రోమియో... జూలియట్‌ | weekly world wide ground news | Sakshi
Sakshi News home page

రోమియో... జూలియట్‌

Published Mon, Apr 3 2017 12:46 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

రోమియో... జూలియట్‌ - Sakshi

రోమియో... జూలియట్‌

గ్రౌండ్‌  అప్‌
ఈవారం విశేషాల రౌండప్‌


ఒకే హాస్పిటల్‌లో, పక్క పక్క వార్డులలో 18 గంటల తేడాతో రోమియో, జూలియట్‌లు జన్మించిన ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని సంబ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతోంది. మార్చి 19న ఆదివారం నాడు యు.ఎస్‌.లోని కోస్టల్‌ కరొలినా హాస్పిటల్‌లో మధ్యాహ్నం 2 గంటల 6 నిముషాలకు రోమియో జన్మించాడు! తర్వాతి రోజు ఉద్యం 8 గంటల 14 నిముషాలకు జూలియట్‌ జన్మించింది. ఈ సంగతి వారిద్దరి తల్లిదండ్రులకు తెలియదు. కేసీ క్లేషల్ట్‌ అనే మహిళా ‘న్యూబార్న్‌ ఫొటోగ్రాఫర్‌’ ఎప్పటిలా హాస్పిటల్‌లో కొత్తగా పుట్టిన పిల్లల్ని ఫొటోలు తీసేందుకు వచ్చినప్పుడు ఈ అపురూపమైన సందర్భంగా గురించి తెలిసింది. అది కూడా అనుకోకుండా. యు.ఎస్‌.లో ఇంకా ఇతర పాశ్చాత్య దేశాలలో సాధారణంగా బిడ్డ పుట్టకముందే ఒక పేరు అనుకుంటారు. అలా... ‘మీ అబ్బాయి పేరు ఏమిటి? అని కేసీ అడిగినప్పుడు ఈ వార్డు దంపతులు ‘రోమియో ఆర్కెంజల్‌ హెర్మాండజ్‌’ అని చెప్పారు. ‘మీ అమ్మాయి పేరు ఏమిటి?’ అని అడిగినప్పుడు ఆ పక్క వార్డు దంపతులు ‘జూలియట్‌ ఎవాంజిలిన్‌ షిప్లెట్‌’ అని చెప్పారు. ఇకనేం ఇద్దరి పేర్లలో రోమియో, జూలియట్‌లు ఉన్నాయని, ఇద్దరినీ రోమియో–జూలియట్‌లలాగే ముస్తాబు చేసి, షేక్స్‌పియర్‌ కాలం నాటి కావ్య నాయికానాయకులు గుర్తుకు వచ్చేలా ఫొటోలు తీశారు కేసీ. ఎంత ముద్దుగా ఉన్నారో చూశారుగా!

టైటానిక్‌ ట్రిప్‌!http://img.sakshi.net/images/cms/2017-04/81491161134_Unknown.jpg
అట్లాంటిక్‌ సముద్ర గర్భంలో ఉపరితల జలాలకు 4 వేల మీటర్ల అడుగున చిక్కుకుని ఉన్న టైటానిక్‌ ‘శకల నౌక’ దగ్గరికి... వచ్చే ఏడాది మే నెల నుంచి ఔత్సాహికుల వన్‌ టైమ్‌ సాహస యాత్ర మొదలౌతోంది! ఎనిమిది రోజులపాటు భద్రమైన ఒక మానవ జలాంతర్గామిలో సాగే ఈ టైటానిక్‌ యాత్రను లండన్‌ ట్రావెల్‌ కంపెనీ ‘బ్లూ మార్బుల్‌ ప్రైవేట్‌’ నిర్వహిస్తోంది. కెనడా లోని న్యూఫౌండ్‌ల్యాండ్‌ నుంచి ఈ టైటానిక్‌ సందర్శక ప్రయాణికులు బయల్దేరుతారు. టిక్కెట్‌ ధర మనిషికి లక్షా 5 వేల 129 డాలర్లు! సుమారుగా 68 లక్షల 20 వేల రూపాయలు. 1912 ఏప్రిల్‌లో ఇంగ్లండ్‌ లోని సౌథాంప్టన్‌ నుంచి యు.ఎస్‌.లోని న్యూయార్క్‌కు బయల్దేరిన టైటానిక్‌ నౌక మార్గం మధ్యలో మంచుకొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. నౌకలో మొత్తం 2,224 మంది ప్రయాణీకులు (నౌక సిబ్బందితో కలిసి) ఉండగా, వారిలో 1500 మందికి పైగా మరణించారు. నౌక మునిగిన 93 ఏళ్ల తర్వాత రాబర్ట్‌ బల్లార్డ్, ఆయన అన్వేషకుల బృందం న్యూఫౌండ్‌లాండ్‌ దగ్గరి సెయిట్‌ జాన్స్‌కు 380 నాటికల్‌ మైళ్ల దూరంలో టైటానిక్‌ ప్రధాన శకలాన్ని కనుగొంది. ఇప్పుడు అక్కడికే మనవాళ్ల ప్రయాణం.

పాదాక్రాంతం
http://img.sakshi.net/images/cms/2017-04/41491161284_Unknown.jpgఎడమవైపు ఉన్న ఆవిడ నికోలా స్టర్జన్‌. స్కాట్లాండ్‌ ఫస్ట్‌ మినిస్టర్‌ (ప్రధాని). కుడివైపు ఉన్న ఆవిడ థెరిసా మే. బ్రిటన్‌ ప్రధాని. ఇటీవల ఇద్దరూ గ్లాస్‌గోవ్‌లో కలుసుకున్నారు. గ్లాస్‌గోవ్‌ స్కాట్లాండ్‌లో ఉంటుంది. ‘ఐరోపా సమాఖ్య’ (ఇ.యు.) నుంచి గత ఏడాది బ్రిటన్‌ బయటికి వచ్చేసింది. ఇప్పుడు బ్రిటన్‌ నుంచి విడిపోతానని స్కాట్లాండ్‌ పట్టుపట్టింది (స్లాట్లాండ్‌ 1707 నుంచి యు.కె.లో భాగంగా ఉంది). ఈ సమస్యను చక్కబరచుకోవడం కోసమే ఈ ఇద్దరు ప్రధానమంత్రులూ ఇలా ఒకచోట కూర్చున్నారు. విషయం చాలా సీరియస్‌ అని తెలుస్తూనే ఉంది కదా. అయితే దాన్ని వదిలేసి, బ్రిటన్‌ పత్రిక ‘డైలీ మెయిల్‌’ వీళ్లిద్దరి కాళ్లపై దృష్టిని కేంద్రీకరించింది!

ఎవరి కాళ్లు అందంగా ఉన్నాయో చెప్పండి అని పేద్ద హెడ్డింగ్‌ పెట్టింది. పైగా ఈ దేశాధినేతల కాళ్ల విలక్షణతను కూడా వర్ణించింది. నికోలా కాళ్లు... ఏక్‌దమ్‌ ఫ్లర్టీ అట! టాంటలైజింగ్‌లీ క్రాస్డ్‌ అట!! ఎ డైరెక్ట్‌ అటెంప్ట్‌ ఎట్‌ సెడెక్షన్‌ కూడానట! కవ్వించేలా, ఆశపెట్టి వేధించేలా, – ఎట్‌ ద సేమ్‌ టైమ్‌– వ్యామోహం మూతి పగలగొట్టేలా ఉన్నాయని దీనంతటికీ అర్థం. ఇక థెరిసా మే. పొంచి ఉన్న తీవ్రవాది బుద్దిగా దగ్గర పెట్టుకున్న ఆయుధాల్లా ఉన్నాయట ఈవిడ కాళ్లు! జనం డెయిలీ మెయిల్‌ను ఎలా తిడుతున్నారంటే... మాటల్లో చెప్పలేం. మహిళలను కించపరిచే వెర్రిరాతల్ని రాయడం తక్షణం మానుకోవాలని ఫోన్‌ చేసి మరీ... తలా ఒకటి అంటిస్తున్నారు. ట్విటర్‌లోనైతే ఇక చెప్పలేం. తిట్లే తిట్లు.

కరుణ రసంhttp://img.sakshi.net/images/cms/2017-04/51491161398_Unknown.jpg
రేయాన్‌కు తొమ్మిదేళ్లు. అకస్మాత్తుగా ఇటీవల ఒక రోజు న్యూ మెక్సికోలోని ఒక రోడ్డు పక్కన నిమ్మరసం అమ్మడం మొదలు పెట్టాడు! రేయాన్‌కి రిచర్డ్‌ శాంఛెజ్‌ అనే తాతగారు ఉన్నారు. ఆ తాతగారిని బతికించుకోడానికే రేయాన్‌ ఇలా వ్యాపారిగా అవతారమెత్తాడు. తాతగారికి రెండు రకాల క్యాన్సర్‌లు! అవి రెండూ మూడో స్టేజ్‌లో ఉన్నాయి. డాక్టర్లు ఆయనకు సర్జరీ చేసి కడుపులోని కణితి తొలగించారు. ఇక మిగిలింది కీమో థెరపీ ఇవ్వడం. దానికి డబ్బులు కావాలి. కనీసం 5 వేల డాలర్లన్నా కావాలి. అంత మొత్తం తాత దగ్గర లేదు. మనవడే సంపాదించడానికి పూనుకున్నాడు. నిమ్మరసం అమ్మి అంత డబ్బూ సంపాదించాడు. చిన్న పిల్లవాడు... పెద్ద బిజినెస్‌మ్యాన్‌లా లెమన్‌ అమ్మడం చూసి ముచ్చట పడినవారితో, వాడి కథ విని హృదయం ద్రవించిన కస్టమర్‌లతో ఆ రోడ్డంతా కిక్కిరిపోయింది. ఇంకెవరైనా అయితే పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టేవారే కానీ, రేయాన్‌ని చూశాక.. ‘అమ్ముకో’ అని స్పెషల్‌ పర్మిషన్‌ కూడా ఇచ్చారు!

మహానుభావుడు
http://img.sakshi.net/images/cms/2017-04/71491161765_Unknown.jpgకర్నాటకలో లీటరు పెట్రోలు 76.28 రూ. లీటరు డీజిల్‌ 63.16 రూ. పెట్రోలు కన్నా డీజిలు 13.12 రూ. తక్కువ. (నిన్నమొన్న తగ్గిన రేట్లకు ముందు ధరలు).  అయితే ఇదే డీజిలు మంగుళూరు ఎమ్మెల్యే మొహియుద్దీన్‌ బవా చేత లక్షల రూపాయలు ఖర్చుపెట్టింది! ఈ మధ్య ఆయన కోటీ 65 లక్షల రూపాయలు పెట్టి వాల్వో ఎక్స్‌సి90 టి8 హైబ్రిడ్‌ ఎక్సెలెన్స్‌ లగ్జరీ కారు కొన్నారు. అది పెట్రోల్‌ కారు. తన కొడుకు పేరిట కొన్నారు. ఆ పుత్రరత్నం  కారును తీసుకెళ్లి, పెట్రోల్‌ కొట్టమని చెప్పి ఎవరితోనో హస్క్‌ కొడుతూంటే... పెట్రోల్‌ బంక్‌ కుర్రాళ్లు దీనికి డీజిల్‌ కొట్టేశారు.

బండి స్ట్రక్‌ అయిపోయింది. దాన్ని వేరే ఇంకో వెహికల్‌లో రిపేర్‌ కోసం బెంగుళూరు తరలించారు. ఇంత జరిగినా ఎమ్మెల్యే గారికి కొడుకు మీద కానీ, పెట్రోల్‌ బంకు కుర్రాళ్ల మీద గానీ కోపం రాలేదు! పొరపాట్లు మనుషులు చేయకపోతే, మిషన్లు చేస్తాయా అని నవ్వుతూ అంటున్నారు!

నాట్‌ ఓకేhttp://img.sakshi.net/images/cms/2017-04/51491161862_Unknown.jpg
క్రియేటివిటీ కొన్నిసార్లు వికటిస్తుంది. నార్త్‌ కరోలినాలోని ఒక ఆభరణాల కంపెనీ తన ప్రచార హోర్డింగ్‌లో ఇలాగే మితిమీరిన క్రియేటివిటీని ప్రదర్శించి, అప్రతిష్ట తెచ్చుకుంది. ‘సమ్‌టైమ్స్‌ ఇట్‌ ఈజ్‌ ఓకే టు త్రో రాక్స్‌ ఎట్‌ గర్ల్స్‌’ అని ప్రధాన కూడలిలో ఆ కంపెనీ పెట్టించిన హోర్డింగ్‌... ఇప్పుడు ఆ కంపెనీ మీదే రాళ్లు పడేలా చేస్తోంది. పాపం ఆ కంపెనీ ఉద్దేశం మంచిదే. అమ్మాయిలకు... అమూల్యమైన రాళ్లు, రత్నాలను కానుకగా ఇవ్వండి అని చెప్పడం. కానీ చెప్పిన విధానమే బాగోలేదు. ‘కొన్నిసార్లు అమ్మాయిల మీద రాళ్లు విసరడం కూడా మంచిదే’ అని సృజనాత్మకంగా రాయించింది! ‘ఉద్దేశాలను పిల్లలు అర్థం చేసుకోలేరు కదా, ఆ మాటల్ని ఉన్నవి ఉన్నట్లే తీసుకుంటే ఎంత ప్రమాదం’ అని ఆ బోర్డును చూసినవాళ్లు చికాకు పడుతున్నారు.

తిక్క మనిషా?!
http://img.sakshi.net/images/cms/2017-04/41491161979_Unknown.jpgబాబ్‌ డిలాన్‌ తనకు వచ్చిన నోబెల్‌ బహుమతిని స్వీకరించడానికి నేటికీ స్వీడన్‌ వెళ్లలేదు! ఆయన గనుక ఈ జూన్‌ 10 లోపు స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌కి వెళ్లి చిన్న స్పీచ్‌ అయినా ఇవ్వకపోతే నోబెల్‌ బహుమతి ద్వారా ఆయనకు వచ్చే 9 లక్షల 10 వేల డాలర్ల నగదు రాకుండాపోతుంది! పెద్ద స్పీచ్‌ అక్కర్లేదు. ఓ చిన్న పాట కచేరి, ఓ వీడియో, కనీసం ఓ పాట... ఏదైనా సరే, నోబెల్‌ సందర్భాన్ని గుర్తుచేస్తూ ప్రదర్శిస్తే చాలు ఈ నగదు బహుమతికి ఆయన యోగ్యుడైనట్లే. ఇది సంప్రదాయం కూడా. ఏటా విజేతను అక్టోబర్‌లో ప్రకటిస్తారు. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి రోజైన డిసెంబర్‌10న విజేతకు బహుమతిని ప్రదానం చేస్తారు. ఏ విజేతైనా స్టాక్‌హోమ్‌కు వెళ్లలేని పరిస్థితి ఉంటే... డిసెంబర్‌ పది నుంచి ఆరు నెలల లోపు వెళ్లి తీసుకోవాలి.

కానీ నేటికీ బాబ్‌ డిలాన్‌ స్పందించలేదు!  నిజానికి అవార్డు విషయంలో మొదటి నుంచి ఆయన పెద్ద ఉత్సాహంతో లేరు! నోబెల్‌ కమిటీవాళ్లు అవార్డును ప్రకటించిన చాలా కాలం తర్వాత ఎప్పుడో డిలాన్‌ థ్యాంక్‌ గివింగ్‌ నోట్‌ మాత్రం పంపారు. అంతే తప్ప నోరు తెరిచి ధన్యవాదాలు తెలియజేయలేదు! ఏప్రిల్‌ 9న స్వీడన్‌లోని లుండ్‌లో డిలాన్‌ కచేరీ ఉంది. బహుశా అప్పుడేమైనా పెద్ద మనసుతో నోబెల్‌ను స్వీకరిస్తాడేమో చూడాలి. అయితే ఆ కచేరీ... నోబెల్‌ అవార్డుల ప్రకటనకు చాలా ముందే ఖరారైనది కావడంతో ఒక వేళ డిలాన్‌... లుండ్‌కి వచ్చినా, బహుమతి తీసుకోకుండా అటునుంచి అటే వెనక్కు వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు. ఏంటో ఈ తిక్క మనిషి! తొమ్మిది లక్షల పది వేల డాలర్లంటే మాటలా?! ఐదు కోట్ల 90 లక్షల రూపాయాలకు పైమాటే!

వేడి భోజనం... వెచ్చటి కబుర్లు!http://img.sakshi.net/images/cms/2017-04/61491162144_Unknown.jpg
ఈయన పేరు జార్జి లాఫ్టస్‌. వయసు 100. ఇక ఈయన భార్య ఫిలిస్‌. ఈమె వయసు 94. ఫిలిస్‌కు జార్జితో 17 ఏళ్ల వయసులో 1940 ఆగస్టు 10న పెళ్లయింది. ఈ ఏడాది వీళ్లు తమ 77వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. బ్రిటన్‌లో ప్రస్తుతం జీవించి ఉన్న జంటల్లో ఇంత దీర్ఘకాలం ఆరోగ్యంగా, అనందంగా ఉన్న జంట వీళ్లే కావచ్చు. ఎంత దీర్ఘకాలం అంటే.?. పదహారు మంది ప్రధానమంత్రుల ప్రమాణ స్వీకారాలను వీళ్లు చూశారు. రెండేళ్ల క్రితం వీళ్ల 75వ పెళ్లి రోజుకు బ్రిటిష్‌ మహారాణి రెండవ ఎలిజబెత్‌ అభినందన  లేఖ కూడా పంపారు. ఇంతకీ ఏమిటి వీళ్ల దాంపత్య విజయ రహస్యం? సింపుల్‌. వేడి వేడిగా భోజనం చేస్తారట. వెచ్చటి కబుర్లు చెప్పుకుంటారట!రుచికరమైన తిండి, శుచికరమైన సంభాషణ ఉంటే భార్యాభర్తల లైఫ్‌ హ్యాపీగా ఎన్నేళ్లయినా సాగిపోతూనే ఉంటుందట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement