![YouTube hits this week - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/6/faaa.jpg.webp?itok=ExBtZkNh)
అసలు చెప్పినట్లే ఉండదు నాకు
నిడివి - 3 ని. 41 సె.
హిట్స్ - 3,79,78,758
ట్వైస్ ‘లైకీ’: మ్యూజిక్ వీడియో
తొమ్మిది మంది అందమైన దక్షిణ కొరియా అమ్మాయిల పాప్ బ్యాండ్ ‘ట్వైస్’. ఫ్రెష్‌గా రిలీజ్ చేసిన ‘లైకీ’ మ్యూజిక్ వీడియో.. అబ్బాయిల్ని స్థిమితంగా నిలవనివ్వడం లేదు! ‘నీ ఆలోచనలతో నిద్రను కోల్పోడం కోసమే నా మనసు మేల్కొని సీతాకోక చిలుకలా రెక్కలు ఆడిస్తోంది’ అని అమ్మాయిలు డాన్స్ చేస్తూ కనిపిస్తే.. ‘హృదయం ఎక్కడున్నదీ’ అని సెర్చ్ చేసుకోవలసిందే.
ఏ అమ్మాౖయెనా.. ‘ఐ లైక్ యు అని చెప్పేస్తే.. అసలు చెప్పినట్లే ఉండదు నాకు. ఇంకో విధంగా నీ హృదయాన్ని తాకేట్టుగా చెప్పడం ఎలాగా అని ఆలోచిస్తున్నా..’ అంటూ తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తే బాయ్‌ఫ్రెండ్ బతికి బట్టకట్టగలడా?! ఈ బబ్లీ సాంగ్‌లో మొదట మీకు వీడియో కెమెరాతో కనిపించే అమ్మాయి జియో. ఈ గ్రూప్ ఫన్నీగా రెస్టారెంట్‌లలో, ఇరుకు వీధుల్లో అల్లరి చేస్తుంటే భలే చూడబుద్దేస్తుంది.
ఎడారిలో కన్నీటి అలలు
నిడివి - 2 ని. 43 సె.
హిట్స్ - 51,31,729
ట్వైస్ ‘లైకీ’: మ్యూజిక్ వీడియో
గాలిలో మార్పొస్తే మనిషి శరీరం దీపంలా కొట్టుకుంటుంది. ఆ గాలి ‘కద్వీ హవా’ (చెడు గాలి) అయితే జీవితాలు అల్లకల్లోలమే. ఉత్తరప్రదేశ్‌కి, మధ్యప్రదేశ్‌కి మధ్య బుందేల్‌ఖండ్ ఉంది. అక్కడి గాలి స్థిమితం లేనిది. ఒడిశాలో, చంబల్‌లోయ చుట్టూ, రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో వాతావరణం ఇలాగే ఉంటుంది. ఏడాది అంతా కరువు! మంచి గాలికి, మంచి నీటికి కరవు. ఉన్నచోట ఉన్నట్టుగానైనా నెట్టుకొద్దామంటే ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. ప్రతి ఇంట్లో ఒక కన్నీటి సముద్రం.
ఆ కన్నీటి కథల్లోంచి ‘కద్వీ హవా’ చిత్రాన్ని తీసింది ‘దృశ్యం ఫిల్మ్స్’. ఇది సోషల్ డ్రామా. నీల్ మాధబ్ పాండా డైరెక్ట్ చేశారు. సంజయ్ మిశ్రా, రణ్‌వీర్ శోరీ ముఖ్య నటులు. చిత్రంలో మిశ్రా అంధుడు. శోరీ సముద్ర ప్రాంతం నుంచి వచ్చి మిశ్రాతో పాటు ఎడారి ప్రదేశంలో ఉంటుంటాడు. ‘‘మీకు నీళ్లెక్కువ కదా. అదృష్టవంతులు’’ అంటాడు మిశ్రా! ‘‘అవును, ఎక్కువే’’ అంటాడు శోరీ విరక్తిగా.
బహుశా 1999 నాటి ఒడిశా జలప్రళయాన్ని అతడు గుర్తుచేసుకుని ఉండాలి. క్లయిమేట్ ఛేంజస్ భూగోళాన్ని ఎంత దుర్భరం చేయబోతున్నదీ ‘కద్వీ హవా’లో చూడొచ్చు. చిత్రం నవంబర్ 24న రిలీజ్ అవుతోంది. (జర్మనీలోని బాన్‌లో నేటి నుంచి ఈ నెల 17 వరకు యు.ఎన్. క్లైయిమేట్ మీట్ జరుగుతోంది).
మధువును గ్రోలకనే మత్తులోకి
నిడివి - 4 ని. 9 సె.
హిట్స్ - 46,71,551
సురూర్: పంజాబీ లవ్ సాంగ్
నేహా కక్కర్, బిలాల్ సయీద్ ఆలపించిన న్యూ పంజాబీ డ్యూయెట్ సాంగ్ యూట్యూబ్‌లో మంచి ట్రెండింగ్‌లో ఉంది. పాటకు సాహిత్యం, సంగీతం కూడా బిలాలే. 28 ఏళ్ల ఈ పాకిస్థానీ సింగర్‌కు, అతడి కన్నా ఒక్క ఏడాదే పెద్దదైన ఉత్తరాఖండ్ గాయని నేహా కక్కర్‌కూ గాత్రంలో చక్కగా జత కుదిరింది. ‘సాయం సమయం నీ కోసం సిద్ధమై ఉంది. వచ్చేయ్.. నీ కళ్లల్లో నాకు వెలుగు కనిపిస్తోంది.
మధువును గ్రోలకుండానే మత్తులోకి వెళ్లిపోతున్నాను’ అంటూ బిలాల్ మొదలు పెడతాడు. సేమ్.. ఆ మత్తులోకి వెళ్లడం అనే ఎక్స్‌ప్రెషన్‌తోనే నేహా కక్కర్ స్వరం కలుపుతుంది. ‘లోకంలోని ఈ దుఃఖంతో నా పట్టింపు లేకుండా నేను నీ ఆలోచనల్లో మునిగి తేలుతున్నాను’ అంటుంది. ప్రేమికులు ప్రపంచంతో ఎంత నిర్దయగా ఉన్నప్పటికీ పాపం వాళ్లను అర్థం చేసుకోవాలనిపిస్తుంది. ‘దేశీ మ్యూజిక్ ఫ్యాక్టరీ’ ఈ బ్లాక్ అండ్ వైట్ వీడియో సాంగ్‌ను అప్‌లోడ్ చేసింది.
తల్లిని వదిలిపోని బిడ్డ
నిడివి - 1 ని. 39 సె.
హిట్స్ - 7,82,871
బేబీ హార్స్ రెఫ్యూజెస్ టు లీవ్
తల్లి గుర్రానికి దెబ్బ తగిలింది. పిల్ల గుర్రం తల్లిని వదల్లేక చుట్టూ తిరిగింది. కఠిన హృదయుల్ని కూడా జంతు ప్రేమికుల్లా మార్చే ఈ దృశ్యాన్ని ‘డూడో’ అనే వెబ్‌సైట్ చిత్రీకరించింది. తల్లి గుర్రం పడుకుని లేస్తున్నప్పుడో, పరుగెత్తుతున్నప్పుడో ఎలాగో కాలి గిట్ట ఒకటి, దాని జుట్టులోకి చిక్కుకుపోయింది. దాంతో ఆ గుర్రం కిందపడి లేవలేకపోతోంది. తల్లి బాధను పిల్ల గుర్తించింది. తనేం చేయగలదు? దిక్కుతోచని స్థితిలో తల్లి చుట్టూ తిరుగుతూ ఉండిపోయింది.
కొంతసేపటికి అక్కడికి చేరుకున్న రెస్క్యూయర్ తల్లి గుర్రం గిట్టను దాని జుట్టు నుంచి విడిపించడానికి ప్రయత్నించాడు కానీ, కుదర్లేదు. దాంతో కత్తెరతో జుట్టును కత్తిరించాడు, గిట్ట బయటికి వచ్చేసింది. అయినా గుర్రం లేవలేకపోయింది. తన గిట్ట ఇంకా తన జుట్టులోనే ఉందన్న ఫీలింగ్. పిల్ల గుర్రం కూడా అలాగే అనుకున్నట్లుంది.. ‘అమ్మకి ఇంకా నయం కాలేదేమో’ అని! చివరికి తల్లి లేచాక, రెండూ కలిసి హ్యాపీగా ఇంటికి వెళ్లిపోయాయి!
రోడ్డు సైడు ఫుడ్డుకు స్టార్ స్టేటస్
నిడివి - 3 ని. 1 సె.
హిట్స్ - 4,86,097
మిషోలిన్–స్టార్‌డ్ మీల్
ప్రపంచంలో ఎక్కడైనా మిషోలిన్ స్టార్ ఉన్న రెస్టారెంట్ ఉందీ అంటే అది చాలా గ్రేట్ అని! ఫైన్ డైనింగ్, ఫుడ్ క్వాలిటీ ఉన్న వాటికే ఆ ‘స్టార్’ స్టేటస్ దక్కుతుంది. తేడా వస్తే మళ్లీ ఆ స్టార్‌ను లాగేసుకుంటుంది మిషోలిన్. (మిషోలిన్ అనేది ఐరోపాలో ప్రసిద్ధ టైర్‌ల కంపెనీ. ఆ కంపెనీకి రెస్టారెంట్‌లు కూడా ఉన్నాయి. అది ఏటా మంచి మంచి రెస్టారెంట్‌లకు అవార్డులు ఇస్తుంటుంది).
సెలబ్రిటీ చెఫ్ గోర్డాన్ రామ్‌సే అయితే ఒకసారి తనకు వచ్చిన స్టార్‌ను, చిన్న పొరపాటు వల్ల పోగొట్టుకున్నందు వలవల ఏడ్చేశాడు కూడా. అంత ప్రతిష్ఠాత్మకమైన మిషోలిన్ స్టార్స్ సింగపూర్‌లోని ఓ రోడ్డు సైడ్ ఫుడ్ బండికి వచ్చాయంట ఆ బండి ఓనర్ ఎంత గ్రేట్ అనుకోవాలి. అతడి పేరు చాన్ హాన్ మెంగ్. వయసు 52 ఏళ్లు. చికెన్‌ని రోస్ట్ చెయ్యడంలో స్పెషలిస్టు.
ఏవో రహస్యమైన దినుసులను జోడించి, అత్యంత రుచికరమైన, శుభ్రమైన ఫుడ్ ఐటమ్స్‌ని సర్వ్ చేస్తుంటాడు. మిషోలిన్ అవార్డు వచ్చాక కూడా అదే ధరకు (ఒకటిన్నర డాలర్లు) అంతే క్వాంటిటీ ఫుడ్, అంతే క్వాలిటీతో చాన్ ఇస్తున్నాడు! ‘గ్రేట్ బిగ్ స్టోరీ అనే వెబ్ సైట్ ఈయన స్టోరీని యూట్యూబ్ తెరకు ఎక్కించింది. చూడండి. మీరూ ఇన్‌స్పైర్ అయి ఓ బండి పెట్టినా పెట్టేస్తారు.
భర్త కన్నా భార్యే తెలివైనదా?!
నిడివి - 2 ని. 25 సె.
హిట్స్ - 1,71,946
డౌన్‌సైజింగ్: ట్రైలర్
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా మూవీ ‘డైన్‌సైజింగ్’ రెండో ట్రైలర్ ఇది. జనాభా సమస్య పరిష్కారానికి ప్రపంచ దేశాలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి కదా, ఈ సినిమాలోని నార్వే సైంటిస్టులు ఓ కొత్త రకం విరుగుడును కనిపెడతారు. మనిషిని 5 అంగుళాల ఎత్తుకు కుదించే ప్రయోగం అది. సక్సెస్ అవుతుంది. ఈ భూమండలంపై ఉన్న వాళ్లందరినీ ఇలా కుబ్జాకారులుగా మార్చేస్తే సంభవించబోయే పరిణామాలను ఆర్థిక వేత్తలు, సైకాలజిస్టులు, ఆధ్మాత్మికవాదులు అంచనా వేయడం మొదలౌతుంది.
మొత్తానికైతే 200 ఏళ్ల క్రితం నాటి ఆరోగ్యవంతమైన, అతి విశాలమైన ప్రకృతి జీవనానికి అనువైన వసతులతో మెరుగైన జీవితాన్ని పొందవచ్చునని మనుషులందరిలోనూ ఆశ కలుగుతుంది. అలా ఆశపడ్డవాళ్లలో పాల్ సఫ్రానెక్, ఆయన భార్య ఆడ్రే కూడా ఉంటారు. జీవితంలోని స్ట్రెస్‌ని తప్పించుకోడానికి వాళ్లు కూడా ఐదు అంగుళాల మానవులుగా మారిపోడానికి సిద్ధమైపోతారు. అయితే ఆఖరి నిముషంలో ఆడ్రే మనసు మార్చుకుంటుంది. ఎందుకు మార్చుకుంటుందనేది క్రిస్మస్‌కి మూడు రోజుల ముందు డిసెంబర్ 22న తెలుసుకోవచ్చు. ఆ రోజున ఈ చిత్రం విడుదల అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment