గతేడాది అన్నింటా వైఫల్యాలే.. | CM Chandrababu today in the seminar of Collectors seminar | Sakshi
Sakshi News home page

గతేడాది అన్నింటా వైఫల్యాలే..

Published Wed, May 25 2016 1:00 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

గతేడాది అన్నింటా వైఫల్యాలే.. - Sakshi

గతేడాది అన్నింటా వైఫల్యాలే..

- అన్ని రంగాల్లోనూ అభివృద్ధి లక్ష్యాలకు ఆమడ దూరం
ముఖ్యంగా వ్యవసాయం, సంక్షేమంలో లక్ష్యాలకు దూరంగా ఫలితాలు
రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అధ్వానం.. తేటతెల్లం చేసిన ప్రణాళికా శాఖ నివేదిక
9 మిషన్ల లక్ష్యాలు, పనితీరు, ఫలితాల సాధన ఆధారంగా రేటింగ్‌లు
నేడు కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
 
 సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరంలో అన్ని రంగాల్లోనూ నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమడదూరంలో నిలిచింది. అన్నింట్లోనూ వైఫల్యాలే దర్శనమిచ్చాయి. సాక్షాత్తూ ప్రణాళికా శాఖ రూపొందించిన నివేదికే ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. కీలక రంగాల్లో అభివృద్ధి లక్ష్యాల సాధనలో రాష్ట్రప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. ప్రధానంగా వ్యవసాయం, సంక్షేమం రంగాల్లో నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలను ఏమాత్రం చేరుకోలేకపోయిన వైనాన్ని నివేదిక కళ్లకు కట్టింది. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలకెత్తుకున్న తొమ్మిది మిషన్ల లక్ష్యాలు, పనితీరు, ఫలితాల సాధన ఆధారంగా రేటింగ్‌ల నిస్తూ ప్రణాళిక శాఖ నివేదికను రూపొందించింది.

గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2015 ఏప్రిల్ నుంచి 2016 మార్చివరకు రాష్ట్రప్రభుత్వం పనితీరు ఆధారంగా రేటింగ్‌లిచ్చింది. వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగ మిషన్ కింద, సంక్షేమ రంగాన్ని సాంఘిక మిషన్‌గా పరిగణిస్తూ రేటింగ్‌లివ్వగా.. ఈ రెండు రంగాల్లో రేటింగ్‌లు వైఫల్యాల్నే సూచిస్తున్నాయి. ప్రణాళికాశాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు బుధవారం నుంచి నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సులో సమీక్షించనున్నారు. రేటింగ్‌లో వెనుకబడిన రంగాల్ని నిలదీయనున్నారు. తొమ్మిది రంగాల మిషన్లకు కలపి మొత్తం 1,036 అంశాల్లో రేటింగ్ ఇవ్వగా.. ఇందులో సగానికిపైగా అంటే 533 అంశాల్లో పనితీరు సంతృప్తికరంగా లేదని నివేదిక తెలిపింది. 399 అంశాల్లో పనితీరు సంతృప్తికరంగా లేదంది. 134 అంశాల్లో సంతృప్తికరమంది. 123 అంశాల్లో పనితీరు బాగా ఉందని, 380 అంశాల్లో పనితీరు చాలా బాగా ఉందని తెలిపింది.

 వ్యవ‘సాయ’మేది?
 వ్యవసాయ రంగానికి సంబంధించి సూక్ష్మ పోషకాలను 16,09,730 హెక్టార్లకు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. 6,10,442 హెక్టార్లకు మాత్రమే సరఫరా చేశారు. ఇది కేవలం 38 శాతం మాత్రమే. అలాగే ఆహార ధాన్యాల ఉత్పత్తి.. లక్ష్యానికి కన్నా భారీగా పడిపోయింది. 353.13 లక్షల మెట్రిక్ టన్నులకు 270.36 లక్షల మెట్రిక్ టన్నులే సాధించారు. అంటే 82.77 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు లక్ష్యానికన్నా తగ్గిపోయింది. మొత్తం వ్యవసాయ రంగానికి రూ.66,222 కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా రూ.63,847 కోట్లనే ఇచ్చారు.

 సంక్షేమం అంతంతే...
 కొత్తగా లక్షమందికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపచేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. 7,610 మందికి మాత్రమే ఇవ్వడం గమనార్హం. వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే 10,500 మంది బీసీ విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పించింది 1,198 మందికే. కొత్తగా 3.50 లక్షలమంది బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశిస్తే.. 1.64 లక్షల మందికి మాత్రమే వర్తింపజేయగలిగారు. అలాగే కొత్తగా 3.50 లక్షల బీసీ విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని భావించగా.. ఇచ్చింది 2.48 లక్షల మందికే.

4.86 లక్షలమంది బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రెన్యువల్ చేయాలని నిర్దేశించుకోగా.. చేసింది 3.57 లక్షలమందికి మాత్రమే. అదే సమయంలో 4.86 లక్షలమంది బీసీ విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు రెన్యువల్ చేయాల్సి ఉండగా.. 3.74 లక్షలమందికి మాత్రమే చేశారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద 300 మంది ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక సాయమందించాలనేది లక్ష్యంకాగా.. అందించింది 80 మందికే. 1,500 మంది ఎస్సీ విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్దేశించుకోగా కేవలం 432 మందికే ఇప్పించారు. 5.09 లక్షలమంది ఎస్సీ గృహాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 3.50 లక్షల గృహాలకే కల్పించారు.

 యువతకు శిక్షణలో వైఫల్యం
 నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారా 1.50 లక్షలమందికి శిక్షణ ఇప్పించాలని లక్ష్యంకాగా 63,142 మందికే ఇప్పించారు. ఇందులో ప్లేస్‌మెంట్(ఉద్యోగం) లభించింది 32 మందికే. అలాగే సాంకేతిక విద్యాశాఖ ద్వారా 6వేలమందికి శిక్షణ ఇప్పించాలని లక్ష్యంకాగా.. 2,927 మందికే శిక్షణ ఇప్పించారు.
 
 నేడు, రేపు కలెక్టర్ల సమావేశం
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రప్రభుత్వం రెండు రోజులపాటు నిర్వహించే జిల్లా కలెక్టర్ల సమావేశం బుధవారం  విజయవాడ వెటర్నరీ కాలనీలోని వెన్యూ కన్వెన్షన్ హాలులో ప్రారంభమవనుంది. సీసీఎల్‌ఏ అనిల్‌చంద్ర పునేఠా స్వాగత ఉపన్యాసంతో సమావేశాల్ని ప్రారంభిస్తారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభోపన్యాసం చేస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ రెండంకెల వృద్ధిపై ఉపన్యాసమిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు 2016-17 ఆర్థిక సంవత్సర లక్ష్యాలు, ఫలితాలపై మాట్లాడనున్నారు. మొదటిరోజు మూడు సెషన్లు, రెండోరోజు మూడు సెషన్లుగా సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement