విష్ణు సేనాపతి  విష్వక్సేనుడు | Vishnu Senapati Vishwaksena | Sakshi
Sakshi News home page

విష్ణు సేనాపతి  విష్వక్సేనుడు

Published Sun, Aug 5 2018 12:30 AM | Last Updated on Sun, Aug 5 2018 12:30 AM

Vishnu Senapati Vishwaksena - Sakshi

శైవ సంప్రదాయంలో గణపతిని తలుచుకున్నట్లుగానే వైష్ణవులు తొలిగా విష్వక్సేనుని స్మరిస్తారు,ç పూజిస్తారు. ఈయన విష్ణుగణాలకు అధిపతి. వైకుంఠ సేనాని. సాక్షాత్తు విష్ణువులాగే చతుర్భుజాలతో ఉంటాడు. కుడిచేతిలో అభయముద్రనిస్తూ ఎడమచేతిని కటి వద్ద ఉంచుకుని, పర హస్తములలో శంఖు చక్రాలను ధరించి దర్శనమిస్తాడు. వైష్ణవులు స్మరించే గురుపరంపరలో ఈయన స్థానం మూడవది. మొదట విష్ణువు, రెండు లక్ష్మీ దేవి. విష్వక్సేనుల వారు భాద్రపద మాసంలో పూర్వాషాఢ నక్షత్రంలో ఆవిర్భవించారు.  బంగారుశరీర వర్ణంతో విశాలమైన కనులతో పుట్టుకతోనే దేహంపై శంఖం, ఖడ్గం, ధనస్సు చిహ్నాలతో సేనాపతి అవుతాడనే సంకేతంగా పుడతాడు. ఈయనను కశ్యపమహర్షి పెంచి వేదాన్ని, మంత్రశాస్త్రాలను  నేర్పిస్తాడు.  తరువాత వృషభాద్రిపై  12 సంవత్సరాల పాటు తపస్సు చేసి శ్రీనివాసుని అనుగ్రహంతో సేనాపతిగా అవతరిస్తాడు.  తిరుమలలో వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య భాగంలో విష్వక్సేనుల వారి సన్నిధి ఉందనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. స్వామివారి ఆలయానికి చుట్టూ ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో ఈ సన్నిధి కనిపిస్తుంది. అయితే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఈ ముక్కోటి ప్రదక్షిణ ప్రాంతాన్ని తెరిచి ఉంచడం జరుగుతుంది. అప్పుడు కూడా భక్తుల రద్దీ వలన ఈ సన్నిధి దగ్గరికి వెళ్లడానికి అందరికీ అవకాశం ఉండదు.  తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలలో ముందుగా సేనాపతి ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈయన నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా వచ్చిన తరువాత వెంకటేశ్వర స్వామి వారు వాహనంపై వేంచేస్తారు.

విజ్ఞానాన్నిచ్చే విష్వక్సేన రూపం
విష్వక్సేనుడు జ్ఞాన ప్రదాయకుడు. ఈయన నాలుగు చేతులతో పద్మపీఠంపై ఆసీనుడై నిజ హస్తాలతో కుడిచేత అభయ ముద్ర లేక సూచి హస్తం లేక పుష్పాన్ని ధరించి ఉంటాడు. కొన్నిచోట్ల దండాన్ని ధరించి కూడా కనిపిస్తాడు. ఎడమచేత కటి ముద్రను గాని, గదను గానీ ధరించి ఉంటాడు. పర హస్తాలలో శంఖు చక్రాలను ధరిస్తాడు. విష్ణు స్వరూపానికి ఈయనకు ఒకటే తేడా. మహావిష్ణువుకు శ్రీవత్సం బ్రహ్మసూత్రం ఉంటాయి. విష్వక్సేనుడికి అవి ఉండవు. వైష్ణవాగమాలైన పాంచరాత్రాగమం, వైఖానస ఆగమం విష్వక్సేన స్వరూపాన్ని చాలా చక్కగా వివరించాయి. ఈ స్వామి ముక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని పరాశర సంహిత చెప్పింది.
– డా. ఛాయా కామాక్షీదేవి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement