♦ బ్రిటన్ రాజవంశంలో ఈ ఏడాది జరిగిన రెండో పెళ్లి అనామకంగా ఉండిపోయింది! మే 19 జరిగిన మొదటి పెళ్లి క్వీన్ ఎలిజబెత్–2 మనవడు (క్వీన్ తొలి సంతానం ప్రిన్స్ చార్ల్స్ రెండో కొడుకు) ప్రిన్స్ హ్యారీది కాగా.. రెండోది అక్టోబర్ 12న జరిగిన యూజీనీ (28) వివాహం. యూజినీ.. రాణిగారి మూడో సంతానం ప్రిన్స్ ఆండ్రూ, ఆయన మాజీ భార్య సారా ఫెర్గూసన్‌ల చిన్న కూతురు. 32 ఏళ్ల వైన్ మర్చంట్, బాయ్ ఫ్రెండూ అయిన జాక్ బ్రూక్స్‌బ్యాంక్‌తో జరిగిన యూజినీ పెళ్లికి నటి లివ్ టేలర్, మోడల్ నవోమీ క్యాంప్‌బెల్, గాయకుడు జేమ్స్ బ్లంట్, గాయని ఎల్లీ గోల్డింగ్ వంటి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఆహ్వానాలపై హాజరయ్యారు. పదిహేనవ శతాబ్దపు సెయింట్ జార్జి చాపెల్‌లో ఏర్పాటైన కల్యాణ ప్రాంగణంలో అతి తక్కువ సంఖ్యలో చారిటీ గెస్టులు, 1200 మంది వరకు సామాన్య ప్రజలు కనిపించారు. ఏమైనా యూజినీ పెళ్లి మరికొంత ఘనంగా జరిగి ఉండాల్సిందని బ్రిటన్ పత్రికలు కొన్ని అప్పుడే రాయడం మొదలుపెట్టేశాయి.
♦ మీటూ ప్రభావంతో కార్పోరేట్ ఆఫీస్‌లన్నీ ఉద్వేగాలపరంగా ఘనీభవించిపోతున్నాయని తాజా సర్వేల ఫలితాలు వెలువడుతున్నాయి! ‘‘మీటూ కంటే ముందే, పనిచేసే చోట మహిళలపై జరిగే లైంగిక వేధింపులను నిరోధించడానికి చట్టాలు ఉన్నప్పటికీ ఇప్పటిలా స్వేచ్ఛగా మహిళా ఉద్యోగులు బయటపడేవారు కాదు. మీటూ వచ్చాక బాధితులకు రెక్కలు వచ్చినట్లయింది’’ అని ‘షీరోస్’ సంస్థ వ్యవస్థాపక సీఈవో సైరీ చాహల్.. మీటూ ప్రభావంపై సర్వే జరిపేందుకు వచ్చిన ప్రతినిధులతో అన్నారు. ‘షీరోస్’ అనే ఈ సంస్థ మహిళల సంక్షేమం, సాధికారతల కోసం పని చేస్తుంటుంది.
ప్రొఫెషనల్ కౌన్సెలింగ్, వెల్‌నెస్ సేవలు అందిస్తుండే వన్ టు వన్ ‘హెల్ప్ డాట్ నెట్’ సంస్థ డైరెక్టర్ అర్చనా బిష్త్ కూడా మీటూ తర్వాత మహిళలకు భావప్రకటన స్వాతంత్య్రం వచ్చిందనే అభిప్రాయపడుతున్నారు. ‘‘ఏమైనా ఇప్పుడు వీస్తున్న బలమైన మీటూ గాలులు మూల మూలల నుంచి ‘ఆడవాళ్ల వేటగాళ్లను’ బయటికి లాగి పడేయబోతున్నాయని అర్థమౌతోంది. ఇది ఆరంభం మాత్రమే. జరగవలసింది ఎంతో ఉంది’’ అని అర్చన అన్నారు. ‘‘తమపై జరుగుతున్న లైంగిక వేధింపులపై మాట్లాడ్డానికే భయపడే మహిళా ఉద్యోగులు ఇప్పుడు కంప్లయింట్ ఇవ్వగలుగుతున్నారంటే.. సంస్థల యాజమాన్యాలు వారికి ఇస్తున్న మద్దతు కూడా ఒక ప్రధాన కారణమే’’ అని ముంబైలోని ప్రముఖ స్టార్‌అప్ కంపెనీ ప్రతినిధి ఒకరు తమ కార్యాలయానికి సర్వేకోసం వచ్చిన వారితో వ్యాఖ్యానించారు.
♦ అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కేరళ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు (మహిళాభక్తులు సహా) ప్రదర్శనలు జరుపుతున్న నేపథ్యంలో తాజాగా.. జెండర్ కార్యకర్త తృప్తి దేశాయ్ తను శబరిమలను దర్శించి తీరుతానని, మహిళల ప్రాథమిక హక్కులను ఎవ్వరూ అడ్డుకోజాలరని ముంబైలోని ఒక మలయాళం టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంతో భక్తుల ఆగ్రహావేశాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో.. శబరిమలను దర్శించే సాహసం చేసే ఏ మహిళనైనా రెండు ముక్కలుగా చీల్చేస్తాని మలయాళ నటుడు కొల్లం తులసి (69) అనడం వివాదాస్పదమై, అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment