శుక్రవారం ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు. అప్పు తీర్చరు. అప్పుగానైనా ఇవ్వరు. ఎంత అవసరంలో ఉన్నవారికైనా ‘ఇదిగో ఉంచు’ అని ఇచ్చేందుకు పది రూపాయలు బయటికి తియ్యరు. ఇదొక నమ్మకం. భారతదేశంలో ఎక్కువగా ఉంది. పల్లెల్లో ఇంకాస్త ఎక్కువగా ఉంది. శుక్రవారం డబ్బులిస్తే లక్ష్మీదేవి చేజారిపోతుందని భయం.
ఈ నెల 3వ తేదీ శుక్రవారం అయింది. శుక్రవారం అని ప్రేమ (31) కు తెలీదు. భర్త చనిపోయాక ఆమె వారాలను మర్చిపోయింది. ఆ భర్త పేరు సెల్వం. తమిళనాడులోని సేలంలో ఉంటారు సెల్వం, ప్రేమ. ఇద్దరికీ ఇటుక బట్టీలో పని. ముగ్గురు పిల్లలు. బట్టీలో వచ్చేది తిండికే సరిపోయేది. ‘ఇలాక్కాదు.. బిజినెస్ చేస్తాను’ అన్నాడు సెల్వం ఒకరోజు. రెండున్నర లక్షల రూపాయలు అప్పు చేసి బిజినెస్ పెట్టాడు. నష్టం వచ్చింది. అప్పులు మిగిలాయి. వడ్డీలు పెరిగాయి. ఏడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ, పిల్లలు మిగిలారు. ఐదేళ్లు, మూడేళ్లు, రెండేళ్ల పిల్లలు. వారితోపాటు ఆకలి. ‘అమ్మా ఆకలి’ అని అమ్మ కొంగుకు చుట్టుకుపోతున్నారు. తల్లి మనసు తల్లడిల్లింది. చేతిలో డబ్బుల్లేవు. అప్పటికీ ఒకరిద్దర్ని చెయ్యి చాచింది. ‘పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారమ్మా’ అంటూ చెయ్యి చాచలేదు. అవసరానికి అడిగినట్లుగా అడిగింది. ఆ రోజు శుక్రవారం. శుక్రవారం కాబట్టేనేమో ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. సేలంలోని పొన్నంపేటలో ఉంటారు ప్రేమ, పిల్లలు.
‘‘వెంట్రుకలు కొంటాం.. వెంట్రుకలు కొంటాం..’’ అని వీధిలో ఒక మనిషి వెళ్తుంటే అతడిని లోపలికి పిలిచింది. ‘‘నా తలవెంట్రుకలు ఇస్తాను. ఎంతకు కొంటావు?’’ అని అడిగింది. ఆశ్చర్యంగా ఆమె చూసి, ‘‘నూటా యాభై’’ అని చెప్పాడతను. జుట్టు ఇచ్చి డబ్బులు తీసుకుంది. వంద రూపాయలతో పిల్లలకు టిఫిన్ తెచ్చిపెట్టింది. మిగతా యాభై రూపాయలతో విషం కొనుక్కుంది! మొదట పురుగుల మందు షాపుకు వెళితే ఆ షాపతను ప్రేమ వాలకం చూసి అనుమానం వచ్చి... ‘‘యాభై రూపాయలకు రాదమ్మా’’ అని ఆమెకు చావును తప్పించేశాడు. ఇంటికొచ్చింది. గన్నేరు పప్పు నూరుకుని తినబోతుంటే.. ఏ దేవుడు పంపించాడో.. అప్పుడే అక్కడకు వచ్చిన ప్రేమ చెల్లెలు అడ్డుకుంది. ఆమెను కావలించుకుని పెద్దగా ఏడ్చేసింది ప్రేమ. ‘‘ఏడిస్తే పిల్లల ఆకలి తీరదు. ఏడిస్తే పూట గడవదు. ఏడిస్తే జీవితం గడవదు. ఏడవడం, చావాలనుకోవడం రెండూ ఒక్కటే’’ అన్నాడు ప్రేమ చెల్లెలి వెంటే వచ్చిన ఆ చెల్లెలి స్నేహితుడు బాలా.
అలా అని ఊరుకోలేదు. తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ప్రేమ గురించి రాశాడు. ఆమెకు సహాయం చేసేందుకు చాలామంది ముందుకు వచ్చారు. వాళ్లెవరూ శుక్రవారం అని చూసుకోలేదు. సహాయం చేస్తూనే ఉన్నారు. ‘‘ఇక వద్దు. ఫేస్‌బుక్‌లోంచి నన్ను తీసేయి బాలా అణ్ణా..’’ అంది ప్రేమ. ‘‘నా ప్రాణం నిలబెట్టావు. నా కాళ్లపై నేను నిలబెడతాను. ఎవర్నీ డబ్బు పంపించొద్దు అని చెప్పు’’ అంది. ఆమెలోని కాన్ఫిడెన్స్‌ని చూస్తే వారానికి ఒక శుక్రవారం కాదు.. ఏడు శుక్రవారాలు ఉన్నా జీవితమంతా స్వయంశక్తితో ముందుకు సాగుతుందన్న నమ్మకం ఏర్పడింది అతడికి. ఫేస్‌బుక్‌లోంచి ఆమె వివరాలను తొలగించాడు. అప్పటికే ప్రేమకు లక్షన్నర వరకు జమ అయింది. ఆ డబ్బులో ఎక్కువ భాగాన్ని భర్త చేసిన అప్పులు తీర్చడానికి వాడింది. మిగతా డబ్బును చేతిలో ఉంచుకుంది. బాలాకు ప్రభు అనే స్నేహితుడున్నాడు. ప్రేమకు బట్టీ పని తెలుసు కాబట్టి ప్రభు తనకు తెలిసిన బట్టీలో ఆమెకు ఉద్యోగం ఇప్పించాడు.
సేలం జిల్లా అధికారులు ఆమెకు వింతంతు పింఛను మంజూరు చేశారు. ఇక్కడితో ఈ కథ సుఖాంతం అయినట్లే. అయితే ఇక్కడితో ఆగిపోలేదు. అసలు ఒక మహిళ తన బిడ్డల ఆకలి తీర్చడానికి తన తల వెంట్రుకలు అమ్ముకోవలసిన దుస్థితి రావడం ఏంటని జాతీయ మహిళా కమిషన్ కలవరపడింది. తమిళనాడు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. సామాజిక సంక్షేమ పోషకాహార శాఖకు లేఖలు రాసింది. ఇలాంటివి జరగకుండా ఏం చర్యలు తీసుకోబోతున్నదీ ఒక నివేదికను తయారు చేసి ఇమ్మని కూడా అడిగింది. ఎవరైనా చెయ్యి చాచినప్పుడు ఉంటే ఇస్తాం. లేకుంటే లేదంటాం. శుక్రవారం అనే నమ్మకం ఉంటే.. ఇవ్వకుండా ఊరుకుంటాం. ఇచ్చినా, ఇవ్వకున్నా... చెయ్యి చాచే పరిస్థితి ఎందుకు వచ్చిందో అడగడం సాటిమనిషిగా మన బాధ్యత. నేషనల్ ఉమెన్ కమిషన్ ఈ పనే చేసింది. ప్రేమ కుటుంబ వివరాలను పంపించమని కూడా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment