
పలుకే బంగారం!
హిల్లరీ క్లింటన్... పరిచయం అక్కర్లేని పేరు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ భార్యగా, అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడిన సెనెటర్‌గా గుర్తింపు ఉన్న హిల్లరీకి యునెటైడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవీకాలం పూర్తయింది. ఇప్పుడు ఆ పదవిలోకి జాన్ కెర్రీ వచ్చారు. అప్పటి నుంచి హిల్లరీ ఏం చేస్తున్నారు? పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం హిల్లరీ సోషియో ఆంత్రొపాలజిస్ట్‌గా పేరు తెచ్చుకొన్నారు. ఎన్నో పదవులను సమర్థంగా నిర్వహించిన అనుభవంతో హిల్లరీ క్లింటన్ గొప్ప వక్తగా మారారు. నిర్వాహకులు అత్యధిక పారితోషికం ఇచ్చి మరీ ఆమెను సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు.
న్యూయార్క్‌టైమ్స్ పత్రిక కథనం ప్రకారం ప్రస్తుతం హిల్లరీ ఒక్కో ప్రసంగానికి రెండు లక్షల డాలర్లు తీసుకుంటున్నారు. వైట్‌హౌస్ నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ లేడీస్‌లో ఎవరికీ ఈ స్థాయి డిమాండ్ లేదని న్యూయార్క్‌టైమ్స్ పత్రిక పేర్కొంది. అమెరికాతో పాటు కెనడా, కొన్ని యూరోపియన్ దేశాల నుంచి హిల్లరీకి ‘ప్రత్యేక అతిథి’ గా ఆహ్వానాలు వస్తున్నాయి. అందుకోసం హిల్లరీకి ప్రైవేట్ విమానాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు.
వ్యవస్థీకృత అంశాల గురించి విశ్లేషణాత్మకంగా ప్రసంగిస్తున్న హిల్లరీ, మంచి డిప్లొమాట్‌గా పేరు తెచ్చుకొన్నారు. తన అనుభవాల ను ప్రస్తావిస్తూ, ‘లీడర్ షిప్ ఈజ్ ఏ టీమ్ స్పోర్ట్’, ‘యూ కెన్ విన్’, ‘విష్పర్ కెన్ బీ లౌడర్ దేన్ షౌట్’ అంటూ ఒక వ్యక్తిత్వవికాస నిపుణురాలిలా మాట్లాడుతున్నారామె.
సాధారణంగా అమెరికా అధ్యక్షపీఠం నుంచి వైదొలగి, వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ప్రెసిడెంట్ల ప్రసంగాలకు, వాళ్లు రాసే పుస్తకాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. హిల్లరీ భర్త బిల్ క్లింటన్‌కు కూడా అలాంటి డిమాండే ఉంది. మిస్టర్ క్లింటన్ ప్రసంగాల ద్వారానే ఏడాదికి దాదాపు కోటిన్నర డాలర్ల డబ్బును సంపాదిస్తున్నారు. మిసెస్ క్లింటన్ ఈ విషయంలో ఆయనకు పోటీనిస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో అమెరికన్ అధ్యక్ష పీఠం కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే మరోసారి క్లింటన్ ఫ్యామిలీ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
అదే జరిగితే హిల్లరీ గిరాకీ డబులవదూ!