కస్సున దిగబడుతుంది
టూంబ్ రైడర్: ట్రైలర్
నిడివి : 2 ని. 9 సె.
హిట్స్ : 90,66,303
లారా క్రాఫ్ట్.. బాణం లాంటి అమ్మాయి. వయలెంట్ అండ్ ఫ్రైటెనింగ్! చెవిని కట్ చెయ్యకుండా చెవి పక్కనుంచి దూసుకుపోతుంది. శత్రువును హద్దుల్లో ఉంచడానికి మొదట అంతవరకే చేస్తుంది. ఎవడైనా హద్దుమీరాడా.. చెవి కాదు, కస్సున గుండెల్లో దిగబడుతుంది. వాళ్ల నాన్న నుంచి వచ్చిన సాహస గుణం అది! అతడొక సాహస అన్వేషకుడు. ఓ దీవిలో అదృశ్యం అయిపోతాడు. ఇక ఈ అమ్మాయి బయల్దేరుతుంది. ప్రాణాలకు తెగించి విలన్‌లతో పోరాడుతుంది. అగాధాలలో, భూగర్భ జలాలలో లారా సాహసాలు ఊపిరి తీసుకోనివ్వని విధంగా ఉన్నాయి ఈ ట్రైలర్‌లో. కూలిపోయే వంతెన పైనుంచి ప్రవాహంలో పడిపోకుండా చివరి నిముషంలో లారా తప్పించుకోవడంతో ట్రైలర్ ముగుస్తుంది. ‘టూంబ్ రైడర్’ అనే పేరుతో 2013లో విడుదలైన వీడియో గేమ్ ఆధారంగా ఎం.జి.ఎం., వార్నర్ బ్రదర్స్, ఇంకో రెండు నిర్మాణ సంస్థలు కలిసి ఈ సినిమాను అదే పేరుతో తీసున్నాయి. లారా క్రాఫ్ట్ పాత్రను 22 ఏళ్ల స్వీడన్ నటి అలీషియా వికందర్ పోషిస్తున్నారు. టూంబ్ రైడర్ అంటే సమాధుల్ని పెకిలించి విలువైన వస్తువుల్ని దొంగిలించే వ్యక్తి. ఇంకో అర్థంలో.. గుప్తంగా ఉండిపోయిన నిజాలను వెలికి తియ్యడం కూడా టూంబ్ రైడింగే. తండ్రి కోసం లారా ఏం తవ్వబోయి, ఎందులో పడిపోయారో 2018 మార్చి 16న తెలుస్తుంది. టూంబ్ రైడర్ రిలీజ్ అవుతున్న రోజు అది.
తిమింగిలం మింగేస్తే?
వాట్ ఇఫ్ ది వేల్ స్వాలోడ్ యు ఎలైవ్
నిడివి : 1 ని. 41 సె.
హిట్స్ : 33,75,517
బ్లూవేల్ గేమ్ కొంతకాలంగా టీనేజర్‌లను పొట్టన పెట్టుకుంటోంది. పిల్లల్నేనా, పెద్దల్ని కూడానా? గేమ్ వరకు అయితే పిల్లల్నే. నీటిలోని వేల్స్ (తిమింగలాలు) మాత్రం పిల్లల్నీ, పెద్దల్నీ అందర్నీ పొట్టన పెట్టుకోగలవు. అయితే అన్ని రకాల తిమింగలాల కడుపులోకీ మనం సర్రుమని వెళ్లిపోమట! కారణం? వాటికి మింగడం ప్రాబ్లం. తిమింగలం నోరు తెరిస్తే పెద్ద పెద్ద పడవలే పట్టేస్తాయని అనుకుంటాం కానీ, వాటి ప్రయాణం నోటి వరకే. అక్కడి నుంచి గొంతు దిగవు. ఒక్క వీర్యతిమింగలం (స్పెర్మ్ వేల్) మినహా, మిగతా అన్ని జాతుల తిమింగలాలకూ అన్నవాహిక సన్నగా ఉంటుంది. ఉదాహరణకు నీలి తిమింగలం (బ్లూ వేల్) అన్నవాహిక పది సెంటీ మీటర్ల వ్యాసం ఉంటుంది. అందులో శిశువు తల కూడా పట్టదు. మరి దంతాల మాటేమిటి? చాలా తిమింగలాలకు దంతాల స్థానంలో మెత్తటి కుచ్చుల లాంటివి ఉంటాయి. వాటితో అవి సముద్రపు ఆహారాన్ని ఫిల్టర్ చేసుకుని కడుపులోకి సులభంగా జారిపోయే జీవుల్ని మాత్రమే లోపలికి తీసుకుంటాయి. తిమింగలం ఒక్క గుక్కతో బక్కెట్‌ల కొద్దీ నీటిని నోటì లోకి తీసుకుంటుంది. ఆ సమయంలో నీటితో పాటు నోట్లోకి పెద్ద పరిమాణంలోని జీవులు కూడా వచ్చేస్తాయి. వాటిని తన ఫిల్టర్ వంటి దంతాలతో తిరిగి బయటికి తోసేస్తాయి తిమింగలాలు. స్పెర్మ్ వేల్‌కు మాత్రం మనిషిని మింగేయగల దేహనిర్మాణం ఉంటుంది. అందుకే అవి పెద్ద పెద్ద సీల్ జంతువుల్ని అవలీలగా మింగేస్తుంటాయి. అప్పుడేం జరుగుతుంది? స్పెర్మ్ వేల్ దంతాలు సీల్‌ను నజ్జునజ్జు చేసేస్తాయి. తర్వాత కడుపులోకి జారవిడుచుకుంటాయి. ఆ తర్వాత సీల్ జీర్ణమైపోతుంది. సరిగ్గా మనిషికి కూడా ఇదే జరుగుతుంది. ‘వాట్ ఇఫ్ ది వేల్ స్వాలోడ్ యు ఎలైవ్’ అనే వీడియోలో స్పెర్మ్ వేల్ మనిషిని మింగేస్తే ఏమౌతుందో యానిమేషన్‌లో చూపించారు.
రోడ్డుప్రమాద దృశ్యం
రుఖ్ : ట్రైలర్
నిడివి: 2 ని. 29 సె.
హిట్స్: 18,25,946
‘రుఖ్’ ట్రైలర్‌లో ఒక కుటుంబం కల్లోలంలో పడిపోవడం కనిపిస్తుంది. చిన్న కుటుంబమే. కానీ పెద్ద తుఫాను. తండ్రి కారు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటున్న అతడి కొడుకు జీవితం తలకిందులు అయిపోతుంది. తండ్రి గురించి ఏవో వింటాడు. యాక్సిడెంట్ కాదు, అది హత్య అని నమ్ముతాడు. నిజం చెప్పమని తల్లిని అడుగుతాడు. ఆమె చెప్పదు. ఏదో దాస్తున్నట్లు ఆ 18 ఏళ్ల కుర్రాడికి అర్థమౌతుంది. ఇక తనే తేల్చుకోడానికి బయల్దేరతాడు. తండ్రి ఔన్నత్యాన్ని వెల్లడించే కోణాలు ఒకటొకటిగా బయటపడతాయి! వాటిని తండ్రి ఉన్నప్పటి జ్ఞాపకాలతో పోల్చి చూసుకుంటాడు. ఆఖరికి తల్లి మనసు కూడా తెలుసుకుంటాడు. ఇది ఒక టీనేజర్ కథ. ఈ పాత్రలో ఆదర్శ గౌరవ్, అతడి తండ్రిగా మనోజ్ వాజ్‌పేయీ నటిస్తున్నారు. ‘దృశ్యం ఫిల్మ్’ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 27న విడుదల అవుతోంది. జీవితం రెండుగా విడదీసినా, విషాదం ఒకటిగా కలుపుతుందన్నది ఎండ్ పాయింట్. ఈ చిత్రం అక్టోబర్ 27న విడుదల అవుతోంది.
వాట్ హ్యాపెండ్?
హిల్లరీ క్లింటన్: నోబడీ ఈజ్ టాకింగ్
నిడివి : 4 ని. 31 సె.
హిట్స్ : 8,63,662
హిల్లరీ క్లింటన్ కొత్తగా ‘వాట్ హ్యాపెండ్’ అనే పుస్తకం రాశారు. అందులో ఆమె.. రష్యన్లు 2016 అమెరికా ఎన్నికలను ప్రభావితం చేశారని రాశారు. ప్రభావితం చేసి? ట్రంప్‌ని గెలిపించారు. ‘స్టీఫెన్ కాల్బెర్ట్ లేట్ నైట్ షో’కి హిల్లరీ అతిథిగా వచ్చినప్పుడు స్టీఫెన్ ‘వాట్ హ్యాపెండ్ టు అమెరికన్ ఎలక్షన్ మెకానిజం’ అని ఆమె అడిగారు. రష్యా ఇన్‌ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన అమెరికా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతుందా అని స్టీఫెన్ ఆశ్చర్యం. ఆ మాటలకు హిల్లరీ నవ్వారు. ‘‘ఆ ఒక్క వ్యక్తి తప్ప మిగతా అమెరికన్‌లంతా అమెరికాలో ఎలక్షన్ మెకానిజం లేకుండా పోయిందని నమ్ముతున్నారు’’ అన్నారు. ‘‘కానీ అక్రమాలను బయటపెట్టే యంత్రాంగం ఉంది. అందుకే నిజాలు బయటికి వచ్చాయి’’అని కూడా ఆమె అన్నారు. గెస్టు, హోస్టు కొద్దిసేపు ‘వాట్ హ్యాపెండ్’ అనే టాపిక్‌ని పట్టుకుని ట్రంప్‌పై సెటైర్‌లు వేశారు. షోకు వచ్చినవాళ్ల నవ్వులు, చప్పట్లు హిల్లరీకి మంచి ఎనర్జీ. ‘‘ఈ పుస్తకం రాసేటప్పుడు మీరు షార్డనీ (వైట్ వైన్) మీద ఎక్కువగా ఆధారపడినట్లు అనిపిస్తోంది అని స్టీఫెన్ అన్నప్పుడు హిల్లరీ చాలా హాయిగా నవ్వారు. ఆ తర్వాతి ట్విస్ట్ ఏమిటన్నది మీరు వీడియోలో చూడాల్సిందే. చెబితే కిక్కు పోతుంది. అంతకన్నా చివరికి.. స్టీఫెన్ ఓ ఆకాంక్షతో షోను ముగించారు. ఏమిటా ఆకాంక్ష? అది కూడా వీడియోలోనే చూడండి.