
సివిల్‌వార్ చిరుత పులి
బ్లాక్ పాంథర్ : ట్రైలర్
నిడివి : 2 ని. 18 సె.
హిట్స్ : 82,47,114
బ్లాక్ పాంథర్ పేరుతో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఇది మూడోది. అయితే దీనికీ, ఆ రెండింటికీ సంబంధం లేదు. మొదటి ‘బ్లాక్ పాంథర్’ జర్మన్ సైలెంట్ మూవీ. దాదాపు వందేళ్ల క్రితం వచ్చింది 1921లో. రెండో ‘బ్లాక్ పాంథర్’ బ్రిటిష్ క్రైమ్ ఫిల్మ్. నలభై ఏళ్ల క్రితం వచ్చింది 1977లో. ఇప్పుడీ మూడో బ్లాక్ పాంథర్ 2018 ఫిబ్రవరిలో విడుదల అవుతోంది.మార్వెల్ కామిక్స్‌లోంచి బ్లాక్ పాంథర్ అనే క్యారెక్టర్ ఆధారంగా అదే పేరుతో తయారౌతున్న ఈ హాలీవుడ్ సూపర్ హీరో ఫిల్మ్.. గత ఏడాది విడుదలైన ‘కేప్టెన్ అమెరికా : సివిల్ వార్’ చిత్రం ఎక్కడైతే ముగుస్తుందో, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది.
అలాగని ఆ సినిమాను చూడందే ఈ సినిమా అర్థం అవదనే వర్రీ ఏం అవసరం లేదు. దేనికదే వేర్వేరుగా ఒక కంప్లీట్ పిక్చర్. ట్రైలర్‌లో చురుకైన నల్ల చిరుతలా కనిపించే నలభై ఏళ్ల వ్యక్తే బ్లాక్ పాంథర్. హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్‌మాన్ ఈ పాత్రను పోషిస్తున్నారు. మూవీలో బ్లాక్ పాంథర్‌కే ఇంకో పేరు టి–చార్లీ. అంతర్యుద్ధంలో స్థాన బలిమిని కోల్పోయి, తిరిగి తన రాజ్యానికి చేరుకున్న టి–చార్లీకి రాజ్యంలోని ఇద్దరు వ్యక్తులు తిరుగుబాటుతో రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే కుట్రపన్నారని తెలుస్తుంది.
దాంతో టీ–చార్లీ.. బ్లాక్ పాంథర్ అవతారం ఎత్తుతాడు. తన ప్రత్యేక మహిళా దళం ‘డోరా మిలాజే’ సహాయంతో తన రాజ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రపంచ యుద్ధాన్ని కూడా నివారిస్తాడు. మార్వెల్ కామిక్ కథలు, కల్పిత ప్రదేశాల ఆధారంగా మార్వెల్ స్టూడియోస్ (వాల్ట్ డిస్నీ స్డూడియోల అనుబంధ సంస్థ) నిర్మిస్తున్న 18 వ చిత్రం ఈ బ్లాక్ పాంథర్. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ఏ లెవల్లో ఉండబోతున్నాయో ట్రైలర్‌లో చూడొచ్చు. ఇదొక కిల్లర్ ట్రైలర్. మీ చేత స్టెప్స్ వేయిస్తుంది. అది కూడా ఆఫ్రికన్ స్టెప్స్!
ఆడపిల్ల తండ్రి మరి!
ఐ లవ్ యు, డాడీ: ట్రైలర్
నిడివి : 2 ని. 06 సె.
హిట్స్ : 5,53,570
గ్లెన్ టోఫర్ టీవీ ప్రొడ్యూజర్. ఆయనకు 17 ఏళ్ల కూతురు ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. తెలివైన కళ్లు. పసిపిల్ల నవ్వు. ఎక్కడో చదువుతున్న ఆ పిల్ల సీనియర్ ఇయర్ కోర్సులో తండ్రితో పాటు ఉండడానికి ఆయన ఉండే అపార్ట్‌మెంట్‌కు వచ్చేస్తుంది. తల్లి ఉండదు. (గ్లెన్ నష్టాల్లో ఉన్నప్పుడు ఆమె విడాకులు ఇచ్చి వెళ్లిపోతుంది). గ్లెన్ ఎప్పుడూ బిజీగా ఉంటాడు. కూతురుతో మాట్లాడ్డానికి కూడా టైమ్ ఉండదు! గ్లెన్ ప్రొడ్యూజర్ కాబట్టి ఆ ఫీల్డులో ఉన్నవాళ్లు గ్లెన్ ఇంటికి వచ్చి వెళుతుంటారు.
ఓసారి గోడపై ఉన్న గ్లెన్ కూతురు ఫొటో చూసి, ఒక టీవీ నటి అడుగుతుంది.. ‘ఎవరు సార్.. ఈ అమ్మాయి. మీ గర్ల్ ఫ్రెండా?’’ అని. గ్లెన్ ఇబ్బందిగా నవ్వుతాడు. ‘తను నా కూతురు’ అని చెప్తాడు. ‘గార్జియస్’ అంటుంది ఆమె ఆ ఫోటోనే చూస్తూ. తర్వాత తండ్రీకూతుళ్లిద్దరూ ఓ హాలీవుడ్ ఫంక్షన్‌కి వెళతారు. అక్కడ గ్లెన్‌కు ఆరాధ్యుడైన 68 ఏళ్ల వయసున్న సినీ నిర్మాత లెస్లీ గుడ్‌విన్ కంట్లో గ్లెన్ కూతురు పడుతుంది.
గ్లెన్‌కు జీవితంలో ఒక్కసారైనా అపాయింట్‌మెంట్ ఇవ్వని వాడు గ్లెన్ కూతుర్ని తీర్చిదిద్దుతానని అంటాడు! టీనేజ్ పిల్లలతో రొమాన్స్ చేస్తుంటాడని లెస్లీకి పేరు. గ్లెన్ కూతురితోనూ అలానే చేయబోతే.. ‘తను మైనర్’ అంటాడు గ్లెన్. ‘అయితే ఏంటి?’ అంటాడు లెస్లీ. అంతే.. గ్లెన్‌లోని తండ్రి మేల్కొంటాడు. అంతకాలం పనిలో పడి కూతుర్ని పట్టించుకోని వాడు ఒక్కసారిగా ఆమె సంరక్షకుడిగా మారిపోతాడు.
గ్లెన్ కూతురి పేరు ‘చైనా’. ‘దానికేం తెలియదు, అదొక ఈస్ట్రోజన్ బొమ్మ’ అని ట్రైలర్‌లో ఓ చోట కూతురి గురించి అంటాడు గ్లెన్. స్త్రీగా మారుతున్న బాలిక విషయంలో పురుష ప్రపంచం కనబరిచే దూకుడును కట్టడి చెయ్యడానికి.. పాపం ఈ ఆడపిల్ల తండ్రి చేయని ప్రయత్నం ఉండదు. ఈ చిత్రాన్ని లూయీ సి.కె. డైరెక్ట్ చేశారు. గ్లెన్‌గా నటించింది కూడా ఆయనే. గత నెల 9న ‘టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో స్క్రీన్ అయిన ‘ఐ లవ్ యు, డాడీ’ 35 ఎంఎం బ్లాక్ అండ్ వైట్ మూవీ!
పిడిగుద్దుల త్రిమూర్తులు
ది షీల్డ్ మేక్ దెయిర్ ఎంట్రెన్స్ టుగెదర్
నిడివి : 2 ని. 40 సె.
హిట్స్ : 40,41,464
‘యు.ఎస్.ఎ. నెట్‌వర్క్’ అని అమెరికాలో ఒక టీవీ చానల్ ఉంది. అందులో ప్రతి సోమవారం రాత్రి 8 గంటలకు (వాళ్ల టైమ్ ప్రకారం) ‘రా’ అనే ఆ ముందు రోజు ఆదివారం నాటి లైవ్ షూటింగ్ ప్రసారం అవుతుంది. ప్రొఫెషనల్ రెజ్లింగ్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ అది. గత సోమవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెజ్లింగ్ అభిమానులంతా ఇళ్లలో టీవీల ముందు కూర్చొని లైవ్‌లో ‘రా’ ని చూస్తున్నారు, ‘షో’ మధ్యలో అనూహ్యంగా ముగ్గురు వ్యక్తులు ‘షో’ ఎంట్రెన్స్ గేటు లోంచి లోపలికి వస్తూ కనిపించారు! వ్యూయర్స్ ముఖాల్లో ఒక్కసారిగా ఉత్తేజం.ఉత్సాహం.
లైవ్ షోలో ఉన్న ఆడియెన్స్ అయితే ఆ ముగ్గుర్నీ చూసిన ఆనందాన్ని తట్టుకోలేక.. ‘దిస్ ఈజ్ ఓస్సమ్.. దిస్ ఈజ్ ఓస్సమ్’ అని అరవడం మొదలు పెట్టారు. ఇంతకీ ఎవరు ఆ ముగ్గురు? డీన్ ఆంబ్రోస్ (31), రోమన్ రీన్ (32), సేత్ రోలిన్స్ (31). ముగ్గురూ అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్లు. ‘షీల్డ్’ అనే రెజ్లింగ్ బ్యాండ్ సభ్యులు. వీడియోలో మొదట ఆంబ్రోస్ ముక్కు చిట్లించుకుంటూ ముందు వస్తాడు. అతడి వెనుకే జులపాల బలుడు రోమన్ రీన్ కనిపిస్తాడు. కుడివైపున రోలిన్స్ తన పెదవులతో ముక్కుని పైకి నెట్టుకుంటూ లుక్ ఇస్తాడు.
‘షీల్డ్ బ్యాండ్ హీరోలు వస్తున్నారహో’ అని ఎరీనాలోంచి షో యాంకర్ అరిచి చెప్పగానే ఒకటే హోరు! ఇక ఈ ముగ్గురి హావభావాలను మీరు వీడియోలో చూడాల్సిందే. గమ్మత్తుగా ఉంటాయి. డబ్లు్య.డబ్లు్య.ఇ. (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌రైటన్‌మెంట్) సంస్థ ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది! ఏమిటి ఇందులోని స్పెషల్? ముగ్గురూ కలిసి కనిపించడమే! మూడేళ్ల క్రితం ఏవో గొడవలొచ్చి విడిపోయిన ఈ త్రిమూర్తులు మళ్లీ ఒకటై ప్రత్యక్షమవడంతో అభిమానుల కడుపు నిండిపోయింది.
బాల నేరస్థుడి హార్ట్‌బీట్
డ్రాకో ‘వాచ్ మీ డూ ఇట్’ (అఫీషియల్ వీడియో)
నిడివి : 4 ని. 5 సె.
హిట్స్ : 24, 843
పెద్దగా హిట్స్ ఏమీ లేని వీడియో ఈవారం యూట్యూబ్ హిట్స్‌లోకి ఎలా వస్తుంది?! కానీ డ్రాకో అనే 24 ఏళ్ల ఈ అట్లాంటా కుర్రవాడి జీవితంలో చాలా హిట్స్ ఉన్నాయి. హిట్స్ అంటే ఇక్కడ విజయాలు. దెబ్బలు! వాటిని తట్టుకుని పాప్ ర్యాపర్‌గా నిలబడి మ్యూజిక్ ప్రపంచంలోకి వచ్చాడు. బేబీగ్రాండ్ అనే కంపెనీ అతడిని చేరదీసింది.
తన చిన్న జీవితంలో డ్రాకో పదేళ్ల పాటు ‘ఆన్ అండ్ ఆఫ్’గా బాల నేరస్థుల కర్మాగారంలోనే గడిపాడు! ఏంటి అతడు చేసిన నేరం? డ్రగ్స్, ఆల్కహాల్, అబ్యూజ్.. వీటి మధ్య పుట్టి పెరిగిన పిల్లవాడు ఎలా తయారౌతాడో అలాగే తయారయ్యాడు డ్రాకో. మంచి తిండి కోసం, మంచి బట్ట కోసం దొంగతనాలు చేశాడు. అట్లాంటా వీధుల్లో వీడొక ఆకతాయి వెధవ. ప్రతిసారీ పోలీసులు పట్టుకుపోవడమే. ఓసారి మ్యూజిక్ వాడిని పట్టుకుంది. పాప్ మ్యూజిక్.
ఏ ఆర్టిస్టో పాడింది! దాన్ని వినగానే జీవితం మీద ప్రేమ కలిగింది. తనూ పాడాడు. ఫస్ట్ సింగిల్ ‘వాచ్ మీ డూ ఇట్’ ఆడియో ఆగస్టులో విడుదలైంది. అదే పేరుతో రెండు రోజుల క్రితం అది వీడియోగా వచ్చింది. బీట్ బాగుంది. థీమ్ అతడి జీవితానికి పూర్తి భిన్నమైనది. ఇందులో డ్రాకో పెద్ద హిప్‌హాప్ రాక్‌స్టార్. కనీసం బీట్ వినడానికైనా ఈ వీడియోను చూడండి. వరల్ట్‌స్టార్ హిప్ హాప్ కంపెనీ దీనిని అప్‌లోడ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment