హోమియో కౌన్సెలింగ్
నా వయసు 26. నాకు తరచు కడుపులోనొప్పి, ఉబ్బరం ఉంటుంది. వీటితోబాటు పులితేన్పులు, ఛాతీలో మంట, తలనొప్పి, కండరాల నొప్పి వంటి ఇతర సమస్యలతో కూడా బాధపడుతున్నాను. దయచేసి నా సమస్యలకు పరిష్కారం చెప్పగలరు.
-బి. ఈశ్వర ప్రసాద్, హైదరాబాద్
తరచు విరేచనాలు లేదంటే మలబద్ధకం, కడుపునొప్పి, కడుపుబ్బరం. మలవిసర్జనలో మార్పులు... అంటే నీళ్ల విరేచనాలు లేదా మలం లో చీము పడడం వంటి లక్షణాలుంటే దానిని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటారు. రక్తహీనత, కుటుంబ చరిత్రలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారిలోనూ, 50 సంవత్సరాలు పైబడిన వారు బరువు తగ్గడం, మలంలో రక్తం పడటం, కడుపునొప్పి, మలవిసర్జన తర్వాత కూడా మళ్లీ వెళ్లాలనిపించడం, వికారం, వాంతులు కావడం వంటి లక్షణాలు ఉన్నవారు సిగ్మాయిడో స్కోపీ, కొలనోస్కోపీ, సీటీస్కాన్, రక్తపరీక్షలు, లాక్లోజ్ ఇన్ టాలరెన్స్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించుకోవాలి.
కారణాలు: మానసిక ఒత్తిడి, గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల నూనె పదార్థాలు, మసాలాలు, కొవ్వు పదార్థాలు, కలుషిత నీరు, ఆహారం వంటివి ఐబీఎస్‌కు ప్రేరేపకాలు. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ మేలు చేసే బ్యాక్టీరియాకు హాని చేయడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
ఎవరిలో ఎక్కువ..? ఈ సమస్యను వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ గమనించవచ్చు. ముఖ్యంగా స్త్రీలలో, యుక్తవయస్సు ఉన్నవారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
జాగ్రత్తలు: వేళకు భోజనం చేయడం, సరిపడా నీరు తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి జాగ్రత్తల ద్వారా వ్యాధిని కొంతవరకు నయం చేయవచ్చు. గోధుమ పొట్టు, మొక్కజొన్న పొట్టు, తౌడు వంటి పదార్థాలు తీసుకుంటే ఈ లక్షణాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తీసుకోకపోవడం మంచిది.
హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ సిమిలిమం విధానంతో ఇబీఎస్‌కు గల మూలకారణాన్ని గుర్తించి, రోగి మానసిక, శారీరక, వ్యాధి లక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకుని చికిత్స ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా పేగుల్లోని క్రమరాహిత్యాన్ని సరి చేసి, మళ్లీ ఈ వ్యాధి తిరగబెట్టకుండా సంపూర్ణంగా నయం చేయొచ్చు.
జెనెటిక్ కౌన్సెలింగ్
మా కుటుంబంలో చాలామందికి క్యాన్సర్ వచ్చింది. మా అమ్మకూ, మా అక్కకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది. మా పిన్ని (మా అమ్మవాళ్ల చెల్లెలు) ఒవేరియన్‌తో బాధపడింది. నాకు కూడా క్యాన్సర్ వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. నాకు క్యాన్సర్ రిస్క్ ఉందేమో దయచేసి చెప్పండి.
- రమాదేవి, కొండాపూర్
దాదాపు 10 నుంచి 15 శాతం సందర్భాల్లో క్యాన్సర్ కుటుంబాల్లో కనిపిస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో పిల్లలకి క్యాన్సర్ కారక జన్యుమార్పులు సంక్రమించే అవకాశం 50 శాతం. 55 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, దగ్గర బంధువులకు (అక్కచెల్లెళ్లు) రొమ్ము లేక ఒవేరియన్ క్యాన్సర్ ఉండటం వంటివి క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్ కింద పరిగణించవచ్చు. అలాగే బీఆర్‌సీయే 1 లేదా బీఆర్‌సీయే 2 జన్యువులు మార్పునకు (మ్యూటేషన్‌కు) గురైనప్పుడు కూడా క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చేందుకు అవకాశం ఉంది. ఆ జన్యు మార్పులు రొమ్ము లేదా ఒవేరియన్ క్యాన్సర్‌ను కలగజేస్తాయి. కుటుంబంలో ఆ సమస్య వస్తుందా లేదా అని నిర్ధారణగా తెలియడానికి ఆ రెండు జన్యువుల అధ్యయనం చేయాలి. ఈ పరీక్ష కోసం దాదాపు రూ. 20,000 ఖర్చవుతాయి. ఒకసారి ఈ పరీక్షలో ఆ జన్యువులు క్యాన్సర్‌ను కలిగించేలా మ్యూటేషన్ గురయ్యాయని తెలుసుకుంటే... దాన్ని బట్టి ఆ కుటుంబ సభ్యులకు రిస్క్ ఉన్నదీ లేనిదీ చెప్పవచ్చు.
నా వయసు 34. నేను, నా భార్య ఇద్దరమూ దగ్గరి బంధువులం. మాది మేనరికపు వివాహం. మాకు ఒక కొడుకు పుట్టి, రెండేళ్ల వయసులో చనిపోయాడు. అతడి ఎదుగుదల కూడా తక్కువే. ఇప్పుడు మేం సంతానం కోసం ప్లాన్ చేసుకుంటున్నాం. మాకు ఎలాంటి లోపం కలగకుండా పిల్లలు పుట్టడానికి ఏం చేయాలో చెప్పండి.
- జీవన్, రైల్వేకోడూరు
దంపతులిద్దరూ దగ్గరి సంబంధం ఉన్నవారైతే పిల్లలకు జన్యుపరమైన లోపాలు, పుట్టుకతోనే వచ్చే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. సాధారణంగా దూరపు సంబంధాలు చేసుకున్నప్పుడు దంపతుల్లో ఒకే అంశానికి ఒకరి జన్యువుల్లో లోపాలు ఉన్నా మరొకరి ఆరోగ్యకరమైన జన్యువులు దాన్ని భర్తీ చేస్తాయి. కానీ దగ్గరి సంబంధాలు ఉన్న వారు పెళ్లి చేసుకున్నప్పుడు, ఇద్దరి జన్యువుల్లోనూ లోపాలు ఉండటం వల్ల అది పిల్లల్లో జన్యుపరమైన లోపాలకు దారితీస్తుంది. ఫలితంగా పుట్టుకతో వచ్చే లోపాలు రావచ్చు. ఇక ఈ తరహా రిస్క్ ప్రతి సంతానంలోనూ 25 శాతం ఎక్కువే. ఇలాంటి లోపాలు గర్భస్థ శిశువులోనే కనుగొనడానికి అవసరమైన పరీక్షల కోసం ముందుగానే మెడికల్ జెనెటిసిస్ట్ లేదా జెనెటిక్ కన్సల్టెంట్‌ను సంప్రదించండి.
డర్మటాలజీ కౌన్సెలింగ్
నాకు గత నాలుగు నెలల నుంచి వేళ్ల చివర్లలో గోళ్ల వద్ద తెల్లటి మచ్చలు వస్తున్నాయి. మోచేతుల భాగంలో తెల్లటి ప్యాచ్‌లు ఏర్పడుతున్నాయి. ఇవి ఒళ్లంతా విస్తరిస్తాయేమోనని ఆందోళనగా ఉంది. సలహా చెప్పండి.
- ఉత్తమ్‌కుమార్, నాగోలు
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీకు విటిలిగో (బొల్లి) తొలి దశలో ఉన్నట్లు అనిపిస్తోంది. ముందుగా దీనికి కార్టికోస్టెరాయిడ్ క్రీమును రోజుకు రెండుసార్లు మచ్చలపై ఒక నెల రోజుల పాటు రాయాలి. ఆ తర్వాత మరో నెల పాటు ట్యాక్రోలిమస్ 0.3% క్రీమ్‌ను మరో నెల పాటు రాయాలి. ఆ తర్వాత స్వాభావిక చర్మరంగు ఉన్న కణాలు ఆ ప్రాంతంలో పెరుగుతాయి. ఇలా రాస్తూ ఉన్న తర్వాత కొత్త మచ్చలు రాకుండా ఉండటం, ఉన్న మచ్చల సైజు పెరగకుండా ఉండటం జరిగితే... అప్పుడు విటిలిగో అదుపులో ఉన్నట్లుగా భావించాలి. అప్పుడు ఫొటో థెరపీ వంటి చికిత్సలతో తెల్లబారిన మచ్చల రంగును క్రమంగా మార్చుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఒకసారి విటిలిగో అదుపులో వచ్చాక స్ప్లిట్ స్కిన్ గ్రాఫ్టింగ్, పంచ్ గ్రాఫ్టింగ్ వంటి శస్త్రచికిత్స ప్రక్రియలూ అనుసరించవచ్చు. మీరు వెంటనే దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి.
నా వయసు 26 ఏళ్లు. నాకు విపరీతంగా జుట్టు రాలిపోతోంది. నా హెయిర్‌లైన్ వెనక్కుపోతోంది. మాడు మీద కూడా వెంట్రుకలు బాగా పలచబారిపోయాయి. ఇంత చిన్న వయసులోనే నాకు బట్టతల వచ్చేస్తున్నట్లు అనిపిస్తోంది. దయచేసి నా జుట్టు రాలిపోకుండా తగిన సలహా ఇవ్వండి.
- సురేశ్, విశాఖపట్నం
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు యాండ్రోజెనిక్ అలోపేషియా అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బహుశా మీకు ఇది వారసత్వంగా వస్తున్నట్లుగా అనిపిస్తోంది. దీని వల్ల మీకు బట్టతల రాబోతోందని అర్థమవుతోంది. బహుశా మీరు అలొపేషియాలోని మొదటి నుంచి మూడో దశలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. మీరు బయోటిన్‌తో పాటు.. సా పాల్‌మెట్టో, మినాక్సిడిల్ 5 శాతం ఉన్న లోషన్లను తలపై అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాలుగు, ఐదు దశల్లో పై మందులకు తోడుగా ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ వంటివి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇవేవీ పనిచేయకపోతే మీకు జుట్టు పుష్కలంగా ఉన్న ప్రాంతం నుంచి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియను అనుసరించడం ఒక ప్రత్యామ్నాయం. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి.
చిన్నవయసులోనే బట్టతల..?
Published Mon, Oct 12 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM
Advertisement
Advertisement