ఆకాశంలో సగం దేవుడెరుగు. స్పేస్ రీసెర్చ్ సెంటర్‌లోనే మహిళలకు స్పేస్ లేదు! లైంగిక వేధింపులపై రెండేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న బాధితురాలికి దిక్కే లేకపోగా.. చివరికి చుక్కెదురైంది! కేరళలో జరిగిన ఈ ఉదంతంలో.. మహిళా ప్రొఫెసర్‌కి న్యాయం జరగపోగా.. వేధించిన సహోద్యోగికి ప్రమోషన్ దక్కింది! అంగారక గ్రహానికి వెళుతున్నాం. అతివ విషయంలో ఎందుకిలా.. పాతాళంలోకి కృంగిపోతున్నాం?!
స్పేస్ సెంటర్‌లో పని చేస్తున్నంత మాత్రాన స్త్రీకి ఇంత ప్రొటెక్షన్ అవసరమా?! అవసరం లేదు. కానీ భూమి మీద ఏ స్పేస్‌లోనూ ఉద్యోగం చేస్తున్న మహిళకు లైంగిక వేధింపుల నుండి రక్షణ ఉండడం లేదు. అంతేకాదు.. ఆమె ఫిర్యాదుకూ విలువ లేకుండా పోతోంది!
‘‘గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి...స్త్రీ, శిశు సంక్షేమం కోసం మీరు చాలా పథకాలనే రూపొందించారు. ఆడపిల్లల కోసం బేటీ బచావో, బేడీ పడావో, మహిళలు, ఉద్యోగినుల కోసం స్వధార్ గృహ, ఎస్‌టీఈపీ (సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్ ఫర్ విమెన్), ఉద్యోగినీ స్కీమ్, డీఎస్‌టీలో విమెన్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ వంటివాటిని ప్రవేశపెట్టారు. అయితే చాలా కళాశాలల్లో, యూనివర్సిటీల్లో సైంటిఫిక్ ఫ్యాకల్టీగా మహిళలు 25 శాతం కంటే తక్కువగా అథఃపాతాళంలో ఉన్నారు. మహిళా శాస్త్రవేత్తలయితే 14 శాతం కంటే కనిష్టం అన్నది కనపడుతున్న నిజం. కారణం.. విమెన్ ఫ్రెండ్లీ వాతావరణంలేకపోవడమే. కాబట్టి అలాంటి వాతావరణం కల్పించాలని కోరుతున్నాం..’’ దాదాపు రెండేళ్ల కిందట కేరళకు చెందిన మహిళా ఉద్యమకారులు, రచయిత్రులు, ప్రొఫెషనల్స్ అందరూ కలిసి ప్రధానమంత్రికి పెట్టిన అర్జీ ఇది.
ఎందుకు పెట్టవలసి వచ్చింది?
తిరువనంతపురంలోని ఐఐఎస్‌టీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ)లో ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది అనిత (పేరు మార్చాం). చాలా బ్రిలియంట్ ప్రొఫెసర్. చురుగ్గా ఉంటారు. బోధన కాకుండా అప్పగించిన ప్రాజెక్ట్స్‌ను నిర్ణయించిన టైమ్‌కల్లా పూర్తి చేసేంత నిబద్ధత గల అధ్యాపకురాలు. పని అంటే ప్రాణం. జీవన్ (ఇతని పేరూ మార్చాం).. ఐఐఎస్‌టీలోనే ఇంకో ప్రొఫెసర్. అనిత కొలీగ్. 2016, నవంబర్ చివరివారం. ఆఫీస్‌రూమ్‌లో అకడమిక్ డిస్కషన్ జరుగుతోంది. అనిత, జీవన్‌తోపాటు ఇంకో నలుగురు ప్రొఫెసర్‌లు, ఒక స్టూడెంటూ ఉన్నారు. చర్చలో భాగంగా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్‌కు సంబంధించి అనిత ఏదో వివరిస్తోంది. ఆమె ఏం చెప్తున్నా మాటమాటకీ అడ్డు తగులుతున్నాడు జీవన్. విసుగు చెందిన అనిత ‘‘అలాగైతే మీ ప్రజెంటేషన్ మీరు ఇచ్చుకోండి.. నా ప్రెజెంటేషన్ నేను ఇచ్చుకుంటాను’’ అని సౌమ్యంగానే చెప్పింది అనిత. అహం దెబ్బతిన్న జీవన్ .. కోపంగా అనిత వైపు వస్తూ.. ఆమెను గది మూలకు నెడుతూ, ఆమె వైపు వేలు చూపిస్తూ.. ‘‘పోవే’’ అంటూ అమర్యాదగా సంబోధిస్తూ.. కొట్టడానికీ చేయి లేపాడు. ఈ పరిణామానికి అనిత సహా అక్కడున్న వాళ్లంతా బిత్తరపోయారు. పరిస్థితిని చక్కదిద్దడానికి జీవన్‌ను ఆ గది నుంచి బయటకు పంపారు. ఆ అవమానాన్ని సహించలేని అనిత తెల్లవారే జీవన్ మీద ఐఐఎస్‌టీ డైరెక్టర్‌కు కంప్లయింట్ చేసింది.
రెండు కమిటీలు నిర్ధారించినా..!
అనిత దరఖాస్తును స్వీకరించిన డైరెక్టర్ రెండు అంతర్గత విచారణ సంఘాలను నియమించాడు. ఆ రోజు అకడమిక్ డిస్కషన్స్‌లో పాల్గొన్న ప్రొఫెసర్లలో అనిత కాక ఇంకో మహిళా ప్రొఫెసర్ కూడా ఉన్నారు.ఇంటర్నల్ కమిటీస్ విచారణలో ఆమె సాక్ష్యం చెప్పారు.. అనిత పట్ల జీవన్ అమర్యాదకరంగా.. అసభ్యంగా ప్రవర్తించాడని. మిగిలిన ముగ్గురూ ఆమె సాక్ష్యాన్ని (స్టూడెంట్ సహా) బలపరిచారు.నివేదికను పరిశీలించిన డైరెక్టర్.. జీవన్‌ను పిలిచి.. మందలించి.. విషయాన్ని అక్కడితో వదిలేశాడు. డైరెక్టర్ చర్యకు నివ్వెరపోయింది అనిత. రెండు కమిటీలు ఎంక్వయిరీ చేసి.. జీవన్ అనే వ్యక్తి అకారణ కోపం ప్రదర్శించాడని, హద్దు మీరాడని, అసభ్యపదజాలాన్ని వాడాడని, ఒక బోధనాలయంలో ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించాడని సాక్ష్యాధారాలతో రిపోర్ట్ ఇస్తే.. అతనిని పిలిచి చిన్నగా మందలించి తిరిగి డ్యూటీలోకి పంపించడమా? ఇది ఇంకో అవమానంగా అనిపించింది అనితకు.
శిక్షించకపోగా.. ప్రమోషన్!
అనిత ఆలోచించింది. ఇలాగే వదిలేస్తే.. ఈ రోజు తనను అన్నవాడు.. రేపు ఇంకో ఉమన్ ప్రొఫెసర్‌ను అంటాడు. స్టూడెంట్స్ కూడా దీన్ని ఇండికేషన్‌గా తీసుకుని తమ ఫిమేల్ క్లాస్‌మేట్స్ పట్లా ఇలాగే మిస్‌బిహేవ్ చేసే ప్రమాదం ఉంది. అందుకే అక్కడితో సమాధానపడొద్దని నిర్ణయించుకుంది. పైగా ఇది ఆమె ఆత్మగౌరవాన్ని కించపరిచిన సంఘటన. అందుకే తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ ఇస్రో చైర్మన్‌కు అప్పీల్ చేసుకుంది. కేసు పూర్వాపరాలు, అంతర్గత విచారణ కమిటీల నివేదికనూ చదివిన చైర్మన్.. ఐఐఎస్‌టీ డైరెక్టర్‌కు లేఖ రాశాడు.. అనిత కేస్‌లో జీవన్‌ను మందలించి వదిలేయడమనేది అతను చేసిన నేరానికి సరిపడా శిక్ష కాదని, ఈ విషయంలో డైరెక్టర్ పునరాలోచన చేసి, తగు నిర్ణయం తీసుకోవాలని. ఆశ్చర్యం ఏంటంటే ఐఐఎస్‌టీ డైరెక్టర్ ఆ లేఖను నిర్లక్ష్యం చేయడమేగాక, తర్వాత కొన్ని రోజులకే జీవన్‌కు ప్రమోషన్ ఇవ్వడం. కంగుతినడం అనిత వంతైంది. అంతర్గత పోరాటంతో అలిసిపోయిన ఆమె ఇండియన్ పీనల్ కోడ్ సాయం తీసుకోవాలనుకుంది.
అండగా మహిళా సంఘాలు
పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చింది. ఇన్‌సల్టింగ్ మోడస్టీ ఆఫ్ ఉమన్ (మహిళను కించపరచడం) అనే కారణంతో సెక్షన్ 509, సెక్షన్ 506 (భయపెట్టడమనే కాజ్) కింద జీవన్ మీద వలియమాల (తిరువనంతపురం) పోలీసులు కేస్ నమోదు చేశారు. ఇది తెలిసిన ‘స్త్రీ కూటయమా’ అనే మహిళా హక్కుల పరిరక్షణ సంస్థ అనితకు అండగా నిలబడింది. స్త్రీ కూటయమాలో యాక్టివిస్ట్‌లతో పాటు రచయిత్రులు, ప్రొఫెషనల్స్ కూడా భాగస్వాములు. విమెన్ కలెక్టివ్ గ్రూప్ అన్నమాట. అనితకు న్యాయం జరగాలని ఆందోళన మొదలుపెట్టింది ఈ గ్రూప్. ఈ డిమాండ్‌ను కోరుతూనే స్త్రీకూటయమా ప్రధానమంత్రి మోదీకి ఆ విజ్ఞప్తి చేసింది. ఈ నవంబర్‌తో ఆ స్ట్రగుల్‌కి రెండేళ్లు. ప్రస్తుతం నేషనల్ విమెన్ నెట్‌వర్క్ ఇన్ మీడియా ఇండియా గ్రూప్ కూడా అనిత పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తోంది. వీళ్లందరి కృషి, మీ టూ ఉద్యమం ప్రభావంతోనైనా ఆమెకు సరైన న్యాయం అందుతుందని ఆశిద్దాం.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment