
♦ అమెరికన్ ర్యాపర్, యాక్టర్.. క్లిఫర్డ్ జోసెఫ్ హ్యారిస్ జూనియర్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియో ఆల్బమ్‌లో ఆమెరికా ప్రథమ మహిళ మెలానియాను అనుసరిస్తూ నటించిన కెనడియన్ మోడల్ మెలనీ మార్డన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. పోలికల్లో కూడా అచ్చు మెలానియా ఉండే మార్డన్.. ఆ వీడియో సాంగ్‌లో.. గతంలో మెలానియా ధరించినట్లే ‘ఐ రియల్లీ డోన్ట్ కేర్’ అనే అక్షరాలున్న జాకెట్‌ను వేసుకుని కనిపించడంపై మెలానియా అభిమానులు విరుచుకుపడుతున్నారు.
అంతకన్నా కూడా.. వీడియోలోని ఒక దృశ్యంలో అమెరికా అధ్యక్షుడి కార్యాలయం అయిన ‘ఓవల్ అఫీస్’లోని ‘రిసొల్యూట్ డెస్క్’ ముందు జోసెఫ్ హ్యారిస్ కూర్చొని ఉన్నప్పుడు అతడి ఎదురుగా మార్డన్ తన బట్టలు విప్పుతూ కనిపించడం అమెరికన్ ప్రజల తీవ్ర ఆగ్రహావేశాలకు కారణం అవుతోంది. దీనిని వీక్షించిన మెలానియా ప్రత్యేక ప్రతినిధి ‘ఇది అమర్యాదగానూ, చికాకు పుట్టించేది గానూ ఉంది’ అని వ్యాఖ్యానించగా.. తనని ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశించి.. ‘‘నేను ఒక నటిని. థీమ్ కు అవసరమైన విధంగా నటించడమే నా వృత్తిధర్మం. దీనికి నేనేమీ పశ్చాత్తాపం చెందడం లేదు’’ అని మార్డన్ సమాధానం ఇచ్చారు. దాంతో ఆమెను అంతమొందిస్తామని వస్తున్న బెదరింపులు మరింత ఎక్కువయ్యాయి.
♦ భారతదేశంలో 65 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో 80 శాతం మంది ఆస్టియోపోరోసిస్ (ఎముకలు డొల్లబారడం)తో బాధపడుతున్నట్లు ఢిల్లీ వైద్యులు నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయింది. అయితే వయసులో ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆస్టియోపోరోసిస్‌ను నివారించవచ్చునని సర్వే బృందంలో ఒకరైన ఢిల్లీలోని ‘పోర్టీ మెడికల్’ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఉదయ కుమార్ మయ్యా సూచించారు. డాక్టర్ మయ్యా చెబుతున్నదానిని బట్టి 18–50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకు రోజుకు వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. 50 ఏళ్లు దాటాక 1200 మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకోవలసి ఉంటుంది. ఆహారంలో ఈ మోతాదుకు తగినట్లుగా కాల్షియం లభించకపోతున్నట్లయితే వైద్యుల సలహాపై మాత్రల రూపంలో కాల్షియంను శరీరానికి అందించాలి.
♦ ఇండియాలోని గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో.. కుటుంబానికి మంచినీటిని అందించే బాధ్యత ఏళ్ల నుంచీ స్త్రీలపైనే ఉండడంతో.. పైకి కనిపించని శ్రమతో కూడిన ఆ బాధ్యత వారికి ద్వితీయ శ్రేణి పౌరులుగా మాత్రమే పరిగణన పొందే దుస్థితిని తెచ్చిపెట్టింది. ఇంటికి నీరు ముఖ్యం అయినప్పటికీ, బయటి పనులను మాత్రమే ముఖ్యమైనవాటిగా మన సమాజం భావిస్తుండడంతో మహిళల శ్రమకు గుర్తింపు, వారి అనారోగ్యాలకు వైద్య సేవలు అందడం కూడా అప్రాముఖ్యమైన విషయాలుగానే కొనసాగుతున్నాయి. ఈ అసమానతపై తాజాగా యూనివర్శిటీ ఆఫ్ లండన్‌లోని ‘స్కూల్ ఆఫ్ లా’ రిసెర్చ్ స్కాలర్ గాయత్రీ నాయక్ ఒక సిద్ధాంత పత్రాన్ని సమర్పించారు. కుటుంబ బాధ్యతల్ని జెండర్‌ని బట్టి విభజించడం వల్ల మహిళల సామాజిక, ఆరోగ్య, విద్యా స్థితి గతులను ఆ విభజన నిర్ణయిస్తోందని దీని వల్ల స్త్రీ, పురుషుల మధ్య అసమానతలు పెరిగిపోతున్నాయని ఆమె తన పత్రంలో వ్యాఖ్యానించారు.
♦ లైంగిక అఘాయిత్యాల నుంచి మాతృదేశానికి యువకులే రక్షణగా ఉండాలని నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి పిలుపునిచ్చారు. ‘‘మహిళలు, యువతులు, బాలికలు భయం గుప్పెట్లో ఉన్న విపరీత పరిస్థితి ఇప్పుడు దేశమంతటా నెలకొని ఉంది. ఇంట్లో, పనిచేసే ప్రదేశంలో, బహిరంగ ప్రదేశాలలో ఎక్కడా వారికి రక్షణ లేదు. ఇది మాతృభూమికే అవమానం’’ అని నాగపూర్‌లో జరిగిన ఆర్.ఎస్.ఎస్. కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అన్నారు. భరతమాతను ఈ అమర్యాదకరమైన స్థితిని తప్పించేందుకు ప్రతి యువకుడూ మహిళల రక్షణకు కంకణం కట్టుకోవాలని చెప్పారు.
♦ ఇండోనేషియాలో పోలీసు ఉద్యోగంలో చేరడానికి వచ్చే యువతులకు కన్యత్వ పరీక్షలు చేయడంతో పాటు.. వారు అందంగా ఉండాలనే అనధికారిక నిబంధన ఒకటి అమలులో ఉండడంపై ప్రస్తుతం ఆ దేశంలోని మానవ హక్కుల సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇరవై ఇరవై ఐదేళ్ల మధ్య వయసు ఉన్న యువతులను పోలీస్ అధికారిగా కన్నా, వాంఛ తీర్చే సాధనంగా మాత్రమే అంగీకరించే మనస్తత్వం ఇండోనేషియా సమాజంలో నెలకొని ఉందని హక్కుల సంస్థ ప్రతినిధి ఆండ్రియాస్ హర్సోనో ఆరోపిస్తున్నారు. దీనిపై ఇండోనేషియా ప్రభుత్వంతో పాటు, అంతర్జాతీయ సమాజమూ తక్షణం స్పందించాలని ఆయన కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment