గజేంద్రుడి కాలు మొసలి నోట్లో ఉన్నది. దానిని విడిపించాలి. అందుకే వెంటనే బయల్దేరాడు. పైగా నువ్వు వచ్చేటప్పుడు నిన్ను నీవు మరిచిపోయి రావాలని కూడా శరణాగతిలో గజేంద్రుడు కోరాడు.
ఆలయానికి వెళ్లాలంటే శుచిగా, శుభ్రంగా ఉండాలి. మంత్ర పఠనం చేయాలంటే శౌచం ఉండాలి. కానీ, భగవన్నామం పలకడానికి శౌచంతో సంబంధం లేదు. భగవంతుడిని పేరుపెట్టి పిలిచినా పిలవకపోయినా, గుణగణాదులతో కీర్తించకపోయినా, ఆర్తితో రక్షణ కలగాలన్న భావన పరబ్రహ్మాన్ని ఉద్దేశించి చేస్తే రక్షణ వహించడానికి వచ్చేది సాక్షాత్తూ విష్ణుస్వరూపమే. ఈ పరమ రహస్యాన్ని పోతన భాగవతంలో వెల్లడిస్తాడు. గజేంద్రుడు ఆపదలో చిక్కుకున్నప్పుడు ఎవర్నీ పేరుపెట్టి పిలవలేదు, ఫలానా వారొచ్చి నన్ను రక్షించాలని అడగలేదు. ఏగుణం కానీ, ఏ రూపం కానీ చెప్పలేదు. నాకు రక్షణ కావాలని పిలిచాడు.
‘ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడు అనాదిమధ్యలయుడెవ్వడు సర్వము తానెయైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్’ అన్నాడు. 33 కోట్లమంది దేవతలు లేచి నిలబడ్డారు, ఎవరు వెళ్లాలో బోధపడక.
‘ఇది నాకు వర్తించదు’ అంటే ‘నాకు వర్తించదు’ అని కూర్చున్నారు. కానీ రక్షణ అంటే విష్ణువే రావాలి. అక్కడ గజేంద్రుడి కాలు మొసలి నోట్లో ఉన్నది. దానిని వెంటనే విడిపించాలి. అందుకే వెంటనే బయల్దేరాడు. పైగా నువ్వు వచ్చేటప్పుడు నిన్ను నీవు మరిచిపోయి రావాలని కూడా శరణాగతిలో గజేంద్రుడు కోరాడు. అందుకే ’సిరికిం చెప్పడు...’’ అంటూ ఎవరికీ చెప్పకుండా, ఒంటిమీద వస్త్రం సరిగా ఉందో లేదో కూడా చూసుకోకుండా తనను తాను మరిచిపోయి బయల్దేరి వచ్చాడు. కరి మకరులకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఇక్కడ తెలుసుకోవలసినదేమిటంటే, దేవుణ్ణి మనసులో తలచుకోవడానికి కానీ, ఆయన నామాన్ని స్మరించుకోవడానికి కానీ స్నానం చేయలేదనీ, శుచిగా లేమనీ, పరిసరాలు శుభ్రంగా లేవనీ ఆలోచించనక్కరలేదు. ఆర్తి, భక్తి వుంటే చాలు.
Comments
Please login to add a commentAdd a comment