చూపురేఖలు | We have yellow color for seats assigned to women in city buses | Sakshi
Sakshi News home page

చూపురేఖలు

Published Mon, Jun 10 2019 2:21 AM | Last Updated on Mon, Jun 10 2019 2:21 AM

We have yellow color for seats assigned to women in city buses - Sakshi

కొత్త భావనలకు పాతవి ఎప్పుడూ సహాయ నిరాకరణగానే ఉంటాయి. ఆ మాత్రం ఒరిపిడి లేకుంటే మార్పు పరిపూర్ణం కాదు కూడా.  కాలానికి తగ్గట్టు చూపూ ఉంటే బొట్టుందా, భుజాలపైకి కత్తిరించిన జుట్టుందా అని కళ్లు వెతుక్కోవు.

మాధవ్‌ శింగరాజు
మన దగ్గర సిటీ బస్సుల్లో స్త్రీలకు కేటాయించిన సీట్లకు పసుపు రంగు ఉంటుంది. సీట్‌ల రాడ్‌లకు, సీటు వెనుక భాగానికీ పూసి ఉండే ఆ పసుపు రంగును బట్టి అవి స్త్రీల సీట్లని తేలిగ్గా గుర్తించవచ్చు. అదొక్క గుర్తే కాదు. కిటికీ పైన ‘స్త్రీలు’ అని రాసి ఉంటుంది. అది మాత్రమే కాదు. స్త్రీ బొమ్మ కూడా గీసి ఉంటుంది. ఇన్ని ఉన్నా ఆ స్త్రీల సీట్లలో కూర్చునే ‘స్త్రీలు కాని వాళ్లు’ ఉండనే ఉంటారు. స్త్రీల సీట్లను పసుపురంగుతో సూచించడం, స్త్రీల చిత్రాన్ని గియ్యడం, ‘స్త్రీలకు మాత్రమే’ అని రాయడం ఏళ్లుగా ఒక పద్ధతిలా వస్తోంది. బస్సులు, రైళ్లలోనే కాదు.. స్త్రీలకు ప్రత్యేకం అని సూచించవలసిన ప్రతి చోటా ఏదో ఒక రంగు ‘అటువైపు వెళ్లకండి’ అని మగవాళ్లకు చెబుతూనే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పసుపు, ఇంకొన్ని ప్రాంతాల్లో పింక్‌. రంగైతే  చదువులేని వాళ్లకు కూడా సూచనను వెంటనే అర్థం చేయిస్తుంది.

(అదీ అర్థం కానివాళ్లకు స్త్రీ చిత్రం ఎలాగూ ఉంటుంది). అయితే ఈ రంగుల ఇండికేషన్‌ కూడా కొంతమందికి నచ్చడం లేదు. స్త్రీలకు పింక్‌ ఏమిటి? అసలు రంగేమిటి? అనే మాట వినిపిస్తోంది కొన్నాళ్లుగా. మన దగ్గరికింకా ఆ వాదన రాలేదు. వస్తే, పసుపు రంగేమిటి? స్త్రీలంటే పసుపూ కుంకుమలేనా ఏమిటి అనే అవకాశమైతే ఉంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో జెండర్‌ సైనేజ్‌లను తొలగించడం మొదలైంది. సైనేజ్‌లంటే.. ఇది ఆడవాళ్లకు, ఇది మగవాళ్లకు అని సూచించే స్త్రీ, పురుషుల సంకేత చిత్రాలు. మనం మరీ అంతగా.. లైంగికస్పృహ లేనంతగా.. మనుషులంతా ఒక్కటే అన్నంతగా ‘మానవీకరణ’ చెందలేదు. స్త్రీని మనం చూసే దృష్టి ఒకటి ఉంటుంది కదా, అలా చూడ్డానికే అలవాటు పడి ఉన్నాం. దృష్టి అంటే నేత్రదృష్టి కాదు. మనోదృష్టి. అమ్మ బొమ్మ గియ్యమంటే పిల్లలు గుండ్రంగా ఒక సర్కిల్‌ గీసి, రెండు కళ్లు, రెండు చెవులు, ముక్కు వేసి, చక్కగా పాపిట తీసి, నుదుటి మధ్యలో బొట్టు పెట్టేస్తారు. చెవులకు రింగులు పెడతారు.

నార్త్‌ పిల్లలైతే అమ్మ తల చుట్టూ చీర కొంగు కప్పుతారు. పెద్దవాళ్లమంతా కూడా పిల్లలుగా ఉండి ఎదిగినవాళ్లమే కాబట్టి భారతీయ స్త్రీమూర్తి అనగానే మన ఊహల్లోకి మొదట వచ్చే స్త్రీ రూపురేఖలు అమ్మవే. బొట్టు, తలచుట్టూ కొంగు. అందుకే స్త్రీలకు విడిగా కేటాయించిన సీట్ల దగ్గర, కౌంటర్‌ల దగ్గర, కంపార్ట్‌మెంట్‌ల మీద ఇప్పటికీ మాతృమూర్తిని తలపించే చిత్రం మాత్రమే కనిపిస్తుంది. ఉద్యోగరీత్యా గానీ, ఒంటికి అనువుగా ఉండడం కోసం కానీ చీర కట్టు, బొట్టు మస్ట్‌ కాదనుకునే ఆధునిక మహిళాయుగంలోకి మనం వచ్చినప్పటికీ మనమింకా ‘భారతీయ స్త్రీమూర్తి’ దగ్గరే ఆగిపోయాం. అవును ఎందుకు ఆగిపోయాం?! రెండు నెలల క్రితం పశ్చిమ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఎ.కె.గుప్తా ముంబై లోకల్‌ ట్రైన్‌ల çపనితీరు పర్యవేక్షణల విధుల్లో ఉన్నప్పుడు ఆయనకీ ఇలాగే ఆగిపోయిన ఆలోచన ఏదో కలిగింది. ట్రైన్‌లతో పోటీ పడి మరీ మహిళలు ఉద్యోగాలకు పరుగులు పెడుతూ, విశ్వాంతరాళాలకు సైతం రాకెట్‌లా దూసుకెళుతున్న ఈ కాలంలో ఇంకా ఆ సేమ్‌ ఓల్డ్‌ ట్రెడిషనల్‌ స్త్రీ మూర్తి చిత్రాన్నే బోగీలపై గీయించడం ఏమిటి అనుకున్నారు.

వెంటనే ఆ చిత్రాన్ని ఆధునిక మూర్తిగా రీడిజైన్‌ చేయించారు. ఒక యువతి ఫార్మల్‌ సూట్‌లో ఉంటుంది. ఆమె జుట్టు చక్కగా భుజాల మీదికి వదిలేసి ఉంటుంది. నుదుటిపై బొట్టు ఉండదు. మనిషి నాజూకుగా ఉంటుంది. నాగరికంగా చేతులు కట్టుకుని ఉంటుంది. పెదవులపై కనిపించీ కనిపించని నవ్వు ఉంటుంది. ఈ చిత్రాన్ని గుప్తా దగ్గర ఉండి మరీ చేయించారు. ఇప్పటివరకు పన్నెండు కోచ్‌లు ఉండే రెండు రైళ్లకు వాటిని వేయించారు. ఇంకో రెండు వారాల్లో మిగతా 108 లోకల్‌ ట్రైన్‌లలోనూ మహిళా కంపార్ట్‌మెంట్‌ల మీద, లోపల మహిళలు కూర్చునే చోట ఈ ఆధునిక యువతి చిత్రాన్ని పెయింట్‌ చేయడం పూర్తవుతుంది. ఈ ‘లోగో’ మార్పు గురించి పశ్చిమ రైల్వే మే 27 ఉదయాన్నే ఒక సర్‌ప్రైజింగ్‌ ట్వీట్‌ పెట్టింది. ‘కాలానుగుణంగా మారే ప్రయత్నంలో భాగంగా పశ్చిమ రైల్వే మహిళల కోచ్‌ మీద ఉండే మహిళా చిహ్నాన్ని ఆధునీకరిస్తోంది.’ అని ఆ ట్వీట్‌లో ఉంది. వెంటనే రియాక్షన్‌ మొదలైంది.

‘అమ్మలో ఆధునికం లేదనుకున్నార్రా మీరు..’ అని ఒకరెవరో.. ‘అమ్మ, నాన్న, ఒక తమిళమ్మాయి’ సినిమాలో బండ్ల గణేశ్‌లా ఊగిపోయారు. (‘ఆడపిల్లలంటే ఆటబొమ్మల్లా కనబడుతున్నార్రా మీకు..’ అనేది బండ్ల గణేశ్‌ డైలాగ్‌ ఆ సినిమాలో). గుడ్‌ థాట్‌ అని ఒకరు అన్నారు. అలాగే ఒక సూచన కూడా చేశారు. బొత్తిగా ఒక ఉమన్‌నే కాకుండా, ఎత్నిక్‌ వేర్, ఆఫీస్‌ వేర్‌ ఇలా రకరకాల దుస్తులలో ఉన్న గ్రూప్‌ ఆఫ్‌ మహిళల్ని సింబల్‌గా పెడితే బాగుంటుందన్నారు. సునాల్‌ బాత్రా అనే అమ్మాయి.. ‘వావ్‌! నిద్రలేవగానే ఒక అమేజింగ్‌ న్యూస్‌’ అని ఎగ్జయిట్‌ అయింది.  ‘మోడర్నైజింగా! సిగ్గులేకపోతే సరి. భారతీయ సంప్రదాయాన్ని బ్యాక్‌వర్డ్‌నెస్‌ అంటున్నారా మీరు!’ అని ఇంకొకరు. ‘దిస్‌ ఈజ్‌ మియర్‌ టోకెనిజం’ అని ఇంకో కామెంట్‌. ‘టోకెనిజం’ అంటే ఏమీ చెయ్యకుండానే చేసినట్లు కనిపించే ప్రయత్నం చెయ్యడం. మొత్తం మీద ఈ బొమ్మమార్పు ఆలోచనను దాదాపుగా ఆడవాళ్లంతా ‘ఎక్స్‌లెంట్‌’ అన్నారు.

మగవాళ్లంతా ‘టైమ్‌కి బండ్లు నడపడం మీద దృష్టి పెట్టండి’ అన్నారు. ‘మీ డ్యూటీ ఏదో అది సక్రమంగా చెయ్యండి. సామాజిక మార్పు గురించి మీకెందుకు  అనడం’ ఇది. ఇంట్లో కూడా చూడండి. పిల్లలు ఉత్సాహంగా ఒక కొత్త సామాజికపరమైన ఆలోచనతో  ఏదైనా బొమ్మను గీసుకొస్తే.. ‘ఈ తెలివితేటలు ఎంసెట్‌లో చూపించు’ అనేస్తాం. ఎంసెట్‌లో ర్యాంక్‌ సాధించడం ఒక్కటే మన ఇంట్లోంచి జరగవలసిన గొప్ప సామాజిక మార్పు అన్నట్లు! కొత్త భావనలకు పాతవి ఎప్పుడూ సహాయ నిరాకరణగానే ఉంటాయి. ఆ మాత్రం ఒరిపిడి లేకుంటే మార్పు పరిపూర్ణం కాదు కూడా.

పెరిగి పెద్దవుతున్నా కూడా సీసా పాలకు ముఖాన్ని తిప్పేసుకుంటూ తల్లిపాలకు మాత్రమే చేతులు చాచడానికి అలవాటు పడ్డ మారాల బిడ్డలా.. స్త్రీ తలకొంగులో మాత్రమే సంప్రదాయాన్ని చూడ్డానికి అలవాటు పడిన  జీవనాడులు.. స్త్రీ తలదించుకుని నడవడంలో, తలకొంగు కప్పుకుని మాట్లాడటంలో సంప్రదాయం లేదనీ, స్త్రీని గౌరవించి ఆమెకు ఇవ్వవలసిన స్పేస్‌ని ఆమెకు ఇవ్వడంలో మాత్రమే సంప్రదాయం ఉందనీ గ్రహింపునకు వచ్చేవరకు ఈ ఇనిషియల్‌ ఘర్షణ ఉండేదే. కాలానికి తగ్గట్టు చూపూ ఉంటే బొట్టుందా, భుజాలపైకి కత్తిరించిన జుట్టుందా అని కళ్లు వెతుక్కోవు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement