
ఎవరి రచనలంటే ఇష్టం?
నాకు చదవడం తెలిశాక చంకన పెట్టుకుని తిరిగిన పుస్తకాలు రెండు. ఒకటి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, రెండు హెచ్చార్కె ‘రస్తా’. శ్రీశ్రీ- చూడు చూడు నీడలు, బాటసారి కవితలు చాలా ఇష్టం. కాలక్రమంలో చాలామంది రచయితలు తెలిశారు. పుస్తకాలు పరిచయమయ్యాయి. నెరూడ, బోర్హెస్, లోర్క, మయకొవెస్కి, పాస్టర్న్యాక్, విస్వావ పింబోర్స్క, పీటర్ ల ఫార్జ్ (ఖీజ్ఛి ఆ్చ్చఛీ ౌజ ఐట్చ ఏ్చడ్ఛట’ జ్చఝ్ఛ), మహమౌద్ దర్విష్, మాయా ఆంజెలౌ, ల్యాంగ్సన్ హ్యూస్, ఖలిల్ జిబ్రన్... వీరి రచనలంటే ఇష్టం. తెలుగులో అయితే సరళమైన భాషలో రాసినవి ఎక్కువ ఇష్టపడతాను. ఏ యాసలో ఉన్నా సరే. ‘90లలో ఐడెంటిటీ పాలిటిక్స్‌పై వచ్చిన కవితల్ని ఎక్కువ ఇష్టపడేదాన్ని. రేవతీదేవి ‘శిలాలోలిత’ చాలా ఇష్టం. ఇక ఇప్పుడు చాలామంది అద్భుతంగా రాస్తున్నారు. వాళ్లలో నా ఫేవరెట్ రైటర్ కాశిరాజు. ఎందుకంటే మా ఊర్లో చలికాలంలో వేసుకునే చలిమంటలో నుంచి వచ్చె కమ్మని వాసనేస్తాయి అతని కవితలు/కథలు.
కవితైనా, కథైనా పెయింటింగ్, స్కల్ప్టింగ్‌లాంటి కళే అని నమ్ముతాను. కాదేదీ కవితకనర్హం... అనేమాట నిజమే అయినా కవితా వస్తువు ఎలాంటి ఆర్భాటాల అవసరం లేకుండా మనస్సులోకి సూటిగా దూసుకెళ్లగలగాలి. అలాగే కన్నీళ్లు కార్చకుండా కన్నీళ్ల గురించి రాయకూడదు. నీలి ఈకల పిట్టను చూడకుండా దాని ఈకల మెరుపు గురించి రాయకూడదు. అలా రాసిన కవితల్లో ఇంటెగ్రిటి ఉండదు.
- మమత కొడిదెల
(ఇటీవల ‘ఇస్మాయిల్ పురస్కారం’ (అమెరికా)కి ఎంపికైన సందర్భంగా ‘వాకిలి’- వెబ్ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో. మమత కొడిదెల తక్కువగా రాసినా స్థిరంగా రాస్తున్న కవయిత్రి. గతంలో సత్యజిత్ రే కథలను తెలుగులో అనువాదం చేశారు. ప్రస్తుతం ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నారు)