♦ భారత రక్షణ దళంలోని శాశ్వత, స్వల్పకాలిక విభాగాలైన ‘పర్మినెంట్ కమిషన్’ (పదవీ విమరణ వయసు వరకు), ‘షార్ట్ సర్వీస్ కమిషన్’, (10 సం. + 4 ఏళ్ల పొడిగింపు)లలో.. పర్మినెంట్ కమిషన్‌లో చేరడానికి ఆఫీసర్ ర్యాంకులో ఇప్పటి వరకు మహిళలకు ఉన్న పరిమితులను మరింతగా సడలించి, వారిని కూడా శాశ్వత ప్రాతిపదికన ఆర్డ్‌నెన్స్, సిగ్నల్స్, ఇంజినీరింగ్, ఇంటెలిజెన్స్, ఎయిర్ డిఫెన్స్, లాజిస్టిక్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి అనేక కీలక విభాగాల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తోంది. అధికార స్థాయిలో మహిళల్ని రక్షణశాఖ లోకి తీసుకోవడమన్నది 1990లలోనే మొదలైనప్పటిMీ ప్రస్తుతం త్రివిధ దళాలలోని మొత్తం 14 లక్షల మంది ఉద్యోగ సిబ్బందిలో 65 వేల మంది అధికారస్థాయి ఉద్యోగులు ఉండగా, వారిలో ఆర్మీలో కేవలం 1561 మంది, ఎయిర్‌ఫోర్స్‌లో 1610 మంది, నేవీలో 489 మంది మాత్రమే మహిళా అధికారులు, అది కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు.
♦ మాటు వేసి, పంజా విసరబోయిన చిరుత పులి నుంచి తన పదకొండేళ్ల కూతుర్ని కాపాడుకున్న ముత్తుమరి అనే ఒక తేయాకు కార్మికురాలిని తమిళనాడు ప్రభుత్వం ‘కల్పనాచావ్లా అవార్డు’తో సత్కరించి, 5 లక్షల నగదును బహుమానంగా అందచేసింది. కూతురు, పదో తరగతి చదువుతున్న కొడుకు ఉన్న ఒంటరి తల్లి ముత్తుమరి.. గత ఏడాది తేయాకు తోటల్లో ఆకుల్ని తెంపేందుకు కూతుర్ని కూడా వెంట తీసుకెళ్లినప్పుడు పొదల మాటునుంచి కూతురి పైకి లంఘించిన చిరుతను వట్టి చేతులతో తరిమికొట్టి బిడ్డను కాపాడుకున్న ఘటనలో ఆమెలోని తెగింపు ఆమెను ఒక సాహస మహిళగా, అంతకన్నా కూడా.. తల్లి ప్రేమకు ప్రతీకగా నిలబెట్టింది.
♦ ఛత్తీస్‌ఘర్ గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్ గుండెపోటుతో మరణించడంతో ఆయన స్థానంలో.. ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆనందిబెన్ పటేల్.. అదనపు బాధ్యతలు చేపడుతూ రాజధాని రాయ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని కావడంతో, అంతవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన స్థానంలోకి గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా వచ్చిన ఆనందిబెన్, తర్వాత రెండేళ్లకు వయోభారాన్ని కారణంగా చూపి పదవీ విరమణ చేసి, కొన్ని నెలల విరామం తర్వాత ఈ ఏడాది జనవరిలో మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
♦ ‘రోబో’ సినిమాలో డైరెక్టర్ శంకర్ వేలాది రోబోలను కలిపి దుష్టుడైన ఓ జైట్ రోబోను సృష్టించిన విధంగానే, లండన్ శాస్త్రవేత్తలు.. చురుగ్గా ఈత కొట్టగల లక్షణం ఉన్న ఈ–కోలి (ఎషరికియా కోలీ) బాక్టీరియాలతో మోనాలిసా రూపురేఖల్ని ఒక చిత్రపటంగా సృష్టించారు! కాంతికి ప్రతిస్పందించే విధంగా జన్యునిర్మాణాన్ని మార్పు చేసిన పది లక్షల బాక్టీరియాలతో మోనాలిసా ఆకృతిని సాధించిన శాస్త్ర పరిశోధకులు.. తర్వాతి తరం మైక్రోస్కోపిక్ వస్తువుల నిర్మాణానికి ఈ జన్యుమార్పిడి బాక్టీరియాలు ఇటుకల్లా ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
♦ హాలీవుడ్‌లో మహిళలకు అవకాశాలు లేకపోవడం వల్లనే తను ‘కోపిష్టి స్త్రీవాది’గా మారానని 48 ఏళ్ల అమెరికన్ హాలీవుడ్ న టి హెదర్ గ్రేయమ్ అన్నారు. ఇటీవల షేక్స్‌పియర్ నాటకోత్సవాలకు వెళ్లిన హెదర్.. ‘ప్రతి కథా పురుషుడి వైపు నుంచి చెప్పిందే. ప్రతి కోణం పురుషుడిదే. మహిళా రచయితలకు, వారి రచనలకు, వారి దృక్పథానికి ఎందుకని ప్రాముఖ్యం లేకుండా పోయింది. హాలీవుడ్‌లోనూ అంతే. ఏ విభాగంలోనూ మహిళలు తగినంతగా కనిపించరు. అందుకే నాలో తరచు కోపం కట్టలు తెచ్చుకుంటుంది. అందుకే నాకు ‘యాంగ్రీ ఫెమినిస్టు’ అన్న పేరు వచ్చింది’’ అని అసహనాన్ని వ్యక్తం చేశారు.
♦ రేపటి నుండి (ఆగస్టు 18) రెండు వారాలపాటు ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో 100 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించేందుకు ఒడిశాకు చెందిన 22 ఏళ్ల ప్రొఫెషనల్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ తహతహలాడుతున్నారు. స్త్రీ దేహంలో పురుష హార్మోన్లు ఎక్కువగా ఉండే ‘హైపర్‌ఆండ్రోజెనిజం’ అనే లైంగిక అసమస్థితి కారణంగా నాలుగేళ్ల క్రితం దక్షిణ కొరియాలోని ఏంచాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌కు అర్హత పొందలేకపోయిన ద్యుతి, ఆ విషయమై కోర్టును ఆశ్రయించగా.. ఈ ఏడాది ఆరంభంలో ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో ఈ ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం లభించింది.
♦ న్యూయార్క్‌లో క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న 43 ఏళ్ల బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే.. ఆగస్టు 11 తన కొడుకు రణవీర్ పుట్టినరోజు సందర్భంగా, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్వేగభరితమైన పోస్టు పెట్టారు. ‘రణవీర్.. మై సన్, మై మూన్, మై స్టార్స్.. మై స్కై..’ అంటూ ప్రారంభమైన ఈ పోస్టులో.. 12 నుంచి 13వ సంవత్సరంలోకి ప్రవేశించిన కొడుకును ఉద్దేశించి.. ‘వావ్! యు ఆర్ టీనేజర్ నౌ’ అని సోనాలి మురిసిపోవడం హార్ట్ టచింగ్‌గా ఉంది.
♦ 67 ఏళ్ల వయసులో 1985లో చనిపోయిన హాలీవుడ్ నటి ఎవ్లిన్ ఫెలిసా యాంకర్స్ నూరవ జయంతి నేడు. 1918 ఆగస్టు 17న చిలీలో జన్మించిన ఫెలిసా 1940ల నాటి అమెరికన్ హారర్ చిత్రాలతో, ముఖ్యంగా ‘ది ఉల్ఫ్ మ్యాన్’ (1941) చిత్రంతో ప్రేక్షకాదరణ పొందారు.
స్త్రీలోక సంచారం
Published Thu, Aug 16 2018 11:40 PM | Last Updated on Fri, Aug 17 2018 12:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment