బీకాంలో ఫిజిక్స్.. ఎంకామ్‌లో ఎంఫిల్
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్‌లుక్!
‘ఏపీ బడ్జెట్ ఎలా ఉందండీ మాస్టారూ’ అడిగాడు గోపాత్రుడు.పేపర్ చదువుతోన్న గిరీశం ఏవో లెక్కలు వేసుకుంటున్నాడు. ‘జీడీపీయో ఏదో 11.6 శాతం ఉందంట కదండీ’ మళ్లీ తానే అడిగాడు గోపాత్రుడు. ‘అవునోయ్, దేశానికే అంత లేదు. దేశం జీడీపీ 7.1 శాతమే’. ‘అదేనండీ మా సెందరబాబంటే ఏటనుకుంటున్నారు? పేకాటాడించేత్తారాయన’ అన్నాడు గోపాత్రుడు. ‘నీ అసాధ్యం సంతకెళ్లా, నువ్వు కూడా బడ్జెట్ ఫాలో అవుతున్నావేంట్రా’ అని ఆశ్చర్యంగా అడిగాడు గిరీశం. ‘అవునండీ బాబూ. మా సెందరబాబు సిఎం అయ్యాక అన్నీ ఫాలో అవుతున్నా’ అన్నాడు గోపాత్రుడు నవ్వుతూ. ‘ఒరేయ్ మరి మీ చంద్రబాబు సిఎం అయ్యాక వ్యవసాయం ఎలా ఉందిరా’ అని అడిగారు గిరీశం.
‘అంటే... అంతకుముందు కంటే తగ్గిందిలెండి’ అన్నాడు. ‘సరేలేరా అది వదిలేయ్, ఇండస్ట్రీలూ గట్రా బాగా వచ్చాయా?’ ‘అబ్బే... అయింకా రాలేదండి. కానీ వత్తాయండి. వచ్చాక బోలెడు డెవలప్‌మెంటూ గట్రా ఉంటాదండి’ అన్నాడు గోపాత్రుడు. ‘డిస్కంలు కూడా నష్టాల్లో ఉన్నాయట?’ అడిగాడు గిరీశం. ‘అవునండీ. ఎదవది. ఏకంగా 62 శాతం లాసండీ బాబూ’. ‘రుణమాఫీకి బడ్జెట్‌లో బాగా డబ్బిచ్చారా?’ అడిగాడు గిరీశం. ‘అంటే డబ్బులకి కొంచెం ఇబ్బంది కదండీ... 80వేల చిల్లర కోట్లకు గాను మూడువేల కోట్లు ఇచ్చారండి’ అన్నాడు గోపాత్రుడు. ‘పోనీ నిరుద్యోగులకు ఉద్యోగాలు బాగా వచ్చాయా?’‘ఉద్యోగాలెక్కడివండీ బాబూ. నేవు. కొత్త పరిశ్రమలు వస్తే ఉద్యోగాలొస్తాయండి’ అన్నాడు గోపాత్రుడు.
‘మరి భృతి?’ అని అడిగారు ‘అదీ నేదండీ బాబూ!’ అని అన్నాడు గోపాత్రుడు. ‘రాష్ట్రం ఆదాయం బాగా పెరిగిందేంట్రా?’ అడిగాడు గిరీశం.
‘నేదండీ బాబూ. డబ్బులకి కటకటలాడే కదా పాపం మా సెందరబాబు అప్పులు చేసుకుంటున్నారు’ అన్నాడు గోపాత్రుడు. ‘మరి ఏదీ బాగా లేనపుడు జీడీపీ 11 శాతం కంటే ఎక్కువ ఎలా వచ్చిందంటావ్?’ అని గిరీశం నవ్వుతూ అడిగాడు. గోపాత్రుడు బుర్రగోక్కున్నాడు. ఏం తట్టలేదు. ‘ఏమోనండీ బాబూ! అయన్నీ నాకెట్లా తెలుస్తాయి. మీరే చెప్పండి’ అని ఆత్రంగా అడిగాడు. గిరీశం నవ్వేసి ‘ఏం లేదురా, ఈ లెక్కలన్నీ మన జలీల్ ఖాన్ చెప్పి ఉంటారు. మ్యాథ్స్‌లో కూడా ఆయన జీనియస్ కదా. ఆయన లెక్కలు నీకూ నాకే కాదు ఎవ్వరికీ అర్థం కావు. ఆఖరికి మీ చెందరబాబుకి కూడా అర్థం కావు. జలీల్‌ఖాన్ ఏమో బీకాంలో ఫిజిక్స్ బ్యాచ్.. మీ చెందరబాబు నాయుడేమో ఎంకామ్‌లో ఎమ్మే, ఎంఫిల్ గట్రా ఇంకేమేం చదివేశాడో. ఇద్దరూ కలిసి యనమల రామకృష్ణుడికి ఏం లెక్కలు చెప్పేసి ఉంటారో. అందుకే జీడీపీ అలా పెరిగిపోయి ఉంటుంది’ అన్నాడు గిరీశం. గోపాత్రుడికి లీలగా అర్థం అవుతోంది. గిరీశం మాస్టారు తనని ఆట పట్టిస్తున్నారని అనుమానం వచ్చింది.
- నానాయాజీ