ఆత్మవిశ్వాసమే ఆమె ఆయుధం | Women Running Cycle Repair Shop in Warangal | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసమే ఆమె ఆయుధం

Published Thu, Aug 22 2019 7:31 AM | Last Updated on Thu, Aug 22 2019 7:31 AM

Women Running Cycle Repair Shop in Warangal - Sakshi

టైర్‌ పంక్చర్‌ అతుకుతున్న శారద

భర్త అనారోగ్యం ఆమెపై మోయలేని భారాన్ని మోపింది. ఉన్నదంతా భర్త వైద్యానికే ఖర్చు చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. పూట గడవటం కష్టంగా మారింది. అటువంటి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకున్న ఆ ఇల్లాలు కష్టాలకు ఎదురొడ్డి నిలిచి సైకిల్‌ రిపేరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమే వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలోని భీంపల్లికి చెందిన చింతల శారద.

కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవించే చింతల సుభాష్‌ 2002లో ఒళ్లంతా తిమ్మిర్లు వస్తూ అనారోగ్యం బారిన పడ్డాడు. తమకున్న భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో పాటు అక్కడిక్కడ సుమారు రూ. రెండులక్షల వరకు అప్పు చేసి భర్తకు వైద్యం చేయించింది శారద. అయినా సుభాష్‌కు వ్యాధి నయం కాకపోవడంతో ఏ పనీ చేయలేని పరిస్థితుల్లో ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి పూట గడవటం కష్టమైంది. అలాంటి పరిస్థితుల్లో కుటుంబ పోషణ భారం తనపై వేసుకుని సైకిల్‌ మరమ్మతులు చేయడం ప్రారంభించింది శారద. సైకిల్‌ పంక్చర్లు వెయ్యడం నుంచి మెల్లిగా స్కూటర్లు, ట్రాక్టర్‌ టైర్ల పంక్చర్లు అతకడం నేర్చుకుని ప్రస్తుతం సైకిల్‌ రిపేరింగ్‌తో పాటు అన్ని వాహనాల పంక్చర్లు వేస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తూ తమ ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది. తల్లి పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన వీరి కుమారుడు రాజు పదో తరగతి తర్వాత చదువు మానేసి గొర్ల కాపరిగా జీతం ఉంటూ కుటుంబ పోషణలో తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.

సొంతిల్లు అమ్ముకుని అద్దె ఇంట్లో..
సుభాష్‌ వైద్య ఖర్చుల కోసం మొదట తమకు ఉన్న 20 గుంటల భూమిని అమ్మేసింది శారద. వైద్య ఖర్చులకు ఆ డబ్బు చాలకపోవడంతో మరో రూ.2 లక్షల వరకు అప్పు చేసింది. సైకిల్‌ రిపేరింగ్‌తో వచ్చే డబ్బు కుటుంబ పోషణకే చాలడం లేదంటే సుభాష్‌కు నెలనెలా మందుల కోసం సుమారు రూ. రెండు వేల వరకు ఖర్చవుతోంది. ఈ క్రమంలోనే ఉన్న ఇల్లు కూడా అమ్మేశారు. అప్పటినుంచి అద్దె ఇంట్లోనే కాలం వెళ్లదీçస్తూ... దాతల ఆసరా, ప్రభుత్వ సాయం కోసం కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు.– గాజుల సతీష్‌కుమార్,సాక్షి కమలాపూర్‌ (వరంగల్‌ అర్బన్‌ జిల్లా)

ప్రభుత్వమే ఆదుకోవాలి
నా భర్త అనారోగ్యం బారిన పడి పదిహేడేళ్లు అయితాంది. ఉన్న ఆస్తి అంతా పోయి ఇంకా రూ.3 లక్షల దాక అప్పు ఉన్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. సైకిల్‌ రిపేరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొత్తాన. ఇప్పటికైనా ప్రభుత్వం సబ్సిడీ రుణం ఇప్పించి ఆదుకోవడంతో పాటు ఇళ్లు లేని మాకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టిచ్చి ఇయ్యాలె.– చింతల శారద

ఏ పని చేయలేక పోతాన
నాకొచ్చిన వ్యాధి నయం కాక ఒళ్లంతా తిమ్మిర్లు వత్తానయి. ఏ పనీ చేయలేక పోతాన. నా వైద్యం కోసం, బిడ్డ పెళ్లి కోసం ఉన్నదంతా అమ్ముకున్నం. నా భార్య శారద ఇంటికి పెద్ద దిక్కుగా మారి నన్ను, నా కుటుంబాన్ని సాకుతాంది. ఆమె పడే కష్టం చూడటం తప్ప మరేమీ చేయలేక పోతాన. ప్రభుత్వమే మా కుటుంబాన్ని ఆదుకోవాలె.– చింతల సుభాష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement