ఎత్తు లేకున్నా... ఎంతో ఎత్తుకు..! | Whether or not the height ... leaps ..! | Sakshi
Sakshi News home page

ఎత్తు లేకున్నా... ఎంతో ఎత్తుకు..!

Published Fri, Sep 5 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

ఎత్తు లేకున్నా... ఎంతో ఎత్తుకు..!

ఎత్తు లేకున్నా... ఎంతో ఎత్తుకు..!

కనీసం నాలుగు అడుగులు దాటని ఎత్తు... వయసేమో రెండు పదులు... ప్రతిభ ఉన్నా కాలంతో పోటీపడదామంటే ప్రోత్సాహం కరువు... గుర్తించే వాళ్లు అంతకన్నా లేరు... ఇవీ మరుగుజ్జుల కష్టాలు... అలాగని వాళ్లు మనో ధైర్యాన్ని వీడలేదు... క్రీడల్లో తమకున్న నైపుణ్యానికి మరింత పదును పెట్టారు... మంచి ఫలితాలు సాధించారు... తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
 
మరుగుజ్జులంటే అందరికీ చిన్నచూపే... సమాజంలో వారికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు... ప్రతిభ ఉన్నా బండెడు కష్టాలే... అందుకే వాళ్లు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లతోనో... సర్కస్‌లో జోకర్లుగానో... చిరు వ్యాపారులుగానో స్థిరపడిపోతున్నారు. ఇవేమీ లేనివాళ్లు బతుకు బండిని భారంగా లాగిస్తున్నారు. అయితే సమాజంలో తమకూ ఏదో విధమైన గుర్తింపు దక్కాలన్న ఆశయం వారిని క్రీడాకారుల్ని చేసింది. తాము ఎంచుకున్న క్రీడల్లో రాణించేలా చేసింది. ఫలితంగా మరుగుజ్జులు డ్వార్ఫ్ క్రీడల్లో, పారా ఒలింపిక్స్‌లో సత్తా చాటుతున్నారు.
 
ఇంతింతై...

మరుగుజ్జు క్రీడాకారుల కోసం అమెరికాలో డ్వార్ఫ్ అథ్లెటిక్ అసోసియేషన్ 1985లో ఏర్పాటైంది. మరుగుజ్జు క్రీడలను అభివృద్ధి చేసి, వాటికి ప్రాచుర్యం కల్పించి, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ సంఘం ఏర్పడింది. అలా తామూ ఏ క్రీడలనైనా ఆడగలమనే ధీమాను సాధించడమే కాకుండా మరుగుజ్జులకు పోటీలూ ఉన్నాయని ప్రపంచానికి చాటినట్లయింది. అలా మొదలైన వారి ప్రస్థానం ప్రపంచ క్రీడల్లో ప్రత్యేకంగా కొనసాగుతోంది.
 
మరుగుజ్జులకు ప్రత్యేకం

అథ్లెటిక్స్... ఫుట్‌బాల్... బాస్కెట్‌బాల్... స్విమ్మింగ్... బ్యాడ్మింటన్... ఫ్లోర్ హాకీ... వాలీబాల్... ఆర్చరీ.. టెన్నిస్... పవర్‌లిఫ్టింగ్... షూటింగ్... కర్లింగ్... ఇలా పలు క్రీడల్లో ప్రావీణ్యం ఉండి.. క్రీడాకారుడిగా సత్తా చాటాలనుకునే మరుగుజ్జుల కోసం ప్రతీ నాలుగేళ్లకోసారి ప్రపంచ క్రీడలు జరుగుతాయి. ఇప్పటిదాకా ఆరుసార్లు ప్రపంచ డ్వార్ఫ్ క్రీడలు జరగ్గా... చివరిసారిగా 2013లో అమెరికాలోని మిచిగాన్ ఈ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. 2013 ప్రపంచ క్రీడల్లో 17 దేశాలకు చెందిన 395 మంది మరుగుజ్జులు పోటీల్లో పాల్గొన్నారు. 1993లో తొలిసారిగా ఈ పోటీలకు అమెరికాలోని చికాగో ఇల్లినాయిస్‌లో నిర్వహించారు.
 
పోటీల్లో పాల్గొనేది వీరే

మరుగుజ్జుల పోటీల్లో పాల్గొనాలనుకునే వారి ఎత్తు నాలుగు అడుగుల పది అంగుళాలు మించకూడదు. కండరాలు అసాధారణంగా పెరగడం వల్ల కాళ్లు, చేతుల్లో వాపు వచ్చిన వారిని ఇందులో పాల్గొనేందుకు అనుమతినిస్తారు. అయితే ఈ పోటీల్లో పాల్గొనే వాళ్లంతా మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇక డ్వార్ఫ్ క్రీడలు ఎక్కడ జరిగినా నిబంధనలు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఈ క్రీడల్లో పాల్గొనే వాళ్లు పారా ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగుతుంటారు. అందుకే మరుగుజ్జులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక ఈ క్రీడల్లో పాల్గొనే వారికి ఫ్యూచర్స్, జూనియర్స్, ఓపెన్, మాస్టర్స్ వయస్సు గ్రూపుల్లో పోటీలు నిర్వహిస్తారు. వీరికి అత్యున్నత క్రీడలు ఒకరకంగా ప్రపంచ డార్ఫ్ గేమ్సే. మరుగుజ్జు క్రీడాకారులు ఏ దేశానికి చెందిన వారైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. తమ దేశానికి చెందిన చెఫ్ డి మిషన్ ద్వారా పోటీల్లో పాల్గొనవచ్చు. ఒకవేళ చీఫ్ డి మిషన్ లేకపోతే పోటీల్లో పాల్గొనేందుకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
మనకూ ఉన్నారు...

మరుగుజ్జు క్రీడల్లో మనవాళ్లూ తక్కువేమీ తినలేదు. భారత్ తరఫున ఈ క్రీడల్లో పాల్గొనేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాదు అంతర్జాతీయ వేదికల్లో రాణిస్తూ పతకాలు కొల్లగొడుతున్నారు. గత ఏడాది జరిగిన ప్రపంచ డ్వార్ఫ్ క్రీడల్లో పతకాల పంట పండించారు. 9 బంగారు పతకాలతో సహా మొత్తం 18 పతకాలు సాధించి  భారత్‌ను ఆరో స్థానంలో నిలిపారు. 16 మంది పోటీల్లో పాల్గొనగా.. జోబీ మాథ్యూ, రాజన్న, ప్రకాశ్, ఆకాశ్ మాధవన్, నళిని, రేణు కుమార్‌లు తమ సత్తా చాటి పలు విభాగాల్లో పతకాలు సాధించారు.
 
ఆల్‌రౌండర్ జోబి

కేరళకు చెందిన 38 ఏళ్ల మరుగుజ్జు జోబీ మాథ్యూ అర్మ్ రెజ్లర్‌గా అందరికీ సుపరిచితమే. ప్రాక్సిమల్ ఫెమోరల్ ఫోకల్ డెఫీషియన్సీ (పీఎఫ్‌ఎఫ్‌డీ) కారణంగా  జోబి 60 శాతం వైకల్యంతో పుట్టాడు. పీఎఫ్‌ఎఫ్‌డీ వల్ల జోబి కాళ్లలో ఏమాత్రం ఎదుగుల లేకపోయినా.. మిగిలిన శరీరం మొత్తం వయసుకు తగ్గట్లుగానే పెరిగింది. మూడు అడుగుల ఐదు అంగుళాల పొడవున్న ఈ కేరళ మరుగుజ్జు తాను ఎత్తు పెరగలేకపోయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. కాళ్లు సహకరించకపోయినా.. మిగిలిన శరీరంలో అందరి లాగే పెరుగుదల ఉండటంతో జిమ్‌కి వెళ్లి తీవ్రంగా సాధన చేశాడు. అందుకు జోబికి తగిన ఫలితం దక్కింది. బాడీ బిల్డింగ్, ఆర్మ్ రెజ్లింగ్‌లో సత్తా చాటాడు. స్పెయిన్‌లో జరిగిన 29వ ప్రపంచ ఆర్మ్ రెజ్లింగ్‌లో చాంపియన్‌గా నిలిచి తానేంటో నిరూపించుకున్నాడు. అంతేకాదు ప్రపంచ డ్వార్ఫ్ క్రీడల్లోనూ దుమ్ము రేపాడు. అథ్లెటిక్స్ క్లాస్ 3లో షాట్‌పుట్, డిస్కస్ త్రో, జావిలిన్ త్రో తోపాటు సీనియర్ క్లాస్ 1 బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. ఇక జోబి జనరల్ కేటగిరీలోనూ, వైకల్య విభాగంలోనూ రెజ్లింగ్, ఫెన్సింగ్, బాడీ బిల్డింగ్‌లో చాలా సార్లు సత్తా చాటి ఎన్నో పతకాలను సొంతం చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement