నా జీవితం నీ అశ్లీల చిత్రం కాదు | Women's War on Secret Cameras | Sakshi
Sakshi News home page

నా జీవితం నీ అశ్లీల చిత్రం కాదు

Published Sun, Aug 26 2018 11:42 PM | Last Updated on Mon, Aug 27 2018 12:43 PM

Women's War on Secret Cameras - Sakshi

షాపింగ్‌కు సంశయిస్తున్న ఓ కొరియన్‌ యువతి, సీక్రెట్‌ కెమెరాలపై కొరియాలో వెల్లువెత్తిన నిరసన

దక్షిణ కొరియాలో ‘రహస్య కెమెరాలతో చిత్రీకరణ’ సమస్య తీవ్రరూపం దాల్చింది. బీచులు, స్విమ్మింగ్‌పూల్స్‌ మాత్రమే కాకుండా పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనూ ఇలాంటి చిత్రీకరణలు పెరిగిపోయి వ్యక్తిగత గోప్యతకు ఆటంకంగా మారుతున్నాయి. ఇది ఎంతవరకు వెళ్లిందంటే.. ఇలా సీక్రెట్‌ కెమెరాలతో రికార్డ్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది మహిళలు ‘నా జీవితం నీ అశ్లీల చిత్రం కాదు’ (మై లైఫ్‌ ఈజ్‌ నాట్‌ యువర్‌ పోర్న్‌) అనే ప్లకార్డులు చేపట్టి ఇటీవల వీధుల్లో నిరసనలు తెలిపే వరకు! నిరసనల వరకే మహిళలు పరిమతం కాలేదు. ఇలాంటి వీడియోలు రికార్డ్‌ చేస్తున్న, వీక్షిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రపంచ దేశాలతో పాటు దక్షిణ కొరియాలోనూ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఏడాది నుంచి ‘మీ టూ ఉద్యమం’ సాగుతోంది. ఈ ఉద్యమం ద్వారా బాధితులు బయటికి వచ్చి.. లైంగికదాడులు, వేధింపులకు పాల్పడిన అధికార డెమొక్రాటిక్‌ పార్టీ నేత యాన్‌ హి–జింగ్‌ సహా పలువురు ప్రముఖులను సైతం ఎండగట్టగలిగారు. ఈ నేపథ్యంలోనే తమను రహస్య కెమెరాల్లో చిత్రీకరించడంపైనా మహిళలు గళమెత్తారు.

ఏమిటిది అకస్మాత్తుగా!
పార్కులు, స్విమ్మింగ్‌పూల్స్, బీచ్‌లలోని రెస్ట్‌రూమ్‌లు, గదుల్లో దుస్తులు మార్చుకుంటున్న మహిళలను రహస్య కెమెరాల ద్వారా రికార్డ్‌ చేస్తున్న ఘటనలు దక్షిణ కొరియాలో ఇటీవల కాలంలో తరచూ బయటపడుతున్నాయి. వీటిపై మహిళల నుంచి ఒక్కసారిగా ఫిర్యాదులు పెరిగిపోవడంతో పోలీసు బృందాలు స్కానర్లతో రంగంలోకి దిగి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ సీక్రెట్‌ కెమెరాలు ఉన్నాయో కనిపెట్టి వాటిని తొలగించే చర్యలు చేపడుతున్నారు. అయితే చిన్న చిన్న కెమెరాలు ఎక్కడ పెట్టారనేది మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా లెక్కకు మించి  తనిఖీలు చేపడుతున్నా ఈ సమస్యకు చెక్‌ పెట్టలేకపోతున్నారు.

పెరుగుతున్న బాధితులు
2012–16 మధ్యకాలంలో రహస్య చిత్రీకరణ బాధితులుæ 26 వేల మందికి పైగానే ఉన్నారని, వారిలో 80 శాతం మంది మహిళలేనని గుర్తించారు. తమను రికార్డ్‌ చేశారన్న సంగతి కూడా వారిలో చాలా మందికి తెలియదని పోలీసులు చెబుతున్నారు. అయితే వారు చెబుతున్న దాని కంటే కనీసం పదింతలు ఎక్కువగా బాధితుల సంఖ్య ఉండొచ్చునని సూన్‌చున్హ్‌ యాంగ్‌ వర్సిటీ క్రిమినాలజీ (నేరశాస్త్రం) ప్రొఫెసర్‌ ఓహ్‌ యూన్‌–సంగ్‌ అంటున్నారు. 

‘‘ఇది రోజువారి జీవితంలో భాగమై పోయింది. ఇలాంటి వాటికి పాల్పడిన వారిపై మరింత కఠినచర్యలు తీసుకోవాల్సి ఉంది’’ అని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు మూన్‌ జో–ఇన్‌ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. 2011లో 1,354 మందిని సీక్రెట్‌ కెమెరా నేరస్థులను పోలీసులు గుర్తించగా, 2017 నాటికి వారి సంఖ్య 5,363 మందికి పెరిగింది. సులభంగా స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండడంతో పాటు సోషల్‌ మీడియా వ్యాప్తి కూడా ఈ నేరానికి దోహదపడుతోందని సామాజిక పోడకల అధ్యయనవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

‘ఐదేళ్ల శిక్ష చాలదు’  
పోలీసు అధికారులు కెమెరా హార్డ్‌వేర్‌ అమ్మకాలపై నిఘాతో పాటు రహస్య చిత్రీకరణలు పెద్ద నేరమనే అంశానికి ప్రచారం కల్పిస్తున్నారు. అంతేకాకుండా బహిరంగప్రదేశాల్లో ఏయే రూపాల్లో అతిచిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్‌కు వీలుందో పౌరులకు అవగాహన కల్పిస్తున్నారు. రహస్య రికార్డింగ్‌లకు పాల్పడిన వారికి అయిదేళ్ల శిక్ష లేదా రూ.6.2 లక్షల జరిమానా విధిస్తున్నారని, అయితే ఇంతకంటే కఠినమైన శిక్షలుండాలని కొరియా మహిళా న్యాయవాదుల సంఘం నేత కిమ్‌ యంగ్‌–మి డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారిలో 5.3 శాతం మాత్రమే జైలుకు వెళ్లినట్టుగా అయిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఊహించని చోట్ల కెమెరాలు!
బేస్‌బాల్‌ టోపి, బెల్టు, గడియారం, లైటర్, యూఎస్‌బీ పరికరం, చొక్కాపై ధరించే టై, కారుతాళాలు, పాదరక్షలు ఇలా ప్రతి వస్తువుపై అతిచిన్న రహస్య కెమెరాలు అమరుస్తున్నారు. మాల్‌లు, షాపింగ్‌ సెంటర్‌లు, బీచ్‌లు, స్విమ్మింగ్‌ పూల్‌లు, దుస్తులు మార్చుకునే గదుల్లో డోర్‌లాకర్లు, ఫ్రేమ్‌లు, స్నానపు గదుల్లోని షవర్లు, టాయ్‌లెట్లలో ఎక్కడబడితే అక్కడ వీటిని పెట్టి దృశ్యాలు రికార్డ్‌ చేస్తున్నారు. వాటిని వెబ్‌సైట్లతో పాటు సోషల్‌ మీడియాలోనూ పోస్ట్‌ చేస్తున్నారు. దీన్ని అదుపుచేయడంతో పాటు ఆన్‌లైన్, ఇతర వెబ్‌ కంటెంట్‌లో ఇలాంటి అక్రమ రికార్డింగ్‌లు పెట్టకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని దక్షిణ కొరియాలోని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


– కె. రాహుల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement