురుముకోవాలి); ఆవాల నూనె – 2 స్పూన్స్, ఆవాలు – 1 టీ స్పూన్‌; కరివేపాకు – 1 రెబ్బ, ఉప్పు, రుచికి సరిపడ.

తయారి: ∙ఒక గిన్నెలోకి ఉసిరి తురుము, కొబ్బరి తురుము, కీరా తురుము, చిలికిన పెరగు, ఉప్పు, వేసి బాగా కలుపుకోవాలి ∙చిన్న పాన్‌ను వేడి చేసి నూనె పోసి, ఆవాలు చిటపడలాడాక కరివేపాకు వేసి వేగిన తర్వాత తయారు చేసుకున్న మిశ్రమంలో కలుపుకోవాలి ∙పలావ్‌తో ఈ రైతా బాగుంటుంది.

ఉసిరికాయ తొక్కు పచ్చడి

కావలసినవి :ఉసిరికాయలు – 250 గ్రా; ఉప్పు – 40 గ్రా; పసుపు – 1/2 టీ స్పూన్, మెంతులు – 2 1/2 టీ స్పూన్స్, ఆవాలు – 2 1/2 టీ స్పూన్స్, పచ్చిమిర్చి – 12; ఎండుమర్చి – 12; ఇంగువ – 1/2 టీ స్పూన్, ఇంగువ – 1/2 టీ స్పూన్‌; నూనె – 1/4 కప్పు.

కావలసినవి ∙ముందుగా ఉసిరికాయలు కడిగి, తడి లేకుండా బాగా తుడుచుకొని, గింజలు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి ∙మిక్సీ జార్‌లో ముక్కలు చేసిన ఉసిరికాయ ముక్కలు, పసుపు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేసుకోవాలి ∙గ్రైండ్‌ చేసిన ఉసిరికాయ తొక్కుకు తగినంత ఉప్పు కలిపి గాజు సీసాలో కానీ, జాడీలో కాని 3 రోజుల పాలు ఉంచితే చక్కగా ఊరుతుంది ∙పచ్చిమిర్చి కడిగి, తడిలేకుండా చూసుకుని ముక్కలుగా చేసుకోవాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి నూనె పోసి ఆవాలు వేసి చిటపటలాడుతుండగా మెంతులు కూడా వేసి వేయించుకోవాలి ∙తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేయించుకోవాలి. నూనె లేకుండా వాడ్చి, ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి పొడి చేసుకోవాలి. దీనికి ఉసిరికాయ తొక్కును వేసి మరోసారి గ్రౌండ్‌ చేసుకోవాలి ∙ఒక గిన్నెలోకి ఈ పచ్చడిని తీసుకుని చేతితో బాగా కలుపుకోవాలి ∙పోపులో మిగిలిన నూనె చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకోవాలి.

ఉసిరి లడ్డు

కావలసినవి: ఉసిరికాయలు – 250 గ్రా; పంచదార – 250 గ్రా; బాదం పొడి – 50 గ్రా; జీడిపప్పు పొడి – 25 గ్రా; నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్స్‌; యాలకుల పొడి – 1 టీ స్పూన్, జాజికాయ పొడి – 1/2 టీ స్పూన్‌.

తయారి: ∙ముందుగా ఉసిరికాయలను కడిగి కుక్కర్‌లో నీళ్లు పోయకుండా, విజిల్, గ్యాస్‌కట్‌ పెట్టకుండా 7 నిమిషాలు ఉంచి తీసేయాలి (మైక్రోవేవ్‌లో అయితే  మాక్సిమమ్‌ టెంపరేచర్‌లో 5 నిమిషాలు సరిపోతుంది) ∙వేడిచేసిన ఉసిరికాయలను పూర్తిగా చల్లారిన తర్వాత తురుముకోవాలి ∙స్టౌ పైన నాన్‌స్టిక్‌ పాన్‌ పెట్టి ఉసిరి తురుము, పంచదార వేసి కలుపుతూ ఉండాలి ∙పంచదార పూర్తిగా కరిగి చిక్కటి పాకం వచ్చాక 2 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆఫ్‌ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ∙ఒక బౌల్‌లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని, బాదం పొడి, జీడిపప్పు పొడి, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి బాగా కలిసేవరకు కలుపుకోవాలి ∙అరచేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లా మనకు కావలసిన సైజులో చేసుకోవాలి ∙ఈ లడ్డు ఎయిట్‌టైట్‌ కంటెయినర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచుకుంటే 4 నెలల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి.

ఉసిరికాయ గోరుచిక్కుడుకాయ కూర

కావలసినవి:  గోరుచిక్కుడు – 1/2 కేజి; ఉసిరికాయలు –2; పచ్చిమిర్చి – 2; ఆవాలు–1 టీ స్పూన్, జీలకర్ర – 1 టీ స్పూన్‌; ధనియాల పొడి – 1 టీ స్పూన్, కరివేపాకు – 1 రెబ్బ; పసుపు – 1/2 టీ స్పూన్, ఇంగువ – చిటికెడు; ఉప్పు – రుచికి సరిపడ; నూనె – 3 టేబుల్‌ స్పూన్స్‌.

తయారి: ∙గోరుచిక్కుడుకాయలు కడిగి సగానికి తరిగి పెట్టుకోవాలి ∙ఉసిరికాయలను తురిమి పెట్టుకోవాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, తరిగిన పచ్చిమిర్చి, తురిమిన ఉసిరికాయ వేసి వేయించుకోవాలి ∙ఇప్పుడు తరిగిన గోరుచిక్కుడు కాయలు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి కొంచెం నీళ్లు చల్లి సిమ్‌లో పెట్టి ఉడకనివ్వాలి. పుల్లపుల్లటి ఉసిరి–గోరుచిక్కుడుకాయ కూర రెడీ.

ఉసిరికాయ పులిహోర

కావలసినవి: బియ్యం – 1/2 కేజీ (ఉడికించి చల్లార్చి పెట్టుకోవాలి); ఉసిరికాయలు – 3; పచ్చిమిర్చి – 4, కరివేపాయకు – 2 రెబ్బలు; – కొత్తిమీర – గుప్పెడు; వేరుశెనగగుళ్లు – 2 టేబుల్‌ స్పూన్స్, ఆవాలు – 1 టీ స్పూన్, జీలకర్ర – 2 టీ స్పూన్, పచ్చిశెనగపప్పు – 2 టీ స్పూన్స్, మినపప్పు – 1 టీ స్పూన్, ఎండుమిర్చి – 2,  ఉప్పు – రుచికి సరిపడ, నూనె – 4 టేబుల్‌ స్పూన్స్‌.

తయారి: ∙ఉసిరికాయలు కడిగి గింజలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ∙మిక్సీ జార్‌లో ఉసిరికాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కొంచెం ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేసుకోవాలి ∙స్టౌ పై బాణలి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశెనగపప్పు, మినపప్పు, వేరుశెనగగుళ్లు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి ∙తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ కొత్తిమీర మిశ్రమాన్ని, పసుపు వేసి మరికాసేపు వేగనివ్వాలి ∙ఉసిరికాయ మిశ్రమం కలిపిన తర్వాత ఎక్కువసేపు వేగనివ్వకూడదు. ∙వెంటనే అన్నం కూడా వేసి బాగా కలిపితే వేడి వేడి ఉసిరికాయ పులిహోర రెడీ.

ఆరోగ్యఉసిరి
ఒక టీ స్పూన్‌ ఉసిరిక పొడిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఉంటుంది.రోజుకు ఒక ఉసిరి కాయ తింటే (పచ్చడి, పొడి, రసం ఏ రూపంలోనైనా) దేహం శక్తిమంతంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియల వ్యవస్థ సక్రమమవుతుంది. రోజూ భోజనానికి ముందు ఒక గ్లాసు ఉసిరి రసం తాగితే దేహంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఇది మంచి చిట్కా.ఉసిరి జుట్టుకు టానిక్‌లాంటిది. క్రమం తప్పకుండా ఉసిరి తినే వాళ్లకు జుట్టు బాగా పెరుగుతుంది. చిన్న వయసులో జుట్టు తెల్లబడడం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉండవు. వారానికి ఒకసారి ఉసిరి రసాన్ని నేరుగా జుట్టుకు, కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు కూడా వదులుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement