‘ఏరా! పెద్దవాడిని అయిపోయాననుకుంటున్నావా’ అంటూ టీనేజ్‌లోకి అడుగుపెట్టిన పిల్లలతో తల్లిదండ్రులు తరచు అంటుంటారు. ‘లాలయేత్ పంచవర్షాణి, దశవర్షాణి తాడయేత్, ప్రాప్త్యేషు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్’ అని శాస్త్రం చెబుతోంది. పిల్లలకు పది సంవత్సరాలు వచ్చేవరకు వారిని మృదువుగా దండించవచ్చు. పదహారేళ్ల వయసులోకి వచ్చిన పిల్లలను స్నేహితులుగానే చూడాలి అని ఈ శ్లోకం చెబుతోంది.
టీనేజ్‌లోకి వచ్చారంటే వారిక పిల్లలు కాదు, కొద్దిగా ఎదిగారని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు మెళకువగా పిల్లలతో ఆచితూచి మాట్లాడాలి. ఈ మాట.. ఏళ్లుగా సైకాలజిస్టులు చెబుతున్నదే. ఈ వయసులో హార్మోన్లలో మార్పులు రావడం కారణంగా, వారి ప్రవర్తనలో మార్పు వస్తుందనే విషయం తల్లిదండ్రులకు అనుభవమే కనుక, పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వేరే దారి లేదు. వారిని మన మార్గంలోకి తెచ్చుకోవడానికైతే.. మొదట వారి ధ్యాసను మనం చెబుతున్న మాట వైపు మళ్లించుకుని, మనం చెప్పదలచింది నొప్పించకుండా చెప్పాలి.
వారు మాట్లాడుతున్నప్పుడు కూడా మనం శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటున్నామన్న భావన కూడా వారికి కలగాలి. కొంతమందికి వయసొచ్చిన పిల్లలతో మాట్లాడేందుకు టాపిక్‌లే దొరకవు! ఎన్ని లేవు చెప్పండి? లేటెస్ట్‌గా వచ్చిన సినిమాలు, సినిమాలో బాగా నటించిన హీరో, పాటకి అందంగా డ్యాన్స్ చేసిన పద్ధతి.. ఇటువంటి విషయాలను ఎంతో ఆశ్చర్యం గొలుపుతున్నట్లుగా కనుబొమ్మలు ఎగరేస్తూ వారితో షేర్ చేసుకోవచ్చు.
సినిమాలు అని ప్రత్యేకంగా అనడం దేనికంటే ఆ వయసులో వినడానికైనా, మాట్లాడడానికైనా వారికి ఆసక్తి కలిగించేవి సినిమాలు, క్రీడలు.. వంటివే కదా. ఇలా మాట్లాడుతున్నప్పుడు పిల్లలు రకరకాల ప్రశ్నలు వేస్తారు. కొన్నిసార్లు సహనం నశించిపోయేవరకు విసిగిస్తూనే ఉంటారు. అటువంటప్పుడే తల్లిదండ్రులు సహనాన్ని, చిరునవ్వును కోల్పోకూడదు అంటున్నారు పేరెంటింగ్ నిపుణులు.
ఒక్కోసారి పిల్లలు చులకనగా మాట్లాడి, పెద్దవారి మనసులను గాయపరుస్తారు. అంతమాత్రాన పెద్దలు తిరిగివారిని గాయపరిచే మాట అనకూడదు. వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం, తల్లిదండ్రులు పిల్లల గురించి ఎక్కువ ఆశించి, వారి మీద ఒత్తిడి పెట్టడమే పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించడానికి కారణం అవుతోంది. చదువొక్కటే జీవితం కాదని పెద్దలు అర్థం చేసుకుని, పిల్లలలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి, ఆ అంశాలకు చెందిన ఉదాహరణలు చెబుతూ, వారి మీద ప్రేమ చూపుతూ, వారికి కొత్త కొత్త విషయాలు చెబుతూ, వారిని మంచివారుగా తీర్చిదిద్దవచ్చునని కూడా అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment