నా ప్రస్థానానికి నాంది ఆ ప్రశ్న... | Young Sahitya acadamy Award for chaithanya pingali | Sakshi
Sakshi News home page

నా ప్రస్థానానికి నాంది ఆ ప్రశ్న...

Published Thu, Sep 8 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

నా ప్రస్థానానికి నాంది ఆ ప్రశ్న...

నా ప్రస్థానానికి నాంది ఆ ప్రశ్న...

మొక్కకూ మహిళకూ ఒకటే సామ్యం. ఎదగడానికి మొక్కవోని పోరాటం తప్పదు. మొక్కయితే ఫలితం... చిగురు రెమ్మ, చిటారు కొమ్మ. మరి అది చైతన్యభరితమైన మహిళైతే?... ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ అనే పుస్తకం. ఆ చిటారుకొమ్మకు మిఠాయిపొట్లంలాగే... కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం. అవును... చైతన్య పింగళికీ, చిగిర్చే మొక్కకూ సామ్యం ఉంది.

నాకు ఊహ తెలిసే వరకు మా అమ్మ మీద కంప్లయింట్స్ ఉండేవి. మమ్మల్ని సరిగ్గా చూడట్లేదని.. పట్టించుకోవట్లేదని. కాని ఊహ తెలిశాక అమ్మ కష్టం అర్థమైంది. స్త్రీ చాలా ప్రత్యేకం అని తెలిసింది. మా అమ్మ కష్టం నా పర్‌సెప్షన్‌ని మార్చినట్టే నేనూ మా అమ్మ అభిప్రాయాన్ని మార్చానట. నాన్న చనిపోయినప్పుడు నేను రెండున్నరేళ్ల పిల్లని. ఒక తమ్ముడు, అప్పటికి అమ్మ ప్రెగ్నెంట్ కూడా! మూడో కాన్పులో అమ్మాయి పుట్టొద్దు.. అబ్బాయే పుట్టాలని కోరుకుందట అమ్మ. కాని ఇప్పుడంటుంది.. ‘అప్పుడు కూతురొద్దు.. కొడుకే కావాలనుకున్నాను.. కాని ఇప్పుడు నిన్ను చూస్తుంటే అనిపిస్తోంది కూతురే పుట్టుంటే బాగుండేది’ అని! అలా మా ఇబ్బందులు మా ఇద్దరి దృక్పథాల్ని మార్చాయి!

నడిరోడ్డుపై నాన్న హత్య... నడి వీధిలో అమ్మతో మేము
నాన్న (దశరథరామయ్య) ‘ఎన్‌కౌంటర్’ పత్రిక ఎడిటర్. అమ్మ (సుశీల) నాన్న చనిపోయేప్పటి వరకు గృహిణే. అమ్మా నాన్నలది కులాంతర వివాహం. అమ్మ ఇంటర్‌లో ఉన్నప్పుడే పెళ్లయింది. ఆ పెళ్లి కూడా హిందూ సంప్రదాయం ప్రకారం కాదు. తాళి వంటివి ఏమీ లేకుండా దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. వాళ్లను ఇద్దరివైపు పెద్దలు వాళ్లను యాక్సెప్ట్ చేయలేదు. నాన్నను నడి రోడ్డు మీద హత్య చేసినప్పుడు అమ్మమ్మ వాళ్లు, నానమ్మ వాళ్లు ఎవరూ చేరదీయలేదు. విజయవాడలోని అయోధ్యనగర్‌లోఉన్న డంప్‌యార్డ్ పక్కన గుడిసె వేసుకొని అందులో ఉన్నాం. మమ్మల్ని పెంచడానికి అమ్మ చాలా ఇబ్బందులు పడ్డది. మెడికల్ కవర్స్ చేసేది, ట్యూషన్లు చెప్పేది. ఓ వైపు మమ్మల్ని చదివిస్తూనే ఆగిపోయిన తన చదువునూ కంటిన్యూ చేసింది. నేను ఆరోతరగతిలో ఉన్నప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంది. అలా గట్టెక్కాం. అయినా తను చదువు ఆపేయలేదు. డిగ్రీ,  పీజీ  చేసింది.

తెలంగాణ చరిత్ర... మమ్మల్ని చిట్టగాంగ్ పంపింది!
మమ్మల్ని పెంచడం కోసం అమ్మ  పడ్డ కష్టం నుంచి ఈ వనితల పోరాటాల వరకు నన్ను ఆ స్ఫూర్తిదాయకమైన జీవితాలు వెంటాడాయి. అమ్మాయిలు ఇలా ఎలా ఫైట్ చేయగలరు? వాళ్ల పోరాటాలు ఎంత మందికి ఇన్‌స్పిరేషన్ అవుతాయి! ఎక్కడా రికార్డ్ కాలేదు. పీసీ జోషి భార్య కాబట్టి కల్పనాదత్ గురించి కొంత సమాచారం ఉంది. బెంగాల్‌లో అలాంటి వాళ్లెందరో ఉన్నారు. ఎవరికీ తెలియకుండా! ఆ చరిత్ర తప్పకుండా రాయాలి అని నిశ్చయానికి వచ్చేశాను. అంతకుముందే చదివిన తెలంగాణ ఉద్యమ స్త్రీల పుస్తకం ‘మనకు తెలియని మన చరిత్ర’ చిట్టగాంగ్ మహిళల గురించి రాసేలా ఉసి గొల్పింది. నిజానికి అదే స్ఫూర్తి అని చెప్పొచ్చు. వీటన్నిటి ప్రోద్బలంతో  ప్రయత్నం మొదలుపెట్టా. అలా నా సహచరుడి (తిలక్) సహాయంతో చిట్టగాంగ్  ప్రయాణం మొదలైంది. అప్పటికి నేను ప్రెగ్నెంట్‌ని.

కామెంట్స్ భరించలేక... తమ్ముళ్లకు అమ్మే జుట్టు కట్ చేసేది
సింగిల్ పేరెంట్ ఎన్నిటిని ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థమైంది. నాన్న చనిపోయేటప్పటికి ఆయనకే 29 ఏళ్లు. అంటే అమ్మదీ చిన్న వయసే కదా!  తమ్ముళ్లకు క్రాఫ్ చేయించడానికి కటింగ్ సెలూన్‌కి తీసుకెళ్లి తను బయట నిలబడేది. అక్కడున్న మగవాళ్లు కామెంట్స్ చేసేవారు. చివరకు అవి భరించలేక తనే ఇంట్లోనే తమ్ముళ్లకు జుట్టు కట్ చేసేది. ఇలాంటివింకెన్నిటినో భరించింది. నిలబడింది. మమ్మల్ని నిలబెట్టింది.  ఆమె ఈ స్ట్రగుల్‌ని దగ్గర్నుంచి చూశాక కానీ అర్థంకాలేదు విమెన్ ఎంత స్పెషలో అని! 

నన్ను వెంటాడిన ప్రశ్న... ‘ఒకవేళ మీ నాన్న బతికే ఉంటే?’
మొదటినుంచీ నాకు పుస్తకాలు చదవడం బాగా అలవాటు.  ఆ చదవడం వల్ల ఏదో ఒకటి రాయడమూ అలవాటైంది. అయితే అవంత సీరియస్‌గా ఉండేవి కావు. డిగ్రీకి వచ్చాకే కంపల్సరీగా రాయాల్సిన విషయాలున్నాయి అని అనిపించి రాయడం మీద దృష్టిపెట్టాను. నాన్న నాస్తికుడు. తను చనిపోతే మతాచారం ప్రకారం అంత్యక్రియలు చేయొద్దని చెప్తుండేవారు. అందుకే తన డెడ్‌బాడీని విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజ్‌కి ఇచ్చేశాం. నేను ఎయిత్‌క్లాస్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకరు నాతో..‘మీ నాన్న చనిపోయాడని ఆయన బాడీని మెడికల్ కాలేజ్‌కి ఇచ్చేశారు. ఒకవేళ బతికుంటే..’ అన్నాడు. ఆ అనుమానం, ఆ ప్రశ్న నన్ను వెంటాడుతుండేదెప్పుడూ. ఆ క్రమంలోనే ఎప్పుడో చిట్టగాంగ్ పోరాటానికి సంబంధించిన కల్పనాదత్ కథ చదివా! ఆమె తన భర్త కోసం ఎదురుచూడడం.. చిన్నప్పుడు నా ఫ్రెండ్ నాన్న గురించి అన్న మాటలను మళ్లీ గుర్తు చేశాయి. మనసును తట్టాయి. కల్పనాదత్‌తో పాటు ప్రీతిలత కథ.. ఇలా ప్రతి ఒక్క స్త్రీ తపన నన్ను కదిలించింది.

నాన్న వాచీ తమ్ముడికి... ‘మహాప్రస్థానం’ నాకు!
నాన్న దగ్గర శ్రీశ్రీ సొంత దస్తూరీతో ఉన్న ‘మహాప్రస్థానం’ పుస్తకం ఉండేది. నాన్నకు ఓ వాచీ ఉండేది. ఈ రెండూ ఆయన దగ్గర ఎప్పటికీ ఉండే వి. నేను టెన్త్ పాసయ్యాక అమ్మ నాకు నాన్న చదివే శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని, తమ్ముడికి వాచీని ఇచ్చింది. నాకు పుస్తకం ఎందుకు ఇచ్చావ్ వాచీ ఇవ్వకుండా అని చాలా పోట్లాడాను.‘నీకు పుస్తకాలంటే ఇష్టం కదా అని ఇచ్చాను’ అని అమ్మ చెప్పినా చాలా రోజులు సమాధాన పడలేదు. కాని ఇప్పుడు అనిపిస్తుంది అమ్మ చాయిస్ కరెక్ట్ అని. తమ్ముడితో అన్నాను కూడా ‘నీ వాచీ ఎప్పుడో పాడైంది.. నా దగ్గరున్న మహాప్రస్థానం ఇప్పటికీ నన్ను నడిపిస్తోంది’అని. నాన్నతో ఊరికే అనేదట అమ్మ.. మనకో అమ్మాయి ఉంది.. డబ్బులు కాస్త జాగ్రత్త చేయండి అని. ‘దాయాల్సిన అవసరం లేదు. దానికి కాళ్లు, చేతులు ఉన్నాయి.. పని చేసుకొని బతుకుంది’ అనేవారట నాన్న. నిజమే అనిపించింది. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వరు. ఆశలు, ఆశయాలు ఇస్తారు. నేనూ నా పిల్లాడి విషయంలో ఆ విలువనే పాటిస్తున్నాను.

రెండు వాక్యాలను పట్టుకుని.. వివరాలు సేకరించా!
చిట్టగాంగ్ పోరాటం చేసిన మహిళలకు సంబంధించి ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవు. మా ప్రయాణంలో దొరికిన ఏ చిన్న ఆధారాన్ని వదిలిపెట్టకుండా ఆ ఊతంతోనే సమాచారాన్ని సేకరిస్తూ, ఇంటర్వ్యూలు చేస్తూ ముందుకెళ్లా. సుహాసిని గంగూలి గురించి అయితే ఎక్కడో రెండు వాక్యాలు రాసి ఉంది కవితగా! ఆ రెండు వాక్యాలను పట్టుకొనే ఆమె గురించి వివరాలు సేకరించా. అయితే  చిట్టగాంగ్ వనితలకు సంబంధించి పుస్తకంగా వేద్దామనే ఆలోచన ముందు లేదు. సాక్షికే ఆర్టికల్స్‌గా ఇద్దామనుకున్నా. కాని అప్పుడే నిర్భయ ఇన్సిడెంట్  జరిగింది. ‘ఆ పోరాట గాథలు పుస్తకంగా తప్పకుండా రావాల్సిన సమయం, సందర్భం ఇదే! ఆలస్యం చేయొద్దు’ అని నా స్నేహితులు, నా పార్టనర్ (తిలక్) అందరూ అన్నారు. అప్పటికే డెరైక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను.

తను మాకు మంచి ఫ్రెండ్. ఆయన కూడా చిట్టగాంగ్ వనితల గురించి బుక్‌గా వస్తే బాగుంటుందని చాలా ఎంకరేజ్ చేశారు. నిజానికి వాళ్ల గురించి రాసేటప్పుడు చాలా సవాళ్లే ఎదుర్కొన్నా. ఆ చాలెంజెస్ అన్నీ నాలో పట్టుదలను పెంచాయి. ఒకానొక దశలో ఇది రాయకుండా ఆగిపోతే.. ఏమన్నా అయిపోతానేమోనని భయమేసింది. ఓ దీక్ష పట్టినదానిలాగే ఈ వర్క్ పూర్తిచేశాను. రాయడానికి రెండేళ్లు పట్టింది. ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయినప్పుడు మొదలుపెడితే బాబు పుట్టి వాడికి యేడాదిన్నర వచ్చాక పూర్తయింది. చిట్టగాంగ్ మహిళలకు కుదిరాంబోస్ స్ఫూర్తి. నా కొడుక్కీ ఆయన పేరే పెట్టాను ‘ఖుదిరాంబోస్’ అని! అలా వచ్చింది ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ పుస్తకం!

ఒక రకంగా హ్యాపీ... ఇంకో రకంగా బాధ
నేను రచయిత కన్నా ముందు జర్నలిస్ట్‌ని. యాక్టివిస్ట్‌ని. సంవత్సరాలు సంవత్సరాలు ధర్నాచౌక్‌లో ఉన్నా. రోడ్ల మీద కూర్చున్నా. ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి చిట్టగాంగ్ కథలు రాసినప్పుడూ పట్టించుకోలేదు. ‘మనసులో వెన్నెల’కథల పుస్తకాలతో గుర్తించారు. రచయిత్రిగానే ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. ఇది ఒక రకంగా హ్యాపీ.. ఇంకోరకంగా బాధ! జర్నలిజం నుంచి సినిమా రంగంలోకి 2006లోనే వెళ్లా. శేఖర్‌కమ్ముల సినిమాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేస్తున్నా.

విమెన్‌కు ప్రెషర్స్ ఉంటాయి. అయినా వెనకడుగు వేయకూడదు. ఒక అమ్మాయి విజయం పది మంది అమ్మాయిలకు స్ఫూర్తి. అది వ్యక్తిగత విజయమే అయినా పది మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే ఎక్స్‌పరిమెంట్ చేసే ధైర్యం ఉండాలి. ఏ విషయంలోనైనా సరే! సొసైటీ చెప్పేదాన్ని గుడ్డిగా ఫాలోకాకుండా రీజనింగ్ వెదుక్కోవాలి. క్వశ్చన్ చేసుకోవాలి. తలవంచుకొని వెళ్లిపోతే తమకు తాము న్యాయం చేసుకోలేరు. ఇతరులకు న్యాయం చేయలేరు. ధైర్యంగా తలెత్తి ఎదురీదితేనే నిలబడగలరు.. స్ఫూర్తినివ్వగలరు.
- సంభాషణ : సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement