పార్కులలో పచ్చిక బయళ్ళపై సమావేశం–కవితలు వినిపించడానికి వచ్చిన కవులు సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ బి.వి.యస్. మూర్తి
తెలుగువారి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో, ఒక నగరపాలక సంస్థ పాఠశాలలో అదోతరగతి గది... ఆ గదిలో ప్రతినెలా రెండో ఆదివారం జరిగే తరగతికి హాజరయ్యేవారిలో షష్టిపూర్తి అంటే 60 ఏళ్లు దాటినవారు, సప్తతి అంటే 70 ఏళ్లు పూర్తి చేసుకున్నవారు, సహస్ర పున్నమి దర్శనానికి అంటే దాదాపు 83 ఏళ్లు ఉన్నవారు విద్యార్థులు. అయితే, ఆ తరగతికి హాజరయ్యేవారందరూ వయోవృద్ధులేమీ కాదు... నూనూగు మీసాల యౌవన దశకు చేరున్న యువకులు, అప్పుడే కౌమారదశకు చేరుకున్న అమ్మాయిలు కూడా అక్కడ విద్యార్థులే. ఉద్యోగాలు చేసి, రిటైరయినవారు, ఇంకా ఉద్యోగపర్వంలోనే ఉన్నవారు, ఉద్యోగార్థులు, విద్యార్థులు అందరూ అక్కడ ఎంతోఉత్సాహంగా హాజరవుతూంటారు. అయితే, ఎక్కువ మంది వయోవృద్ధులే! ఇక, ఈతరగతిలో వీరందరూ సేదతీరేది సాహితీ వ్యాసంగంతో.. నిర్వహించుకునేది సాహితీ సేద్యం.. ఎలాగంటారా?
గోదావరీ తీరాన నెలకొని ఉన్న రాజమహేంద్రవరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో, సంస్కృతాంధ్రాలు బోధించే గౌతమీ ఓరియంటల్ కళాశాల ఒకటి. ఎందరో మహామహోపాధ్యాయులు ఇక్కడ పాఠాలు చెప్పేవారు. బులుసు మాస్టారు ఇక్కడ తెలుగు, ఆంధ్రుల చరిత్ర బోధించేవారు. (ప్రస్తుతం ఈ కళాశాల మూతబడింది). ఆ సమయంలో ఆయన విద్యార్థులలో అంతో ఇంతో సాహిత్యాభిమానం లేకపోలేదు, కానీ వారికి అందుబాటులో ఒక వేదిక లేదు, వారిని ప్రోత్సహించేవారు లేరని గమనించారు. 1992లో తెలుగు భాషాభివృద్ధికి కళాగౌతమి సంస్థను స్థాపించి, నిరంతరాయంగా సాహితీకార్యక్రమాలు నిర్వహిస్తున్నా, కేవలం యువతలో రచనాసక్తిని పెంపొందించడం కోసం 2004లో ప్రత్యేకంగా రచయితల సమితిని స్థాపించారు. తొలి సమావేశం యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం స్థాపించిన పురమందిరంలో జరిగింది.
ఇంతింతై.. వటుడింతై...
తొలి సమావేశానికి కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. ఛందస్సును కూడా ఇక్కడ మూర్తి బోధించేవారు. అలా హాజరైన వారిలో పాతికేళ్ళ ప్రాయం రాకుండానే పాతికపైగా అష్టావధానాలు చేసిన తాతా సందీప్ ఒకరు. ఇక్కడ ఛందో తరగతులకు హాజరై, శతక రచనలు చేసిన కవులు ఉన్నారు. అయితే, మౌఖిక ప్రచారం ద్వారా వచ్చేవారి సంఖ్య ప్రతినెలా పెరుగుతూ వచ్చింది. ఒక్క రాజమహేంద్రవరం నుంచి మాత్రమే కాకుండా, జిల్లాలోని అమలాపురం, అనపర్తి, కోటిపల్లి, మండపేట, సీతానగరం తదితర ప్రాంతాలనుంచి సైతం ఔత్సాహికకవులు రావడం ప్రారంభమైంది.. అంతేకాదు, కార్యక్రమాల ఒరవడి తెలుసుకుని, కొన్ని సందర్భాలలో విజయవాడ, శ్రీకాళం తదితర సుదూర ప్రాంతాలనుంచి ఔత్సాహికులు వచ్చి, స్వీయకవితలను వినిపించేవారు. ప్రతినెలా ఒక అంశాన్ని రెండో ఆదివారానికి పదిరోజుల ముందుగానే రచయితలకు ఇచ్చేవారు. రెండో ఆదివారం ఆ అంశంపై కవులు స్వీయరచనలు వినిపించాలి. పద్య ప్రక్రియలోనే చెప్పాలి, కవితరూపంలోనే చెప్పాలి...
వంటి ఆంక్షలు లేవు. రచయిత తనకు నచ్చిన సాహితీ ప్రక్రియను ఎంచుకోవచ్చును. అంతేకాదు, ఇచ్చిన అంశంపై రచనలతో రానివారు, తమకు నచ్చిన అంశాలపై కూడా రచనలు వినిపించ వచ్చును. స్వీయరచనలను కవులు వినిపిస్తున్న సమయంలో మూర్తి అవసరమనుకుంటేనే సూచనలు చేస్తారు. ఔత్సాహిక రచయితలకు మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి మూర్తి శ్రీకళాగౌతమి అనే పత్రికను ప్రారంభించి, ఇందులో రచయితల సమితి సమావేశాల్లో కవులు వినిపించిన కవితలను, పద్యాలను ముద్రిస్తున్నారు. తమ రచనలు ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళడం రచయితలకు సహజంగా తృప్తిని కలగచేస్తోంది. ప్రతినెలా రెండో ఆదివారం కోసం ఈ రోజున భాషాభిమానులు ఎదురు చూసే స్థాయికి రచయితల సమితి చేరుకుంది. యువతకోసం స్థాపించిన ఈ సంస్థలో నేడు అధికభాగం వయోవృద్ధులే హాజరవుతున్నారు. యువత ప్రాతినిధ్యం ఆశించిన స్థాయిలో లేకపోయినా, అంతో ఇంతో లేకపోలేదు. యువత భాగస్వామ్యం పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగసంస్థల విశ్రాంత ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, గృహిణులు, అధ్యాపకులు ఎక్కువగా ఈ సమావేశాలకు హాజరవుతున్నారు.
నేటికీ గూడు కరువే...
ఈ కార్యక్రమాలు కేవలం సాహిత్యంమీద ఆసక్తితో చేసేవి, సహజంగా వేదిక ఉచితంగా లభ్యం కావాలి. సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఎన్నో ఆడిటోరియమ్‌లు, మినీ ఆడిటోరియంలలో ఆక్యుపెన్సీ చాల తక్కువగా ఉన్నాయన్నది బహిరంగ సత్యం. మూర్తి అర్ధాంగి హేమలత కూడా ప్రభుత్వ అటానమస్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పని చేసి, పదవీ విరమణ చేసినవారే. ఇద్దరికీ నెలనెలా పెన్షన్ వస్తోంది. ఈ భరోసాతోనే ఆయన సాహితీకారులకు ఒక వేదికను కల్పించాలని, ఔత్సాహికులకు ప్రోత్సాహం కల్పించాలని ఆరాట పడ్డారు. ఈ ధ్యేయంతో మూర్తి వేదికకోసం గత 15 సంవత్సరాలలో 12 గడపలు మారారు. కొన్ని సందర్భాలలో పార్కులలో పచ్చిక బయళ్ళమీద కూర్చుని సాహితీ కార్యక్రమాలు నిర్వహించుకునేవారు. వయోవృద్ధులు అవస్థలు పడుతూనే స్వీయరచనలు వినిపించేవారు.
ఒక కుటుంబంలా మారింది
రచయితల సమితికి ప్రతినెలా హాజరయ్యేవారి సంఖ్య పెరగడం చూస్తుంటే, వారిలో సాహిత్యాభిమానం వారిని ఒక కుటుంబంలా మారుస్తోందని అనుకుంటున్నాను. నాలుగు కవితలు వినిపించాలని సుదూరప్రాంతాలనుంచి వయోవృద్ధులు సైతం వస్తున్నారు. వారి కోరిక ఒకటే–నలుగురి ముందు తమ రచనలు వినిపించాలని, ఎదుటి వారి రచనలను తాము ఆస్వాదించాలని. సాహితీ సమావేశాలకు ప్రత్యేకంగా సొంతగూడు ఏర్పడే కాలం సమీపంలోనే ఉందని ఆశిస్తున్నాను.
– డాక్టర్ బులుసు వేంకట సత్యనారాయణ మూర్తి వ్యవస్థాపకుడు, కళాగౌతమి, రచయితల సమితి
– వారణాసి సుబ్రహ్మణ్యం,
సాక్షి సాంస్కృతికం, రాజమహేంద్రవరం
ఫొటోలు: గరగ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment