
ఈ వారం యూట్యూబ్ హిట్స్
బుజ్జిమేక బుజ్జిమేక.. యు ఆర్ బ్యూటిఫుల్
సైక్లాప్స్ గోట్ బార్న్ ఇన్ ఇండియా: నేషనల్ జియోగ్రఫిక్
నిడివి : 1 ని. 6 సె., హిట్స్ : 13,92,917
అస్సాంలో ఇటీవల కన్ను తెరిచిన ఒక మేకపిల్లను నేషనల్ జియోగ్రఫిక్ చానల్ నిన్న అప్‌లోడ్ చేసింది. ఈ ఒంటికన్ను మేకపిల్లను ఇప్పుడంతా ఇంతింత కళ్లేసుకుని యూట్యూబ్‌లో తిలకిస్తున్నారు. ‘సైక్లాప్స్’ అనే ఒక అరుదైన శారీరక స్థితితో ఈ మేకపిల్ల పుట్టింది. గర్భంలో ఉండగా రెండుగా విడిపోవలసిన కళ్లు, ఒకటిగానే ఉండిపోవడాన్ని సైక్లోపియా అంటారు.
దేవుడా! ఏమిటయ్యా ఇది? ఈ ప్రశ్నకు దేవుడు కాదు, వైద్యులు సమాధానం చెబుతున్నారు. గర్భంలో ఉండగా తల్లి మేక ఆహారంలో విషపదార్థాల మోతాదులు మితిమీరితే బిడ్డ మేక ఇలా పుట్టే అవకాశాలు ఉన్నాయట! ‘సేమ్ రీజనే మానవజన్మకూ వర్తిస్తుంది. గర్భిణులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించండి, సైక్లాప్స్ జననాలను నివారించండి’ అని జియోగ్రఫిక్ చానల్ వారి జీవ జాతుల పరిశోధక బృందం అంటోంది.
నన్ను హత్తుకునే ఉండు..వదిలెయ్యకు
కమిల్లా కబేల్లో : క్రయింగ్ ఇన్ ద క్లబ్
నిడివి : 5 ని. 20 సె., హిట్స్ : 36,10,540
ఆడపిల్ల దుఃఖాన్ని చూసి తట్టుకోలేని మగధీరులకు ఈ వీడియో నిషిద్ధం. ఆడపిల్ల మనసును అర్థం చేసుకునే ధైర్యవంతులు మాత్రం ముందుకు వచ్చేయండి. ఏంటట.. ఆ అమ్మాయికి అంత బాధ! హార్ట్ బ్రేక్ అయిందా? ‘అతడి ప్రేమ పొందకుండానే చచ్చిపోతానని నువ్వు అనుకుంటున్నావా? నువ్వెప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతానని భయపడుతున్నావా? అది నిజం కాదు. అది నిజం కాదు.. అది నిజం కాదు..’ అని మీరెంత అయినా అనునయించండి. తను క్లబ్బులో కూర్చొని ఏడుస్తూనే ఉంటుంది.
బట్.. ‘‘లేదు లేదు.. నేను ఏడ్వడం లేదు.. నేడు ఏడ్వవడం లేదు..’’అని పచ్చి అబద్ధం చెబుతుంది! సడన్‌గా మళ్లీ అంటుంది.. ‘ఈ రాత్రికి నన్ను నీ చేతుల్లోకి తీసుకో. నా కోసం నీ హృదయాన్ని తెరిచి ఉంచు. సూర్య కిరణాలు నిన్ను తాకే వరకు, నువ్వు నన్ను హత్తుకునే ఉండు’ అని డీలా పడిపోతుంది. బాస్.. ఎవరీ అమ్మాయి! ఎవరా? క్యూబాలో పుట్టిన అమెరికన్ గాయని కమిల్లా కబెల్లో. ఆ కళ్లను చూస్తే ప్రేమలో పడిపోని వాడెవడు ఈ భూలోకంలో. తను.. స్వయంగా తను పాడుతోంది. ఎవడో నీలాంటి వాడో, నాలాంటి వాడో హర్ట్ చేశాడు. లేదా హర్ట్ అయిన ఏ అమ్మాయి ఆవేదననో తన గొంతులో పలికిస్తోంది. బాయ్స్.. ఈ సాయంత్రం మీ గర్ల్‌ఫ్రెండ్‌ని కలవబోయే ముందు ఈ వీడియోను ఒక్కసారి చూడండి.
పద్నాలుగో మమ్మీ.. 9న నిద్ర లేస్తోంది!
ది మమ్మీ : ట్రైలర్
నిడివి : 1 ని. 57 సె., హిట్స్ : 26,55,230
జేమ్స్‌బాండ్ 007 టైప్‌లో హాలీవుyŠ మూవీస్‌లో మనకున్న మరొక థ్రిల్లర్.. ‘మమ్మీ’ సీరీస్. 1932లో ‘ది మమ్మీ’ పేరుతో ఫస్ట్ మమ్మీ నిద్రలేచింది. ఈ ఏడాది జూన్ 9న అదే పేరుతో 14వ మమ్మీ సమాధిలోంచి లేస్తోంది. పురాతనకాల సమాధి నుంచి శతాబ్దాల తర్వాత తిరిగి లేచిన ఒక రాకుమారి ఘోస్ట్‌గా మారి ఆధునిక ప్రపంచాన్ని అతలాకుతలం చేసే కథాంశంతో తయారైన ఈ చిత్రంలో మీరు మధ్యప్రాచ్యపు మార్మిక ఎడారి భూములను, పద్మవ్యూహాల్లాంటి సొరంగాలను ఈ ఆధునిక కాలపు థియేటర్‌లలో కూర్చొని త్రీడీలో వీక్షించవచ్చు.
35 ఏళ్ల హాలీవుడ్ నటి సోఫియా బొటెల్లా ఇందులో మమ్మీగా నటిస్తున్నారు. ఈ ‘టైటిల్ మాన్‌స్టర్’ సహ నటుడిగా టామ్ క్రూజ్ సీన్‌లోకి వస్తున్నారు. ఎడారి గుండా ఓ విమానం ప్రయాణించడం ట్రైలర్ తొలి బిట్. అందులో మన హీరో ఉంటాడు. క్షణాల్లో విమానం ముక్కలైపోతుంది. నెక్స్›్టబిట్‌లో మమ్మీ లండన్‌లో దిగుతుంది. అక్కడి నుండి ప్రతి బిట్‌లోనూ మమ్మీకి, క్రూజ్‌కి మధ్య ఫైట్. మీరిక సీట్లో స్థిమితంగా కూర్చోలేరు. అది సినిమా అయినా, ట్రైలర్ అయినా!
ముద్దొచ్చేస్తారు.. ఏడుపు ముఖం బాయ్స్
లొగాన్ పాల్ : హెల్ప్ మీ హెల్ప్ యు
నిడివి : 3 ని. 24 సె., హిట్స్ : 60,10,763
అమ్మాయిలు ఎప్పటికీ అబ్బాయిలకు అర్థం కారు. అవునా! అమ్మాయిలు ఏమంటున్నారో చూడండి. అబ్బాయిలు అమ్మాయిల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరట. ఇదిగో ఈ అర్థం కాకపోవడంలోనే ఉందట అట్రాక్షన్ అంతా! లొగాన్ అలెగ్జాండర్ అంటున్నాడీమాట. ఓ అట్రాక్టివ్ వీడియో చిత్రీకరించుని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఫన్నీ క్లిప్ కేటగిరీలో ఇప్పుడది ట్రెండింగ్‌లో ముందుంది. లొగాన్ యాక్టర్, అమెరికన్ సోషల్ మీడియా ఎంటర్‌టైనర్. వీడియో ఫన్నీగా స్టార్ట్ అవుతుంది. బట్టల కుప్పల్లోంచి లొగాన్ తల బయటికి వస్తుంది. లోపల గదిలోంచి ఓ పిల్ల వస్తుంది.
‘‘పార్టీకి నేనే డ్రస్ వేసుకోనూ..’’ అని! ఇక పాట మొదలౌతుంది. ‘నీకు పన్నెండుసార్లు చెప్పాను. మొదట చేతికి వచ్చిన డ్రస్ ఏదో అదే బెస్ట్ డ్రస్’ అని. చాకుల్లాంటి కుర్రాళ్లు ఐదుగురిని వెంటేసుకుని ఈ వీడియోను ఫీచరింగ్ చేశాడు లొగాన్. ఆ కుర్రాళ్లూ కన్‌ఫ్యూజన్‌లో ‘అమ్మాయిలెందుకు అడిగిన దాన్నే మళ్లీ మళ్లీ అడుగుతుంటారు. అని ఆశ్చర్యపోతుంటారు.. అమాయకంగా! ఐ నీడ్ ఎ బ్రేక్ బేబీ.. అని మొత్తుకుంటుంటారు. ఆడపిల్లల్ని అర్థం చేసుకోలేక ఏడుపుముఖం పెట్టే అబ్బాయిలు ఎంత ముద్దొస్తారో చూడాలని కోరుకునే అమ్మాయిలు దీనిని మిస్ అవకూడదు.