
రోజా, నగరి ఎమ్మెల్యే
పురుషుడిలో దమ్ము, ధైర్యం లేనప్పుడల్లా చేసేదొక్కటే. స్త్రీని కించపరచడం. స్త్రీ సామర్థ్యాన్ని శంకించడం. స్త్రీని అణచివేయడం. ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉన్న మగాడు ఇలాంటివేమీ చెయ్యడు. అవి లేనివాళ్లకు ఉండేది ఒక్కటే.. రాజకీయ ఆరాటం! అవన్నీ ఉన్న మహిళది ప్రజలకోసం పోరాటం.
మహిళలు చొరవగా, ధైర్యంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే కచ్చితంగా పురుషులకంటే బాగా రాణించగలుగుతారు. మహిళలకు రాజకీయాల్లో సక్సెస్ ఆలస్యంగా రావచ్చు. కానీ ఒక్కసారి సక్సెస్ వచ్చాక ప్రజలే వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తారు.
మహిళలకు పవర్ ఇవ్వాలి అంటారంతా! మగవాళ్లు ఇస్తే స్త్రీలు పుచ్చుకోవడం ఏంటి? అలా అయితే మహిళలు సెకండ్ సిటిజన్స్ అన్నట్టే కదా!
జనాభాలో మహిళలు 50 శాతం ఉన్నారు. అంటే సగ భాగం. కానీ, అన్నిచోట్లా దాదాపు నిర్ణయాధికారాలు మగవాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. అవి మన చేతుల్లోకి ఎలా రావాలి?! మనం అవకాశాల కోసం పోరాడుతూనే ఉన్నాం. పోరాడాలి. అయితే, ఒకరిస్తే మనం తీసుకోవడం ఏంటి అనో, సెకండ్ సిటిజన్స్ అనో భీష్మించుకుని ఉంటే ఆ నిర్ణయాధికారం మన చేతుల్లోకి ఎప్పటికీ రాదు. అధికారం తీసుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. అది ఎప్పటి వరకు అంటే.. మనకు నిర్ణయాధికారం వచ్చేవరకు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అనేది అమలయితే సెకండ్ సిటిజన్ అనే సమస్యే ఉండదు.
రాజకీయాలు ఎంతో తలనొప్పి వ్యవహారం అంటారు. ‘అబ్బ.. ఈ రాజకీయాలు వద్దు’ అని ఇన్నేళ్లలోనూ మీరు అనుకున్న సందర్భాలు ఉన్నాయా?
రాజకీయాలు నిజంగానే చాలా తలనొప్పి వ్యవహారం. కానీ, అందరూ తలనొప్పి తలనొప్పి అనుకుంటూ ఉంటే ఈ రాజకీయాలు ఎప్పటికీ ప్రక్షాళన కావు. ఆడవాళ్లు రాజకీయాల్లో ఎదుగుతున్నారు, చురుగ్గా ఉన్నారు అంటే మగవాళ్లు తట్టుకోలేరు. నేరుగా ఎదుర్కోలే ఆమె క్యారెక్టర్‌ని చెడుగా చిత్రించడం, నిందలు వేయడం, ఎలా కిందకు లాగేయాలా అని మిగతా అందరూ గ్రూప్‌గా చేరి తొక్కేయడానికి ప్రయత్నించడం చేస్తుంటారు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. నా విషయమే చూడండి.. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నన్ను గొప్ప లీడర్‌గా చూశారు. కానీ, వైసీపీలోకి వచ్చాక అప్పుడు గొప్పగా పొగిడిన వాళ్లే ఇప్పుడు ఎన్ని నిందలు వేస్తున్నారో, అణచివేయాలను కుంటున్నారో మీరే చూస్తున్నారుగా. ఒక మహిళగా నేను ఎదుర్కొన్న పీక్ సమస్య ఏంటంటే.. కాల్‌మనీ మాఫియాలో చిక్కుకుని మహిళల జీవితాలు నాశనమైపోతున్నాయని ఒక మహిళగా బాధపడి వారికి న్యాయం చేయాలని అసెంబ్లీలో పోరాటం చేస్తే, నా మీద లేనిపోని నిందలు వేశారు. ఏడాది పాటు రూల్స్‌కి విరుద్ధంగా సస్పెండ్ చేశారు. అప్పుడనిపించింది.. ‘ఛ.. ఏంటీ రాజకీయాలు..’ అని! నాకు ఎవరూ సపోర్ట్ లేరనే ఇలా చేశారు. అదే నాది కనుక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయితే ఇలా చేసేవారా?! అసెంబ్లీ రికార్డ్స్ మార్ఫింగ్ చేసి మరీ ఇంత నీచానికి ఒడిగట్టారు. ధైర్యంగా ఎదుర్కొనే నా విషయంలోనే ఇలా జరిగితే మిగతా మహిళల పరిస్థితి ఏంటి? సస్పెండ్ చేసినా నేను వెనకడుగు వేయలేదు. హైకోర్టు దాకా ఈ సమస్యను తీసుకెళ్లాను.
మగవారికి చదువు నేర్పించవచ్చు కానీ, వారికి మహిళలను గౌరవించే సంస్కారాన్ని ఎలా నేర్పించాలి?
అది కుటుంబం నుంచే జరగాలి. ఇంట్లో కొడుకు, కూతురు ఉంటే పెంపకంలో ఇద్దరినీ సమానంగా చూడాలి. చదువు ఒక్కటే నేర్పిస్తే సరిపోదు. సమాజం పట్ల ఎలా బాధ్యతగా ఉండాలో కూడా చెప్పాలి. ఇంట్లో ఏ ఒక్కరినీ తక్కువ చేయకూడదు. భార్య అయినా, భర్త అయినా ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం ఉంటే అది చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఆ పెంపకంలో నుంచి వచ్చినవాళ్లకే సంస్కారం ఉంటుంది.
రాజకీయం అబద్ధమా? అబద్ధం రాజకీయమా?
ఈ రోజు రాజకీయాలు చూస్తుంటే అబద్ధం రాజకీయం అని చెప్పలేం. కానీ, రాజకీయాలలో అబద్ధాలు చెప్పే నాయకులే ఎక్కువ కనిపిస్తున్నారు. అలాంటి వారిని ప్రజలు నమ్మడం వల్ల రాష్ట్రం ఎన్ని అష్టకష్టాలు పడుతుందో స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇప్పటికైనా అబద్ధాలు చెప్పేవారిని నమ్మకుండా నిజాయితీగా, విలువలతో కూడిన నేతలను నమ్మిన రోజే రాజకీయాలకు ఒక గౌరవం గుర్తింపు వస్తుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది.
అన్ని ఆభరణాలలో రాజకీయం ఎలాంటి ఆభరణం?
రాజయం అలంకారప్రాయమైన ఆభరణం కాదు. రాజకీయం అరుదైన బాధ్యత. ప్రజలలో మంచి పనులు చేసి, ప్రజల మన్ననలు పొందే అద్భుతమైన అవకాశం. ఒక వ్యక్తి ఎక్కువ మందికి సహాయం, న్యాయం చేసే అవకాశం ఒక్క రాజకీయం వల్లే వస్తుంది. ఆభరణంతో పోల్చితే కనుక పదిమందికి సాయం చేసే కీర్తికిరీటం రాజకీయం.
పవర్ వస్తుంది.. పోతుంది. ఎంపవర్‌మెంట్ ఎప్పటికీ ఉంటుంది. మన అక్కచెల్లెళ్లను ఎలా ఎంపవర్ చేయాలి?
సహజంగానే ఎక్కడైనా మహిళ గట్టిగా ప్రశ్నించి, నిలదీస్తే ఆమె క్యారెక్టర్ మీద దాడి చేస్తారు. నోరెక్కువ అని ప్రచారం చేస్తారు. ఇవన్నీ తట్టుకొని, ఫ్యామిలీ సపోర్ట్‌తో ఫైట్ చేయగలిగితే.. మనం ఎంచుకున్న లక్ష్యం (ముఖ్యంగా పేద ప్రజలకు సాయం) చేరుకుంటాం. పురుషులతో పోలిస్తే మహిళలకు రాజకీయాల్లో ప్రతిబంధకాలు చాలా ఎక్కువ. మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ మొత్తం రాజకీయ వ్యవస్థ పురుషాధిపత్యమైపోయింది. ఇలాంటి వ్యవస్థలో మహిళలు రాణించాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి. రాజకీయాల్లో నిత్యం ప్రజల మధ్యలోకి వెళ్లాలి. కష్టమొచ్చినా, సంతోషమైనా, చావైనా, పుట్టుకైనా, ధర్నాలు, ఆందోళనలు ఇవన్నీ మహిళలకు రకరకాల ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇక మహిళలు తమను తాము కాపాడుకోవడం రాజకీయాల్లో పెద్ద సవాల్. ఇక్కడ మహిళలను చాలామంది చులకన భావంతో చూస్తారు. ఆ అవమానాలను భరించి ధైర్యంగా నిలబడాలి. ఏ సమయమైనా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమై ఉండాలి. ఇవన్నీ మహిళలకు ఇబ్బందికరమైన అంశాలే. కానీ, ఈ కష్టాలన్నీ అధిగమించి మహిళలు ఇప్పుడు రాజకీయాల్లో నిలదొక్కుకుంటున్నారు. రాజకీయాల్లో ఉన్న పురుషులకు కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు అందరూ సహకరిస్తారు. కానీ, మహిళలకు కుటుంబంలో, స్నేహితులలో సహకరించే వాళ్లే తక్కువ ఉంటారు. కనుక రాజకీయాలు మహిళలకంటే కూడా పురుషులకు అనుకూలంగా ఉంటాయి. కానీ మహిళలు ధైర్యంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే కచ్చితంగా పురుషులకంటే బాగా రాణించగలుగుతారు. మహిళలకు రాజకీయాల్లో సక్సెస్ ఆలస్యంగా రావచ్చు. కానీ ఒక్కసారి సక్సెస్ చూశాక మహిళలు ఉన్నత శిఖరాలకు చాలా వేగంగా చేరుకోగలుగుతారు.
పురుషులతో పోల్చితే రాజకీయాల్లో మహిళలకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి?
చిన్నవిగా అనిపించే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి.. బయలాజికల్‌గా అన్ని రోజులూ తిరగలేం. మగవారికి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది, ఇవ్వకుంటే తప్పుగా అర్థం చేసుకుంటారు. మహిళా నేతకి ఫాలోవర్‌గా ఉంటే తమ వెనుక వచ్చే పురుష నేతలు ఎగతాళి చేస్తారని చాలా మంది సపోర్ట్ చేయరు.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి
Comments
Please login to add a commentAdd a comment