పిలిస్తే పలికే దేవుడు వేములవాడ రాజన్న | vemualavada special | Sakshi
Sakshi News home page

పిలిస్తే పలికే దేవుడు వేములవాడ రాజన్న

Published Tue, Nov 1 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

పిలిస్తే పలికే దేవుడు   వేములవాడ రాజన్న

పిలిస్తే పలికే దేవుడు వేములవాడ రాజన్న

కార్తీక క్షేత్రాలు - 1

హరిహర క్షేత్రంగా... దక్షిణ కాశీగా... శతవేల్పులకు నెలవుగా... మతసామరస్యానికి ప్రతీకగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం నిలుస్తోంది. ఈ క్షేత్రంలోని మహాశివుడు తెలంగాణ జిల్లాల్లోనే పేదల దేవుడిగా, ‘ఎముడాల రాజన్న’గా భక్తుల మన్ననలు అందుకుంటున్నాడు. ఇక్కడ మూలవిరాట్టుకి కుడి పక్కన రాజరాజేశ్వర దేవి, ఎడమపక్కన శ్రీ లక్ష్మీసహిత సిద్ధి వినాయకస్వామి విగ్రహాలు ఉంటాయి.  ‘రాజన్న సిరిసిల్ల’ జిల్లాలోని వేములవాడ రాజన్న సన్నిధానంపై ప్రత్యేక కథనమిది.

రాజన్న గుడికి సంబంధించిన అనేక పురాణ గాధలున్నాయి. పూర్వం నారద మహాముని భూలోకంలో సంచరిస్తూ పాపాలతో బాధపడుతున్న జనాన్ని చూసి వారికి పాపవిముక్తి కలిగించమని పరమశివుణ్ణి వేడుకోగా స్వామి మొదట కాశీలో, ఆ తర్వాత చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం మీదుగా వేములవాడలో ఉద్భవించినట్లు కథనం. దక్షయజ్ఞంలో బాహువులు కోల్పోయిన సూర్యుడు ఇక్కడి ధర్మగుండంలో స్నానమాచరించి బాహువులు పొందాడని, అందువల్ల దీనిని భాస్కర క్షేత్రం అని పిలుస్తారని మరో కథనం.  

 

చారిత్రక విశిష్టత...
వేములవాడను పూర్వం లేంబుల వాటిక అని పిలిచేవారు. అదే కాలక్రమంలో వేములవాడ అయ్యిందని అంటారు. ఈ ప్రాంతాన్ని క్రీ.శ.750 నుంచి 973 వరకు చాళుక్యరాజులు పాలించగా వారిలో మొదటి నరసింహుడికి ‘రాజాదిత్య’ అనే బిరుదు ఉందని ఆయన హయాంలో కట్టిన గుడి కనుక ఇక్కడి స్వామి రాజరాజేశ్వరుడు అయ్యాడని మరో కథనం.

కార్తీకమాసంలో...
వేములవాడలో కార్తీకమాసంలో ప్రత్యేక పూజలతో పాటు ఐదురకాల నెరుు్యతో దీపారాధణ చేయడం శ్రేష్టంగా భావిస్తారు. ఈ మాసంలో శివునికి అభిషేకాలు, అర్చనలు ఎక్కువగా జరుగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చి విశేష పూజలు చేస్తారు. ఈ మాసంలో కృష్ణుణ్ణి కార్తీక దామోదరుడని పిలుస్తారు కనుక ద్వాదశి రోజున కృష్ణ-తులసీ వివాహం వైభవంగా జరుపుకోవడం రాజన్న క్షేత్రంలో ఆనవాయితీగా వస్తుంది. కార్తీకమాసంలో ఇక్కడ ఒకరోజు దీపం వెలిగిస్తే  365 రోజులు వెలిగించినట్లుగానే భక్తులు భావిస్తారు. 

కొడుకు పుడితే కోడెను కడతారు...
రాజన్న ఆలయంలో ఒక విశిష్ట ఆచారం ఉంది. సంతానం లేని దంపతులు తమకు కొడుకు పుడితే కోడెను కట్టేస్తామని ఇక్కడ మొక్కుకుంటారు. సంతానం కలిగిన తర్వాత  స్వామి వారికి కోడెదూడను మొక్కు చెల్లించుకుంటారు. అలాగే పాడిపంటలు బాగుండాలని మొక్కుకున్న రైతులు తమ ఇంటివద్ద పెంచి పెద్దచేసిన కోడెలను స్వామి వారికి అప్పగించి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా కోడెలు కట్టలేని వారు రాజన్న గుడికి చెందిన అద్దె కోడెలను టికెట్ తీసుకుని కట్టేసే ఆచారం ఉంది.

మతసామరస్యానికి ప్రతీక
రాజన్న ఆలయం గర్భగుడికి ఎదురుగా దర్గా ఉండటంతో ఈ క్షేత్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు దర్గాలోని ఖాజా బఖష్వార్  సమాధి వద్ద  ప్రార్థనలు చేస్తారు. రాజన్నను దర్శించుకున్న హిందువులు దర్గాలో ప్రార్థనలు, దర్గాకు వచ్చిన ముస్లింలు రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకోవడం ఈ క్షేత్ర మహత్యం.

ధర్మగుండం విశిష్టత ...
వేములవాడ క్షేత్రంలో ఉన్న పుష్కరిణిని ధర్మగుండం అని పిలుస్తారు. రాజరాజ నరేంద్రుడు కుష్టువ్యాధితో బాధపడుతూ ఈ క్షేత్రాన్ని సందర్శించి ధర్మగుండంలో స్నానమాచరించడంతో కుష్టువ్యాధి నయమైనట్లు స్థలపురాణం. అందుకే దీర్ఘకాలిక చర్మవ్యాధులతో బాధపడేవారు ధర్మగుండంలో స్నానాలు చేస్తే వ్యాధి నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. స్వామి వారి సన్నిధిలో నిద్ర చేస్తామని మొక్కుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి తడిగుడ్డలతో దర్శించుకుంటారు. స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటారు. అనంతరం బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించుకుంటారు.

ప్రత్యేక పూజలు - దర్శించుకోవాల్సిన దేవాలయాలు
వేములవాడలో రాజన్న ఆలయంతోపాటు పరిసరాల్లో అనుబంధంగా అనంతకోటి పద్మనాభస్వామి, భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం, కేదారీశ్వర, వేణుగోపాల స్వామి, మహాలక్ష్మీ, కనకదుర్గ, ఆంజనేయస్వామి, మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి, నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి, అగ్రహారం జోడాంజనేయ స్వామి దేవాలయాలున్నాయి. రాజన్నను దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాల్లోనూ పూజలు చేస్తారు. ఇలా రాజన్న ఆలయంతోపాటు వంద ఆలయాలకు నెలవుగా రాజన్న క్షేత్రం విరాజిల్లుతోంది.

చౌకగా కడుపు నిండా భోజనం
భక్తుల సౌకర్యార్థం ఆలయం వారు రాజరాజేశ్వర క్యాంటిన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో పదిహేను రూపాయలకే కడుపునిండా భోజనం వడ్డించే క్యాంటిన్‌ను ప్రారంభించారు. మూడు రకాల వంటకాలతో భక్తులు సంతృప్తిగా భోజనాలు చేస్తున్నారు. భక్తులతో పాటు స్థానికులకిది సౌకర్యంగా మారింది. దీంతోపాటు నిత్యాన్నదానంలో ప్రతిరోజు 500 మంది భక్తులకు ఉచితంగా భోజనాలు వడ్డిస్తారు.

కళాపోషణ...
సంగీత త్రయంలో ఒకరైన త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు రాజన్న సన్నిధిలో ప్రతియేటా ఘనంగా జరుగుతాయి. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై  విద్వాంసులచే ఐదు రోజులపాటు కచ్చేరీలు ఏర్పాటు చేస్తారు. మేటి కళాకారులను రప్పించి ప్రత్యేక సాంస్క ృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలా గత 64 ఏండ్లుగా ఈ క్షేత్రంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

వసతి గదులు..
స్వామి వారి సన్నిధికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ విచారణ కార్యాలయానికి చేరుకుని అద్దె గదులు తీసుకుంటారు. భక్తుల కోసం 400 వసతి గదులున్నాయి. నందీశ్వర కాంప్లెక్స్‌పై రూ.మూడు కోట్లతో మరిన్ని వసతి గదుల నిర్మాణం కొనసాగుతోంది.

 

నిత్యపూజలు...
ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 10గంటల వరకు నిత్యపూజలుంటాయి.
3.30గం. నుంచి 4.00గం. వరకు మంగళ వాయిద్యాలు
4.00గం. నుంచి4.30గం. వరకు సుప్రభాత సేవ
4.30గం. నుంచి 5.00గం. వరకు సుప్రభాత దర్శనం
5.00గం.  నుంచి 6.00గం. వరకు ప్రాతః కాలపూజ
6.00గం. నుంచి 12.00గం. వరకు స్వామి దర్శనాలు, నిత్యకల్యాణం (కల్యాణమండపంలో)
12గం. నుంచి 12.30గం. వరకు స్వామి వారికి అన్నపూజ, మహానివేదన కార్యక్రమాలు (ఈసమయంలో స్వామి వారి దర్శనాలు ఉండవు)
12.30గం. నుంచి 2.30గం. వరకు అన్న పూజలు, ప్రత్యేక దర్శనం
2.30గం. నుంచి 6.00గం వరకు దర్శనాలు
6గం. నుంచి 7గం. వరకు స్వామి వారికి ప్రదోశ పూజ (భక్తులకు దర్శనాలుండవు)
7.00గం. నుంచి 9.00గం. వరకు స్వామి వారి దర్శనాలు, ఆకు పూజ, పల్లకి సేవలు, పెద్ద సేవలు, మహాపూజ
9.00గం. నుంచి 10.గం. వరకు నిశిపూజ
10.00గం. నుంచి 10.30గం. వరకు స్వామి వారికి పవళింపు సేవతో ఆలయం మూసి వేస్తారు.

సమాచార ఫోన్ నెంబర్లు ఇవీ...
ఆలయ విచారణ విభాగం: 08723-236018
కార్యనిర్వాహణ అధికారి కార్యాలయం: 08723-236040
ఈఓ నివాసం: 08723-236043.

చేరుకోవడం ఇలా...
వేములవాడ హైదరాబాద్‌కు 150 కిలోమీటర్లు.  కరీంనగర్‌కు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజన్నను దర్శించుకోవాలంటే రోడ్డు మార్గం ఒక్కటే మార్గం. హైదరాబాద్ నుంచి ప్రతి అరగంటకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతి పది నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. హైద రాబాద్ నుంచి వచ్చే వాళ్లు సిద్దిపేట గుండా, వరంగల్ నుంచి వచ్చే వారు కరీంనగర్ మీదుగా వేములవాడకు చేరుకోవచ్చు.

- ఎస్.డి. తాహెర్ పాషా  సాక్షి ప్రతినిధి, వేములవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement