♦ స్త్రీలకు శబరిమల ప్రవేశంపై జరుగుతున్న వివాదం వినూత్నమైన వాదాలకు చోటు కల్పిస్తోంది. ప్రముఖ వెబ్‌సైట్ ‘ది ప్రింట్’కు సామాజిక అంశాలపై తరచూ వ్యాఖ్యానాలు రాస్తుండే దిలీప్ మండల్ అనే కాలమిస్ట్ తన తాజా వ్యాసంలో ఒక కొత్త వాదనను పైకి తెచ్చారు. ‘‘మహిళలూ.. నిబంధనల రీత్యా ప్రత్యేకమైనవి అయిన శబరిమల వంటి ఆలయాలను మీరెందుకు సందర్శించాలనుకుంటున్నారు? స్త్రీ స్వేచ్ఛను ప్రబోధించే అక్షరాలు గుడి గోడలపై లిఖించి ఉండవు. ఆఫీసులు, పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాలు మాత్రమే స్త్రీకి స్వేచ్ఛను ప్రసాదించే ప్రదేశాలు. అయినా గుడికి వెళ్లే ఆడవాళ్లు గుడి పూజారులు అవుదామనో, ధర్మకర్తలవుదామనో, ఆలయ సంపద కోసమో, ఆలయ నిర్వహణలోని అధికారం కోసమో వెళ్లరు కదా. భక్తితో వెళతారు. దండం పెట్టుకునేందుకు వెళతారు. వేడుకునేందుకు వెళతారు.
కష్టాలు చెప్పుకునేందుకు, మొక్కుల రూపంలో సంతోషాలను పంచుకునేందుకు వెళతారు. అయినప్పటికీ ఈ దేశంలోని కొన్ని ఆలయాలు ఏళ్లనాటి నుంచే స్త్రీల ప్రవేశాన్ని నిషేధించాయి. శనిశింగనాపూర్‌లో వారికి ప్రవేశం లేదు. అలాగే శబరిమలలోనూ లేదు. సుప్రీంకోర్టు తీర్పు సైతం ఆ నిషేధాన్ని చెక్కు చెదర్చలేదని ఇటీవలి పరిణామాలతో స్పష్టమైంది. రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు కల్పించింది. మగాళ్ల ఓటుకు ఎంత విలువ ఉందో, ఆడవాళ్ల ఓటుకూ అంతే విలువ ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో పురుషుడికి ఉన్న సకల హక్కులు, అర్హతలు, అధికారాలు స్త్రీలకూ ఉన్నాయి. పురుషుడిలా స్త్రీ కూడా ఇప్పుడు యుద్ధ విధులను కూడా నిర్వర్తిస్తోంది.
వస్తూత్పత్తి కర్మాగారాలు మహిళల అవసరాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. వాణిజ్య, వ్యాపార సంస్థలు మహిళల సేవలను వినియోగించుకోడానికి ఆసక్తి చూపుతున్నాయి. స్త్రీల జీవితాన్ని సౌకర్యవంతం చేసేలా గర్భనిరోధక మాత్రలు, వాషింగ్ మెషీన్‌లు, మిక్సర్ గ్రైండర్ వంటి ఆవిష్కరణల కోసం శాస్త్రవేత్తలు నిరంతరం పాటు పడుతూనే ఉన్నారు. ఇవన్నీ ఆధునిక మహిళలకు లభిస్తున్న వరాలు. వీటిల్లో ఏ ఒక్క వరాన్నయినా ఆలయాలకు వెళ్లడం ద్వారా మహిళలు పొందగలుగుతారా? లేదు. నియమ నిబంధనలకు విరుద్ధంగా గుడిలోకి ప్రవేశించినంత మాత్రాన వారు సాధించేదేమీ లేదు. వారు పొందే విముక్తి ఏమీ లేదు.
మతవిశ్వాసాలు కలిగిన మహిళలు ఎలాగూ ఆచారాలను పాటిస్తారు కనుక ఆలయ ప్రవేశం లేకపోవడం అన్నది వారికొక లోటు కాదు. స్త్రీ జీవితానికి విముక్తిని, స్వేచ్చను ఇచ్చేవి చదువు, ఉద్యోగం మాత్రమే. అతిక్రమణల వల్ల వారికి ఒరిగేదేమీ ఉండదు’’ అని దిలీప్ మండల్ తన వ్యాసంలో రాశారు. మరి.. స్వేచ్ఛ, విముక్తి భావనలతో నిమిత్తం లేకుండా జీవితంలో ఒక్కసారైనా శబరిమల అయ్యప్పను, శనిశింగనాపూర్‌లో శనీశ్వరుడిని దర్శించుకోవాలని ఆశ, ఆరాటం ఉన్న మహిళల కోరిక తీరేదెలా? ఈ ప్రశ్నలకు ఆయన కుదురైన సమాధానమేమీ చెప్పలేదు.
♦ సైనిక పాఠశాలల్లో బాలికలకు కూడా ప్రవేశం కల్పించాలని ఎట్టకేలకు రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం తక్షణం దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో బాలికలకు అవసరమైన సదుపాయాలను కల్పించి, 2019లో వారి ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతారు. ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ’లో ప్రవేశానికి ఈ సైనిక పాఠశాలల్లో చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది కనుక, బాలికలకు కూడా సైనిక పాఠశాలలో ప్రవేశం కల్పించాలని తల్లిదండ్రుల నుంచి ఏనాటి నుంచో వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం జరిగింది.
ప్రస్తుతం మిజోరంలోని ఛింగ్‌ఛిప్ పాఠశాలలో ఆరవ తరగతిలో ఆరుగురు బాలికలు, లఖ్‌నోవ్ పాఠశాలలో తొమ్మిదో తరగతిలో పదిహేను మంది బాలికలు చదువుతున్నారు. వీరు కూడా ప్రత్యేక అనుమతితో ఈ ఏడాది ఏప్రిల్, జూన్‌లలో చేరినవారే. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వచ్చే ఏడాది నుంచి బాలికలు ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేకుండానే సైనిక పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవచ్చు. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన సైనిక పాఠశాలల ప్రిన్సిపాళ్ల సమావేశంలో రక్షణశాఖ సహాయ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. దేశం మొత్తం మీద ప్రస్తుతం 26 సైనిక పాఠశాలలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment