వెజిటేరియన్లలో విటమిన్ బి12 లోపిస్తే..! | Vegetarian vitamin B12 deficiency! | Sakshi
Sakshi News home page

వెజిటేరియన్లలో విటమిన్ బి12 లోపిస్తే..!

Published Mon, May 18 2015 12:18 AM | Last Updated on Tue, Aug 14 2018 3:33 PM

వెజిటేరియన్లలో విటమిన్ బి12 లోపిస్తే..! - Sakshi

మనం ఏ పని చేయాలన్నా అవసరమైనది మన మెదడు, నాడీ వ్యవస్థ చక్కగా ఉండటం. ఆ మెదడు నుంచి అన్ని అవయవాలకూ ఆదేశాలు సక్రమంగా అందడం. అందుకు ఉపయోగపడే అత్యంత కీలకమైన పోషకమే... ‘విటమిన్-బి12’. ఇది కేవలం మెదడు నుంచి అన్ని అవయవాలకూ ఆదేశాలు అందేలా చేయడమే కాదు... రక్తం పుట్టుకలోనూ పాలుపంచుకుంటుంది. ప్రతి కణంలో జరిగే జీవక్రియల్లో భాగస్వామ్యం తీసుకుని డీఎన్‌ఏ పుట్టుకలో, అమైనో యాసిడ్స్  కార్యకాలాపాల్లో (మెటబాలిజమ్‌లో) పాలుపంచుకుంటుంది.

మాంసాహారంలోనే పుష్కలంగా లభించే విటమిన్ బి12... శాకాహార నియమాన్ని చాలా కఠినంగా పాటించేవారిలో చాలా  తక్కువగా ఉంటుంది. దాంతో వారికి కొన్ని సమస్యలు రావడం సాధారణం. వాటిని అధిగమించి, మన నాడీవ్యవస్థనూ, కణాల్లోని జీవక్రియలనూ సక్రమంగా పనిచేయించడం ఎలాగో చెప్పుకుందాం.
 
శాకాహారుల్లో విటమిన్ బి12
ఎందుకు తక్కువ...

విటమిన్ బి12ను మొక్కలుగానీ, ఫంగస్‌గానీ... ఆ మాటకొస్తే జంతువులుగానీ సృష్టించలేవు. కేవలం బ్యాక్టీరియా దాంతో పాటూ ఆర్చియా అనే ఏకకణ జీవులు మాత్రమే ఈ విటమిన్‌ను సృష్టించగలవు. ఆర్చియా అనేది ఎంత చిన్న జీవి అంటే ఏకకణజీవికంటే కూడా తక్కువ స్థాయి జీవి. ఈ ఏకకణానికి న్యూక్లియస్ (కేంద్రకం) ఉండదు. ఇదొక కణమనీ, కణంలోని భాగాలని అని నిర్దిష్టంగా చెప్పేందుకు వాటి విభాగాలూ, పైపొరలూ కూడా ఉండవు. కానీ బ్యాక్టీరియా, ఆర్కియా వెలువరించే ఎంజైముల సంయోగంతో ఈ ప్రపంచంలో విటమిన్-బి12 స్వాభావికంగా తయారవుతుంది.

పైగా దీని నిర్మాణం చాలా సంక్లిష్టమైనది. ఇది జంతువులకు మేలు చేసే బ్యాక్టీరియా మనుగడ సాగించే చోట... అంటే... జంతువుపై ఆధారపడి  బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా వెలువరించే పదార్థాలతో జంతువులూ ఇలా పరస్పరం సహాయం (సింబయాసిస్) చేసుకుంటూ ఉండే ప్రదేశాలలో మాత్రమే ఈ విటమిన్ పుడుతుంది. అందుకే ఇది జంతుమాంసం, జంతు ఉత్పాదనల వనరులనుంచే ప్రధానంగా ఉత్పన్నమవుతుంది. అందుకే శాకాహార నియమాన్ని చాలా కఠినంగా పాటించేవారిలో ఇది చాలా తక్కువ.
 
విటమిన్ బి12 లోపం ఉంటే...

విటమిన్ బి12 లోపం ఉన్నవారు ఎప్పుడూ చాలా అలసటగా, నీరసంగా ఉంటారు. నిస్సత్తువ ఆవరించి ఉన్నట్లుగా ఫీలవుతుంటారు.
విటమిన్ బి12 లోపం వల్ల ఆక్సిజన్‌ను అన్ని అవయవాలకూ తీసుకెళ్లే ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ కండిషన్‌ను ‘విటమిన్-బి12 అనీమియా’ అంటారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మన శరీరం చాలా పెద్దసైజు ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటినే మెగాలోబ్లాస్టిక్, మ్యాక్రోసైటిక్ ఎర్రరక్తకణాలంటారు. ఇవి తమ విధిని సక్రమంగా నిర్వహించలేవు.
విటమిన్-బి12 అనీమియా వల్ల అలసట, నిస్సత్తువలతో పాటు ఒక్కోసారి ఊపిరి సరిగా అందకపోవడం జరగవచ్చు.
తలనొప్పి, చెవుల్లో ఏదో హోరు వినిపించడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు.
 
మరింత నిర్దిష్టమైన లక్షణాలు :  చర్మం పసుపుపచ్చరంగులోకి మారడం  నాలుకపూయడం  నోట్లో పుండ్లు  కొన్ని ప్రదేశాల్లో స్పర్శజ్ఞానం కోల్పోవడం  నొప్పి ఎక్కువగా తెలియకపోవడం  నడుస్తున్నప్పుడు పడిపోవడానికి అవకాశం  చూపు సరిగా లేక స్పష్టంగా కనిపించకపోవడం  క్షణక్షణానికీ మూడ్స్ మారిపోవడం  డిప్రెషన్‌కు లోనుకావడం  మతిమరపు రావడం.
 
శాకాహారులతో పాటు...
ఇంకా ఎవరెవరిలో తక్కువ...

సాధారణంగా 75 ఏళ్లకు పైగా వయసు పైబడిన వారిలో ఇది తక్కువ  పుట్టుకతో వచ్చే జబ్బు అయిన పెర్నీషియస్ అనీమియా అనే కండిషన్ ఉన్నవారిలో ఇది తక్కువ. ఈ కండిషన్ ఉన్నవారిలో ఒక ప్రోటీన్ లోపం వల్ల జీర్ణమైన ఆహారం నుంచి విటమిన్ బి12 ను సంగ్రహించే సామర్థ్యం లోపిస్తుంది.

అందుకే ఇలాంటి కుటుంబ చరిత్ర ఉన్న వారిలో 60 ఏళ్లు దాటిన మహిళల్లో ఇది ఎక్కువ  ఇక పొట్ట లోపలిపొర పలచబారిన వారిలోనూ ఇది తక్కువ  పొట్టలో పుండ్లు (అల్సర్స్) ఉన్నవారిలో  పొట్టలోని కొంతభాగాన్ని సర్జరీ ద్వారా తొలగించిన వారిలో  జీర్ణవ్యవస్థకు సంబంధించిన  దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారిలో  చాలాకాలంగా అజీర్తి మందులు (ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ -పీపీఐ) వాడుతున్నవారిలోనూ విటమిన్ బి12 పాళ్లు తక్కువ.
 
నిర్ధారణ : సాధారణంగా రక్తపరీక్ష ద్వారా విటమిన్ బి12 లోపం తెలుసుకుంటారు. ఇక ఎర్రరక్తకణాల సైజ్‌ను బట్టి కూడా విటమిన్ బి12 లోపాన్ని అంచనావేస్తారు.
 
విటమిన్ బి12కు చికిత్స
విటమిన్ బి12 తక్కువగా ఉందని రక్తపరీక్షలో నిర్ధారణ అయితే... అలాంటి రోగులకు సాధారణంగా ఆరు  బి12 ఇంజెక్షన్లతో ఈ లోపాన్ని భర్తీ చేస్తారు. ఇది రోజుకు ఒకటిగానీ లేదా రెండు నుంచి నాలుగు రోజులకు ఒకటి చొప్పున ఇస్తారు. ఈ విటమిన్ బి12 అంతా కాలేయంలో నిల్వ అయి ఉంటుంది. కొన్ని నెలలపాటు శరీరానికి అవసరమైన జీవక్రియలకోసం శరీరం తన విటమిన్-బి12 అవసరాల కోసం దాన్ని కాలేయం నుంచి తీసుకొని వాడుకుంటుంది.
 
ఒకవేళ పెర్నీషియస్ అనీమియా కారణంగా విటమిన్ బి12 లోపం ఉన్నవారైతే... జీవితకాలం పాటు డాక్టర్లు చెప్పిన మోతాదుల్లో విటమిన్ బి12ను తీసుకుంటూ ఉండాలి. ఇలా విటమిన్ బి12 తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు. ఇక కొందరిలో ఇది పెర్నీషియస్ అనీమియా వల్ల కాకుండా పోషకాహారలోపం వల్ల విటమిన్ బి12 లోపం ఏర్పడితే అప్పుడు ఇంజెక్షన్ రూపంలో కాకుండా సైనకోబాలమైన్ టాబ్లెట్ల రూపంలోనూ దీన్ని శరీరానికి అందిస్తారు.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే...  ఎవరికి వారుగా విటమిన్-బి12 టాబ్లెట్లను, ఇంజెక్షన్లను తీసుకోకూడదు. డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వీటిని తీసుకోవాలి. ఎందుకంటే... ఈ ఇంజెక్షన్లనూ, మాత్రలనూ తీసుకునే వారు ఒకవేళ ఇతర మాత్రలనూ వాడుతుంటే... విటమిన్ బి12 ఇంజెక్షన్లూ, మాత్రలూ వాటి కార్యకలాపాలకు అడ్డుపడకుండా చూసేలా డాక్టర్లు మోతాదులను నిర్ణయిస్తారు.
 
నివారణ
మాంసాహారంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది   గుడ్లు, సముద్రపు చేపలు, పాలలో ఇది ఎక్కువ. మాంసాహారం తీసుకోడానికి ఇష్టపడని వారు ఈ కింది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విటమిన్ బి12ను పొందవచ్చు.
 
శాకాహారులు పుష్కలంగా
విటమిన్ బి 12 పొందాలంటే...

విటమిన్ బి12తో సమృద్ధం చేసిన (విటమిన్ బి12 ఫోర్టిఫైడ్) బాదం పాలలో ఇది ఎక్కువ  విటమిన్ బి12తో సమృద్ధం చేసిన కొబ్బరిపాలలోనూ ఇది చాలా ఎక్కువ  పులిసిపోయే స్వభావం ఉన్న ఆహారంలోని ఈస్ట్ (న్యూట్రిషనల్ ఈస్ట్)తోనూ ఈ లోపాన్ని తొలగించుకోవచ్చు  విటమిన్ బి12తో సమృద్ధం చేసిన సోయాపాలతో   తక్షణం తినగలిగే తృణధాన్యాలు (సి రేల్స్)లో  తక్కువ కొవ్వు ఉన్న పాలు తోడుబెట్టి చేసిన పెరుగులోనూ పాలలోనూ, చీజ్‌లోనూ, వెనిలా ఐస్‌క్రీమ్‌లోనూ విటమిన్ బి12 ఎక్కువ. అందుకే శాకాహారులు పైన పేర్కొన్న ఆహారంపై ఆధారపడవచ్చు.
 
- డాక్టర్ ఎమ్. గోవర్థన్
సీనియర్ ఫిజీషియన్,కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement