ఉసురు తీసిన భూతగాదా
- దాయాదుల ఘర్షణ
- నాటు తుపాకీతో గిరిజనుని కాల్చివేత
- క్షణికావేశంలో హత్యలు
జి.మాడుగుల : క్షణికావేశంలో ఏజెన్సీలో హత్యలు చోటుచేసుకుంటున్నాయి. చిన్న చిన్న తగాదాలకూ ఒకరినొకరు చంపుకోవడం ఇక్కడ సాధారణమవుతోంది. మన్యంలోని పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల ప్రాంతాల్లోఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. శుక్రవారం జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ గనెల్బలో చోటుచేసుకున్న సంఘటన ఈ కోవకే చెందుతుంది. జి.మాడుగుల ఎస్‌ఐ శేఖరం అందించిన వివరాలిలా ఉన్నాయి.
కోరాపల్లి పంచాయతీ మారుమూలగ్రామం గనెల్బకు చెందిన నాగేశ్వరరావు, ఈశ్వరరావులు దాయాదులు. ఈ రెండు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా భూతగాదా ఉంది. కిట్లంగి నాగేశ్వరరావు కొన్నాళ్ల క్రితం 25సెంట్లు భూమిని రూ.3వేలుకు ఈశ్వరరావుకు తనఖా పెట్టాడు. భూమిని తిరిగి తనకు అప్పగించాలని నాగేశ్వరరావు కోరాడు. దానికి రూ.8వేలు చెల్లించాలని ఈశ్వరరావు డిమాండ్ చేశాడు. గొడవ పంచాయతీకి చేరడంతో 10 రోజుల క్రితం పంటలో సగం, రూ. 3 వేలు ఈశ్వరరావుకు ఇవ్వాలని గ్రామ పెద్దలు తీర్పు చెప్పారు.
అంతవరకు భూమి అతని అధీనంలో ఉండాలన్నారు. ఇందుకు విరుద్ధంగా నాగేశ్వరరావు, అతని భార్య బంగారమ్మ, కొడుకు గోవింద్ వివాదాస్పద భూమిలో శుక్రవారం పనులు చేపట్టారు. ఇది చూసిన ఈశ్వరరావు కోపంగా ఇంటికి వెళ్లి నాటుతుపాకీ తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. దీంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య బంగారమ్మ ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.