
అతివలకు శిరోజాలు అందం మాత్రమేనా?!
అతివలకు శిరోజాలు అందం మాత్రమేనా?! ప్రాణం కూడా! వాటిని వాళ్లు ఎంత అపురూపంగా చూసుకుంటారంటే, కురులలోంచి ఒక్క వెంట్రుక రాలి పడినా విలవిల్లాడి పోతారు.
మీరీ వీడియోను చూడలేరు
అతివలకు శిరోజాలు అందం మాత్రమేనా?! ప్రాణం కూడా! వాటిని వాళ్లు ఎంత అపురూపంగా చూసుకుంటారంటే, కురులలోంచి ఒక్క వెంట్రుక రాలి పడినా విలవిల్లాడి పోతారు. వాటి పోషణకు రకరకాల షాంపూలు, కండీషనర్‌లు వాడతారు. అందుకే సౌందర్య సాధనాలను ఉత్పత్తి చేసే పెద్ద పెద్ద కంపెనీలు మహిళల జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ పెడతాయి.
తమ ఉత్పత్తులకు గిరాకీ కల్పించుకోవడం కోసం వారి మనోభావాలకు అనుగుణంగా మసలుకుంటాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే బంగ్లాదేశ్‌కు చెందిన ఓ హెయిర్ ఆయిల్ కంపెనీ మహిళల మనసుకు మరింత చేరువయ్యింది. ఒక్క మహిళలకే కాదు, వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయేలా ఉంది ఆ కంపెనీ విడుదల చేసిన వ్యాపార ప్రకటన! గృహహింసకు ముడివడి ఉన్న ఆ వీడియో థీమ్ ప్రతి ఒక్క హృదయాన్నీ చెమ్మగిల్లేలా చేస్తోంది!
ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. అమెకు అందమైన పొడవాటి జుట్టు ఉంటుంది. ఓ రోజు తను బ్యూటీపార్లర్‌కి వెళుతుంది. జుట్టుని షార్ట్‌గా కట్ చెయ్యమని హెయిర్ డ్రెసర్‌ని కోరుతుంది. కానీ అంత బలమైన, ఒత్తయిన జుట్టుని కట్ చెయ్యడానికి హెయిర్ డ్రెసర్‌కి మనసు రాదు. ‘‘అలాక్కాదు.. కొద్దిగా ట్రిమ్ చేస్తాను’’ అంటుంది. తనకు షార్ట్‌గానే కావాలని ఆ అమ్మాయి పట్టు పడుతుంది.
దాంతో హెయిర్ డ్రెసర్ కొంచెం షార్ట్‌గా మాత్రమే జుట్టుని కట్ చేస్తుంది. అద్దంలో చూసుకుని, ఇంకా కట్ చెయ్యమంటుంది ఆ అమ్మాయి. హెయిర్ డ్రెసర్ ఆమె చెప్పినట్టే కట్ చేస్తుంది. ‘ఇంకా’ అంటుంది. అలా ఇంకా.. ఇంకా.. ఇంకా.. అని అంటూనే ఉంటుంది. సెలూన్‌లో ఉన్న మిగతా మహిళలు తలతిప్పి.. ‘ఇంత పొడవాటి, అందమైన జుట్టును ఎందుకు తగ్గించుకుంటోందో ఈ అమ్మాయి..’ అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తుంటారు. చివరికి హెయిర్ డ్రెస్సర్ ఆ అమ్మాయికి కావలసినంత షార్ట్‌గా కట్ చేశాక ఒక్కసారిగా ఆమె కళ్లల్లోకి నీళ్లు వచ్చేస్తాయి. బాగా షార్ట్ అయిపోయిన తన జుట్టును పట్టి చూసుకుంటూ, ఇప్పుడెవ్వరూ నన్ను జుట్టు పట్టుకుని కొట్టడానికి వీలుండదు’’ అంటుంది! ఆ మాటతో అక్కడున్న వాళ్లంతా కదిలిపోతారు. వీడియో చూస్తున్న మనం కూడా.
మేడమ్ ఇప్పుడు వీ వంతు
హెయిర్ డ్రెసర్: వావ్.. మీ జుట్టు ఎంత అందంగా ఉంది
ఏం చేయమంటారు మేడమ్
యువతి: జుట్టును షార్ట్‌గా కట్‌చేయండి
హెయిర్ డ్రెసర్: కానీ మీ జుట్టు అందంగా ఉంది
కాస్త ట్రిమ్ చేస్తాను
ఇప్పుడు సరిపోతుందా మేడమ్
యువతి: ఇంకొంచెం షార్ట్‌గా కట్ చేయండి
హెయిర్ డ్రెసర్: ఇంకా షార్ట్‌గానా
యువతి: అవును
హెయిర్ డ్రెసర్: ఇప్పుడు సరిపోతుందా మేడమ్
యువతి: ఇంకొంచెం షార్ట్‌గా కట్ చేయండి
హెయిర్ డ్రెసర్: మీ జుట్టు అలంకరించుకోవడానికి సమయం ఉండట్లేదేమో ?
లేయర్ కట్ చేయమంటారా... ఇంకా అందంగా ఉంటుంది.
ఇప్పుడు చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంది
యువతి: ఇంకా షార్ట్‌గా కట్ చేయండి...ఇంకెవరూ నా జుట్టు ఇలా పట్టుకోకుండా..
కాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఓ హెయిర్ ఆయిల్ కంపెనీ రూపొందించిన యాడ్ ఇది. మహిళలపై జరుగుతున్న గృహహింసను సమాజం దృష్టికి తెచ్చి, బాధితులకు మద్ధతుగా నిలిచేందుకు ఈ యాడ్‌ను రూపొందించింది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తోంది.
మహిళలపై జరుగుతున్న గృహహింస దాడులను సమాజానికి తెలియబరచడానికి, వారికి మద్ధతుగా నిలిచేందుకు హెయిర్ ఆయిల్ కంపెనీ ఈ యాడ్‌ను ఇలా కొత్తగా షూట్ చేయించింది. కేవలం వ్యాపార ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా, ఒక సామాజిక బాధ్యతతో తయారైన ఈ యాడ్ ఇప్పుడు ఒక అనుమానాన్ని కూడా రేకెత్తిస్తోంది.
ప్రముఖ హాలీవుడ్ నటి నికోల్ కిడ్‌మన్ తన జుత్తును షార్ట్‌గా కత్తిరించుకున్న నెలలోనే.. తన భర్తతో తెగదెంపులు చేసుకుంటున్న విషయాన్ని ప్రపంచానికి బహిర్గతం చేశారు. నికోల్ చూపిన దారిలోనే మరో హాలీవుడ్ నటి జెన్నిఫర్ ఆనిస్టన్ పయనించారు! అంటే.. వీళ్లు కూడా గృహహింసకు గురయ్యే ఉంటారా అన్నది ఆ అనుమానం. ప్రాణప్రదంగా చూసుకునే జుట్టును.. ప్రాణాలను కాపాడుకోడానికి తగ్గించుకోక తప్పని పరిస్థితి రావడం మహిళ జీవితంలోని ఒక విషాదం కాక మరేమిటి?!
– కొటేరు శ్రావణి, ‘సాక్షి’ వెబ్