శిఖరాన ఉన్నవాళ్లను తలెత్తి చూస్తాం. శిఖరాగ్రానికి చేరుకున్న మహిళల్ని కూడా అలాగే కదా చూడాలి తల పైకెత్తి. కానీ మనకు చిన్నచూపు! మహిళలు ఏం సాధించినా చిన్నచూపే. అసలు మహిళలంటేనే చిన్నచూపు. దీన్నే ‘వివక్ష’ అంటారు. క్రీడల్లో ఈ వివక్ష ఎక్కువగా కనిపిస్తుంటుంది. అమ్మాయి ఆడతానని ముందుకు వస్తుంది. స్పాన్సరర్‌లు వెనక్కు వెనక్కు పోతారు. అమ్మాయిలు అద్భుతంగా ఆడుతుంటారు. క్రీడాప్రాంగణాలు తలతిప్పి చూసేందుకు కూడా ఇష్టపడవు. ఇది ఒక రకమైన వివక్ష అయితే.. ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తూనే, సదుపాయాల్ని కల్పించకపోవడం ఇంకోరకం వివక్ష. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం 25వ సీనియర్ ఉమెన్స్ నేషనల్ చాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్నాయి. అక్కడి పసిఘాట్, సీహెచ్‌ఎఫ్ స్టేడియంలో పోటీలు.‘‘అమ్మాయిలూ.. సత్తా చూపించండి’’ అన్నారు. ఎలా చూపిస్తారు? ఆ రెండు స్టేడియం గ్రౌండ్‌లు వానలకు బురద కుంటల్లా మారిపోతేనూ! కాలితో ఎంత గట్టిగా తన్నినా బాల్ కదిలితేనా? అలాగే ఆడారు.
మొదట బిహార్‌కి, కర్ణాటకకు పడింది. కర్ణాటక టీమ్ ఓడిపోయింది. తన్వీ హ్యాన్స్‌కు కన్నీళ్లొచ్చాయి. కర్ణాటక టీమ్ కెప్టెన్ (స్కిప్పర్) ఆ అమ్మాయి. పెద్ద ప్రొఫైల్ తనది. పెద్ద పెద్ద యూరప్ ఫుట్‌బాల్ క్లబ్బులలో ఆడిన అనుభవం ఉంది. ఆమె కన్నీళ్లు ఓడిపోయినందుకు కాదు, అలాంటి గ్రౌండ్‌లో ఆడవలసి వచ్చినందుకు! అసలు ఆ గ్రౌండ్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో చెబితే ఎవరూ నమ్మరు. తన్వీ వాటిని ఫొటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. వాటిని చూసిన క్రీడాభిమానులకు గుండె చెరువైంది. ‘‘డియర్ ఇండియా. ఇవి కూడా క్రీడా జట్లే. వీళ్లు కూడా క్రీడాకారులే. ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్స్ ఆడవలసిన గ్రౌండ్‌లు ఇవైతే కాదు..’’ అని ఒకరు ట్వీట్ చేశారు, తన్వీ పెట్టిన ఫొటోలను చూశాక. మన దేశంలో మహిళలు ఎదుర్కొనే ఒక ముఖ్య సమస్య ఈవ్ టీజింగ్. ఇప్పుడీ ‘గ్రౌండ్’ వివక్ష కూడా ఈవ్ టీజింగ్‌లానే కనిపిస్తోంది.
►నిన్న మేము బిహార్ మీద ఓడిపోయాం.కన్నీళ్లతో బయటికి నడిచాను. గెలవలేకపోయినందుకు కాదు. ఎంత కష్టంగా ఆడాల్సి వచ్చింది! గ్రౌండ్ అంతా చిత్తడి చిత్తడిగా ఉంది. మధ్య మధ్య నీటి కుంటలు. బంతి కదిల్తేనా!! ఆడమని మాకు ఇచ్చిన గ్రౌండ్‌లను చూస్తే గుండె ముక్కలైపోయింది. ఒకవేళ మా జట్టు గెలిచి ఉన్నా, నా కన్నీళ్లయితే ఆగేవి కాదు.
– తన్వీ హ్యాన్స్, ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి
Comments
Please login to add a commentAdd a comment