దేవుడంటే?
ఒక యువకుడు ఓషోను ఇలా అడిగాడు. ‘‘దేవుడనే మాట ఒక వస్తువులా వినిపిస్తోంది. అన్వేషించే వారికి దూరమై ఉంటున్నట్టు, అన్వేషిస్తే దొరికే వస్తువులా దేవుడు కూడా దొరుకుతాడు అని అనిపిస్తుంటుంది. ఇంతకూ ఎవరీ దేవుడు?’’
అప్పుడు ఓషో ఇలా చెప్పారు.
‘‘దేవుడిని పొందడం, దేవుడిని అర్థం చేసుకోవడం వంటివన్నీ వృథా. ఎందుకంటే ఆయన మన చుట్టూ ఉన్నాడు. నేనూ ఆయనలోనే ఉన్నాను. నిజం చెప్పాలంటే నేను లే నే లేను. ఉన్నదంతా ఆయనే. ఉన్న ఆయన పేరే దేవుడు. జీవితం లోపల ఆయన దాగి ఉన్నాడు. ఆయన్ని వెతకలేం. జీవితంలో మునగడంతోనే ఆయన్ని పొందవచ్చు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను. ఒక చేపకు సముద్రం పేరు వినీ వినీ విసుగుపుట్టింది. అప్పుడు చేపల రాణిని అడిగింది - ‘నేను ఎన్నో ఏళ్లుగా సముద్రం పేరు వింటున్నాను. ఇంతకూ ఈ సముద్రమంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది?’ అని. అప్పుడు చేపల రాణి ఇలా చెప్పింది.
‘సముద్రంలోనే నీ పుట్టుక, జీవితం ఉన్నాయి. అదే నీ ప్రపంచం. సముద్రమే నువ్వుండే చోటు. సముద్రం నీలో ఉంది. అది నీ వెలుపలా ఉంది. సముద్రం నుంచి పుట్టిన నీ జీవితమూ అందులోనే అంతమవుతుంది. సముద్రం నీ చుట్టూ తిరుగుతోంది’ అని చెప్పింది’’ అంటూ ఓషో ముగించాడు.
దేవుడు సైతం ప్రతి ఒక్కరినీ అన్ని వేళలా ఆవరించి ఉంటాడు. కానీ మనమే తెలియని మత్తులో మాయలో ఉన్నాం. కనుక మనకు ఆయన దర్శనం కావడం లేదు.మత్తూ మాయ లేని స్థితే దేవుడు.
- యామిజాల జగదీశ్