ఈ వారం youtube హిట్స్
10 క్లోవర్‌ఫీల్డ్ లేన్ : థ్రిల్లర్
నిడివి : 2 ని. 43 సె.
హిట్స్ : 45,01,742
పిక్చర్ విడుదల కావడానికి ఏడాది సమయం ఉండగానే రిలీజ్ అయిన ‘ట్రైలర్’ ఇది. చిత్రం పేరు ‘10 క్లోవర్‌ఫీల్డ్ లేన్’. ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. తనకు తెలియకుండా ఎలాగో ఓ అండర్‌గ్రౌండ్ సెల్లార్‌లోకి వచ్చి పడుతుంది. అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఆ క్రమంలో జరిగే ఉత్కంఠభరితమైన ఘటనలను, సన్నివేశాలను ట్రైలర్‌లో శాంపిల్‌గా చూడొచ్చు. 2008లో వచ్చిన మాన్‌స్టర్ హారర్ ఫిల్మ్ ‘క్లోవర్‌ఫీల్డ్’తో ఈ సినిమాకు ‘రక్త సంబంధం’ అందని నిర్మాత జె.జె.అబ్రామ్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
కెన్ సెలబ్స్ పాస్? స్పెల్లింగ్ టెస్ట్
నిడివి : 2 ని. 11 సె.
హిట్స్ : 8,51,807
‘బజ్‌ఫీడ్’ అనేది అమెరికన్ ఇంటర్నెట్ మీడియా కంపెనీ. సామాజిక పరిణామాలను, వినోదాన్ని మేళవించి కొత్త కొత్త కార్యక్రమాలను రూపొందిస్తుంటుంది. లేటెస్టుగా బజ్‌ఫీడ్ అప్‌లోడ్ చేసిన వీడియో.. ‘కెన్ సెలబ్స్ పాస్ ఎ ఫిఫ్త్ గ్రేడ్ స్పెల్లింగ్ టెస్ట్?’. ఇదేంటో ఇప్పటికే మీకు అర్థమైయుంటుంది. ప్రముఖులకు ఇంగ్లీషు పదాల స్పెల్లింగులపై ఎంత పట్టు ఉందో తెలుసుకునేందుకు బజ్‌ఫీడ్ చేసిన ప్రయత్నం ఇది. ఒక ఆటలా సాగిన ఈ వీడియోలో స్పెల్లింగ్ కరెక్టుగా చెప్పిన, చెప్పలేకపోయిన ప్రముఖుల హావభావాలు, ఉద్వేగాలు సరదాగా ఉన్నాయి.
లైఫ్‌హ్యాక్ : కిడ్స్ బూట్స్
నిడివి : 15 సె.
హిట్స్ : 1,55,856
‘లైఫ్‌హ్యాక్’ అంటే జీవన నైపుణ్యం. రోజువారీ పనులను కష్టపడకుండా అవలీలగా, ఒడుపుగా చేయగల టెక్నిక్. ఈ వీడియోలో ఒక తండ్రి తన చిన్న కూతురు తొడుక్కుని ఉన్న బూట్లను ఇంట్లోకి రాగానే ఎంత తేలిగ్గా, ఫన్నీగా తొలగించాడో చూడవచ్చు. ‘మంచు కురిసే రుతువులో కాలి బూట్లను తియ్యడం ఎంతో కష్టం. అయితే నేను నా కూతురి బూట్లను కనీసం నా చేతులు కూడా ఉపయోగించకుండా తీసి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాను చూడండి’ అంటూ చిన్న లైఫ్‌హ్యాక్‌తో ఆ తండ్రి మనల్ని ఆశ్చర్యపరుస్తాడు గిలిగింతలు పెడతాడు. మీరూ తప్పక చూడండి.