పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు?
సెల్ఫ్ చెక్
చెట్టుకు వేళ్లు ఎంత ప్రధానమైనవో, మనిషికి సచ్చీలత అంతే ప్రధానం. వేర్ల దృఢత్వం మీద చెట్టు ఆధారపడినట్లే, మనిషికి మంచి నడవడి విలువను ఇస్తుంది. క్యారెక్టర్ బిల్డింగ్ చిన్నతనం నుంచే జరగాలి. అందుకే పిల్లల్లో మంచి విలువలను పెంపొందించడానికి తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలు విశేష పాత్ర వహించాలి. మీరు ఎలా పెంచుతున్నారు?
1. పిల్లలకు మంచిబుద్ధులు చెప్పేముందు మీరెలాగ ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటారు.
ఎ. కాదు బి. అవును
2. పిల్లలు మీతో ఎంత సమయం గడుపుతున్నారో గమనిస్తారు. సమాజం గురించి పూర్తి అవగాహనను వారికి అందిస్తారు.
ఎ. కాదు బి. అవును
3. తప్పు, ఒప్పుల ప్రస్తావన తెచ్చేకంటే, మంచిగా ఉండటం ఎలానో నేర్పటానికే ప్రయత్నిస్తారు.
ఎ. కాదు బి. అవును
4. పనిలో శ్రద్ధ, స్వీయ క్రమశిక్షణ, ఇతరుల యందు దయతో ఉండటం, సమాజసేవ, నిజాయితీ, దాతృత్వం మొదలైన లక్షణాలు పిల్లల్లో పెంపొందించటానికి ప్రయత్నిస్తారు.
ఎ. కాదు బి. అవును
5. అందరూ కలిసి ఒకే సమయంలో భోజనం చేసే విషయాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. అక్కడే పిల్లల ప్రవర్తన గమనించి వారికి మంచి అలవాట్లు నేర్పుతారు.
ఎ. కాదు బి. అవును
6. పిల్లలకు పాఠశాల దశ చాలా ముఖ్యమైంది. అందుకే ఈ దశలో పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు.
ఎ. కాదు బి. అవును
7. పిల్లలు చెప్పేదాన్ని శ్రద్ధగా వింటారు. వారితో ఇంటరాక్షన్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు.
ఎ. కాదు బి. అవును
8. పిల్లలు తప్పులు చేయటం సహజం. అందుకే దండనతో కాకుండా ప్రేమతో వారిని మంచి నడవడికలో పెడతారు.
ఎ. కాదు బి. అవును
9. పిల్లల నైతికతకు అడ్డొచ్చే ప్రసారమాధ్యమాలను దూరంగా పెడతారు. మంచి కార్యక్రమాలపై వారికి ఆసక్తిని కలిగిస్తారు.
ఎ. కాదు బి. అవును
10. వీలున్నప్పుడల్లా పిల్లలకు నీతి కథలు చెప్తుంటారు. చెడుగా ప్రవర్తించటం వల్ల కలిగే ప్రమాదాలను వివరిస్తారు. మంచి పుస్తకాలు చదివేలా ప్రేరణ కలిగిస్తారు.
ఎ. కాదు బి. అవును
‘బి’ సమాధానాలు ఏడు దాటితే పిల్లల్లో శీల నిర్మాణానికి మీరు బాగా కృషి చేస్తున్నట్లే. చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్నట్లు కాకుండా మీరూ మంచి నడవడికతో ఉంటూ పిల్లల్లో స్ఫూర్తిని నింపుతుంటారు. ఇలానే కొనసాగిస్తూ పిల్లల్లో నైతిక ప్రవర్తన మెరుగు పడటానికి కృషి చేయండి. ‘ఎ’ లు ఆరు దాటితే పిల్లల్లో క్యారెక్టర్ బిల్డింగ్‌కు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే చెప్పాలి. పిల్లల్లో అనుకరణ ఎక్కువ. అందుకే మంచి పనులు ఎలా చేయాలో వారికి తెలుపండి. ఇఫ్ దే ఆర్ నాట్ గెట్ ద క్యారెక్టర్, దెయిర్ లైఫ్ విల్ బి స్పాయిల్డ్.