బ్రెయిన్ ట్రెయిన్
1. ఏకపాద హస్తాసన
సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ కుడిచేయి ముందు నుంచి స్ట్రెచ్ చేస్తూ పైకి తీసుకెళ్లాలి. కుడిభుజాన్ని కుడి చెవికి దగ్గరగా ఉంచి నడుమును పైకి సాగదీస్తూ కుడి చెయ్యిని పైకి స్ట్రెచ్ చేయాలి. ఎడమకాలును వెనుకకు మడిచి ఎడమచేత్తో ఎడమపాదాన్ని పట్టుకోవాలి. కాలి మడమను ఎడమ పిరుదుకు దగ్గరగా నొక్కుతూ పట్టుకోవాలి. నిదానంగా శ్వాస వదులుతూ తల కుడి చెయ్యి కలిపి ఉంచుతూ ముందుకు వంగి కుడిచేయి నేల మీద పెట్టే ప్రయత్నం చేయాలి.
కుడి మోకాలు స్ట్రెయిట్‌గా ఉంచి నుదురు కుడి మోకాలుకు వీలైనంత దగ్గరగా తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. మూడు లేదా ఐదు శ్వాసల తర్వాత శ్వాస తీసుకుంటూ తల కుడి చేయి కలిపి ఉంచి పైకి తీసుకెళుతూ నెమ్మదిగా పైకి లేవాలి. శ్వాస వదులుతూ కుడిచేయి పక్క నుంచి కిందకు, ఎడమపాదాన్ని కిందకు తీసుకురావాలి. అలాగే రెండవ వైపున కూడా ఎడమకాలు మీద నిలబడి కుడికాలును మడతపెట్టి చేయాలి.
ఉపయోగాలు: శరీరంలో కుడి ఎడమ భాగాల మధ్య సమతౌల్యం వస్తుంది. వృద్ధాప్యంలో బాత్‌రూమ్‌లో జారిపడడం వంటి ప్రమాదాలు జరగవు. ్ల హామ్‌స్ట్రింగ్స్ (తొడ వెనుక కండరాలు), పించ్ నర్వ్ కరెక్షన్‌కు, సయాటికా సమస్యకు ఉపయోగం. జీర్ణవ్యవస్థ ఉత్తేజితం. తల భాగానికి రక్తప్రసరణ మెరుగవుతుంది.
2. పర్వతాసన
సూర్యనమస్కారాల్లో ఒకటైన ఆసనాన్ని విడిగా చేయాలి అనుకున్నప్పుడు...
సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకెళ్లాలి. పైన చేతులు ఇంటర్‌లాక్ చేసి శ్వాస తీసుకుంటూ కాలి వేళ్ల మీద పైకి లేస్తూ మడమల్ని పైకి ఎత్తి స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ మడమలను నేల మీద ఆన్చి తల చేతులు కలిపి ముందుకు ఫార్వార్డ్ బెండింగ్ చేయాలి. మోకాళ్లను ఫ్రీగా ఉంచి పొట్టను లోపలకు లాగుతూ నడుము నుంచి పై భాగాన్ని ఎడమవైపు నుంచి కుడివైపునకు కుడి నుంచి ఎడమవైపునకు చేతులను వేలాడేస్తూ రొటేట్ చేయాలి.
తలను మధ్యలోకి తీసుకు వచ్చి చేతులు ముందు నేల మీద ఒకదానికి ఒకటి ఒక అడుగు దూరంలో ఉంచి ఆల్టర్నేట్ పాదాలు ఒక్కో అడుగు వెనుకకు వేస్తూ రెండు పాదాలు వెనుకకు తీసుకువెళ్లి, పాదాల మధ్య ఒకటి లేదా ఒకటిన్నర అడుగు దూరం ఉంచి నడుమును బాగా పైకి లేపి భూమికి శరీరం త్రిభుజాకారంలో ఉండేటట్టుగా ప్రయత్నించాలి. శ్వాస వదులుతూ పొట్టను బాగా లోపలకి లాగిపెట్టి ఉంచే ప్రయత్నం చేస్తూండాలి. మూడు లేదా ఐదు శ్వాసల తర్వాత తిరిగి అలాగే వెనుకకు పాద హస్తాసనము లోనికి, శ్వాస తీసుకుంటూ తల చేతులు పైకి లేపి శ్వాస వదులుతూ చేతులు పక్క నుంచి కిందకు తీసుకువచ్చి తిరిగి సమస్థితిలోనికి రావాలి.
ఉపయోగాలు: శరీరంలో ఉన్న 640 కండరాలలో కనీసం 500 కండరాలకు వ్యాయామం జరుగుతుంది. వెన్నుపూస భాగానికి తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుంది.
3. ప్రసారిత పాదోత్థానాసన
తాడాసన స్థితిలో నిలబడి రెండు కాళ్లను వీలైనంత దూరంగా ఉంచి చేతులు రెండూ పక్కల నుంచి సాగదీస్తూ శ్వాస తీసుకుంటూ పైకి తీసుకువెళ్లి, శ్వాస వదులుతూ రెండు చేతులను, తలను మధ్యలో నుండి ముందుకు వంచి కాళ్లను ఇంకా దూరం చేసి చేతులు రెండు కింద పెట్టే ప్రయత్నం చేయాలి తర్వాత తలను మాడు భాగాన్ని నేల మీద పెట్టే ప్రయత్నం చేయాలి. తల ముందువైపు దూరంగా కాకుండా రెండు కాళ్ల మధ్య సరళరేఖకు దగ్గరగా తీసుకు వచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వీలైతే చేతులు రెండూ వెనుకనుంచి పైకి తీసుకెళ్లి, రెండు చేతులూ ఇంటర్‌లాక్ చేసేందుకు ప్రయత్నించాలి.
ఉపయోగాలు: తలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మెదడు ముఖభాగాలకు ఎక్కువ రక్తప్రసరణ జరగడం వలన ముఖం కాంతివంతంగా తయారవుతుంది. పిట్యుటరీ, హైపోథాలమస్ వంటి మాస్టర్ గ్రంధులు ఉత్తేజితమై వీటి నియంత్రణలో ఉండే థైరాయిడ్, పీనియల్, ఎడ్రినల్ గ్రంధులు బాగా పనిచేస్తాయి. హామ్‌స్ట్రింగ్స్, స్పైన్ శక్తివంతమవుతాయి. పొట్ట భాగాలకు టోనింగ్ జరిగి జీర్ణవ్యవస్థకు మేలు కలుగుతుంది. ఎవరైతే శీర్షాసనం వేయలేరో దీన్ని సాధన చేస్తే దాని వల్ల కలిగే లాభాలన్నీ దీని వల్ల కలుగుతాయి.
- సమన్వయం: ఎస్.సత్యబాబు, సాక్షి ప్రతినిధి