మీ ఆవిడకు కోపం రాకుండా ఉండాలంటే...
* కొందరు పురుషులు భార్యను సంబోధించే విషయంలో మర్యాదకు చాలా యోజనాల దూరంలో ఉంటారు. ‘ఒసేయ్’ ‘ఏమే’లాంటి పదాలతో పిలుస్తారు. ఇది మంచి అలవాటు కాదు. ముద్దు పేరుతో పిలవండి.
* టీవి రిమోట్ మీద పురుషులకు మాత్రమే పూర్తి హక్కులు లేవు. ఆమె టీవిలో ఏదైనా కార్యక్రమం చూస్తుంటే ‘‘సోది పోగ్రాం...ఏం చూస్తావ్’’ అని రిమోట్ లాక్కొని మీకు నచ్చిన కార్యక్రమం పెట్టడం అన్యాయం. సంసార విరుద్ధం.
* ‘‘కూరగాయలు తెచ్చిస్తారా’’ అని భార్య అడగగానే ‘‘చాలా పని ఉంది. నువ్వెళ్లి తెచ్చుకో’’ అని తప్పించుకుంటాడు భర్త. దీన్ని మార్చుకోవాలి. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తెచ్చివ్వడం వల్ల మీరు వాకింగ్ చేసినట్లు ఉంటుంది, భార్యకు సహకరించినట్లూ ఉంటుంది.
* భార్య ఏది చెప్పినా ‘నీకెమీ తెలియదు. నోర్మోసుకో’ అని కసురుకొనే భర్తలు ఉన్నారు. ఇలాంటి మాటల వలన మన అహంకారం, అజ్ఞానం బయటపడుతుంది తప్ప...కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. భార్య మాటకు విలువ ఇవ్వడం నేర్చుకోవాలి.
* ‘ఆలస్యంగా ఇంటికి చేరడం నా జన్మహక్కు’ అన్నట్గుగా ప్రవరిస్తుంటారు కొద్దిమంది పురుషులు. ఇలా తరచుగా చేయడం వల్ల కుటుంబానికి, తనకు మధ్య మానసిక దూరం పెరుగుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.