శ్రేయోభిలాషి... మంచిచెడుల్లో తోడు
ఆత్మీయం
ఎవరు ఎంత సంపాదించినా, పోయేటప్పుడు ఏదీ వెంటరాదు. కనీసం పూచికపుల్లను కూడా తాను పోయేటప్పుడు తనతో వెంట తీసుకుపోలేరు. వెంటవుండేదల్లా మన శ్రేయోభిలాషులే. అంటే మన శ్రేయస్సును కోరుకునేవారే. వీరు మన మంచిలోనూ, చెడులోనూ, కష్టంలోనూ, సుఖంలోనూ ప్రతిదానిలోనూ తోడుగా ఉంటారు. మనం నవ్వితే నవ్వుతారు, మనం బాధపడితే వారు కన్నీళ్లు తుడుచుకుంటారు. మనం సంతోషంగా ఉంటే వారు తీపి పంచుకుంటారు. తప్పుడు ఆలోచనలు చేస్తుంటే వారిస్తారు. మంచి చేస్తే ప్రోత్సహిస్తారు. మనవల్ల ఇతరులకు చెడు జరగకుండా నివారిస్తారు.
మన ఇళ్లలో జరిగే విందులు, వినోదాలు, శుభాలు, అశుభాలు వీరు లేకుండా జరగవు. అయితే మనకు శ్రేయోభిలాషులు ఉండాలంటే... పదిమందీ మన వెంట నడవాలంటే మనం కూడా ఒకరి శ్రేయస్సును కోరుకోవాలి. వారి మంచి చెడులలో పాలు పంచుకోవాలి. తోడుగా నిలవాలి. అన్నింటా అండగా ఉండాలి. అవతలి వారి శ్రేయస్సును, అభివృద్ధిని మనస్పూర్తిగా కోరుకోవాలి. వెన్నుదన్ను కావాలి. సమాజమంతా ఇలా ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా ఉంటే ఎంత బావుంటుంది!