వేపాకు మందు
బౌద్ధ వాణి
వారణాసి రాజు బ్రహ్మదత్తునికి లేకలేక కొడుకు పుట్టాడు. దాంతో అతణ్ణి అతి గారాబంగా పెంచారు. అలా అబ్బరంగా పెంచడంతో అన్నీ అవలక్షణాలే అలవర్చుకున్నాడు. ప్రతివారినీ కొట్టేవాడు. ప్రతిదానికీ తిట్టేవాడు. దాంతో అందరూ అతణ్ణి ‘‘దుష్టకుమారుడు’’ అని పిలిచేవారు.
తన కొడుకు ఇలా అవలక్షణాలతో పెరిగి పెద్దవాడైతే, తన రాజ్యాన్ని సరిగా పాలించలేడనీ, తను వంశగౌరవం మంట కలుపుతాడనీ బ్రహ్మదత్తుడు భయపడ్డాడు. ఎందరో గురువుల దగ్గరకు పంపాడు. అతగాణ్ణి సరైన దారిలో పెట్టడం ఏ ఒక్కడి వల్లా కాలేదు. చివరికి గురుకులాలే దెబ్బతిన్నాయి.
ఇక, తన కుమారుణ్ణి చక్కదిద్దే శక్తి ఒక్క బుద్ధునికే ఉందని నమ్మాడు - బ్రహ్మదత్తుడు. మహాశక్తి (మహాగురువు)గా పేరు పొందిన బుద్ధుడే తన బిడ్డకు తగిన గురువు అని భావించి, ఒక రోజున తన బిడ్డను తీసుకొని వెళ్లి, నమ స్కరించి విషయం చెప్పాడు.
‘‘సరే! నా దగ్గర ఉంచి వెళ్లు’’ అని చెప్పాడు. రాకుమారుణ్ణి తనతో వాహ్యాళికి తీసుకుపోయాడు బుద్ధుడు. దారిలో ఒక చిన్న వేప మొక్క కనిపించింది. ‘‘నాయనా! ఎంతో అందంగా ఉన్నాయి. ఆ లేత ఆకుల్ని తీసుకుని తిను’’ అన్నాడు. దుష్టకుమారుడు రెండు ఆకులు కోసుకుని, నమిలి, ఖాండ్రించి ఉమ్మాడు. వెంటనే కోపంతో ఆ చుట్టుపక్కల కనిపించిన వేప మొక్కల్ని పీకేయడం మొదలుపెట్టాడు. ‘‘నాయనా! ఆగు! ఎందుకు పీకుతున్నావు?’’ అని అడిగాడు బుద్ధుడు. ‘‘ఛీఛీ! ఇవి కటిక చేదు. ఇవి పనికిరావు. వీటిని పీకి, మంచి మొక్కలు నాటిస్తాను’’ అన్నాడు.
‘‘మరి, నీకు నచ్చకపోతే వీటిని పీకేస్తున్నావు. అలాగే నీ ప్రవర్తన కూడా అంతకంటే చేదుగా ఉంటుంది కదా! అప్పుడు నీ తోటివారు నిన్ను ఎలా చూడాలి? ఏం చెయ్యాలి? తమ రాజు చెడ్డవాడని భావించిన ప్రజలు, రేపు నిన్ను సింహాసనం నుండి పీకేసి, మరో మంచి రాజును తెచ్చుకుంటారు గదా!’’ అన్నాడు. ఆ మాటలతో అతనికి జ్ఞానోదయం కలిగింది. ఇక ఆ రోజు నుండి మంచి నడవడిక నేర్చుకున్నాడు. తండ్రికి తగిన రాజుగా పేరు పొందాడు.
- బొర్రా గోవర్ధన్