
వ్రూమ్.. వ్రూమ్.. వ్రూమ్!
మీగోస్, నిక్కీ మినాజ్, కార్డీ బి: మోటార్‌స్పోర్ట్
నిడివి : 5 ని. 17 సె.
హిట్స్ : 86,84,215
ముగ్గురు అబ్బాయిల్ని ఇద్దరు అమ్మాయిలు నిర్దాక్షిణ్యంగా తొక్కి తైతక్కలాడే ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ‘మీగోస్’ అన్నది ముగ్గురు అమెరికన్ మగ రాయుళ్ల హిప్ హాప్ బ్యాండ్. నిక్కీ మినాజ్, ‘కార్డీ బి’ అమెరికన్ ఫిమేల్ సింగర్లు. ఈ ఐదుగురి న్యూ సింగిల్ ట్రాక్ ‘మోటార్‌స్పోర్ట్’. నిక్కీ మినాజ్ అయితే ‘నీ మొహం మండా’ అని తిట్టినట్లే చూస్తుంది! అసలేంటి వీళ్ల గొడవ? ఎక్స్‌పెన్సివ్ కార్లలో షికార్లు కొడుతుంటారు.
సెటైర్‌లతో అబ్బాయిల్ని కుమ్మేస్తుంటారు. డెయిలీ కమ్యూట్‌కి ఇది థీమ్ సాంగ్ అనుకోండి. హైదరాబాద్‌లో కొత్తగా స్టార్ట్ అయిన మెట్రో రైల్లో ఇటు వెళ్తూ ఒకసారి, ఇటూ వస్తూ ఒకసారి అమ్మాయిలు డాన్స్ చేస్తూ, అబ్బాయిల్ని టీజ్ చేస్తున్నట్లు ఊహించండి. ఆ ఊహను పిక్చరైజ్ చేస్తే ఎలా ఉంటుండో... అలా ఉంది వీళ్ల సాంగ్ అండ్ డాన్స్. వ్రూమ్.. వ్రూమ్.. వ్రూమ్ అంటూ పిచ్చెక్కించేస్తున్నారు నిక్కీ, కార్డీ.
బిట్టు.. బిట్టు.. దాహపు బొట్టు
యూట్యూబ్‌రీవైన్డ్: ది షేప్ ఆఫ్2017
నిడివి : 7 ని. 14 సె.
హిట్స్ : 10,31,12,555
ఇయర్ రౌండప్స్ స్టారై్టపోయాయి! యూట్యూబ్ కూడా తన రీవైండ్‌ని ఈ మిడ్ వీక్‌లో విడుదల చేసింది. ఆ రీవైండే ఈ వీడియో. 2017లో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండి, వైరల్ అయిన ఈ మ్యూజిక్ వీడియోల సంకలనాన్ని వీక్షించినవారి సంఖ్య ఈ నాలుగు రోజులకే 10 కోట్లు దాటిపోయింది. ఇండియా నుంచి బిబి కి వైన్స్, వ్లోగర్ శృతి అర్జున్ ఆనంద్, కామెడీ కలెక్షన్ ఎ.ఐ.బి.లకు ఇందులో చోటు దక్కింది.
అంతర్జాతీయంగా చూస్తే, ‘ఫిడ్జెట్ స్పిన్నర్స్’ నుంచి ‘స్లైమ్’ వరకు, ‘డెస్పసీటో’ నుంచి ‘షేప్ ఆఫ్ యు’ వరకు, ఇంకా.. బిబిసి ఇంటర్వ్యూలోని చిన్న ముక్క ‘కిడ్స్ హు క్రాష్‌డ్ దెయిర్ ఫాదర్స్ ఇంటర్వ్యూ’ కూడా రీవైండ్‌లో ఉన్నాయి. ‘సాక్షి’ ఫ్యామిలీలో ఏడాదికి పైగా ప్రతి సోమవారం వస్తున్న ‘యూట్యూబ్ హిట్స్’లోని వీడియోలలో కొన్నింటిని కూడా మీరు ఈ రీవైండ్‌లో పైపైన ఒకసారి చూడొచ్చు. ‘ది బెగ్గెస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ హిస్టరీ’గా నిలిచిన ‘డెస్పసీటో’ సాంగ్‌తో వీడియో మొదలౌతుంది. బిగ్గెస్ట్ డెబ్యూగా టేలర్ స్విఫ్ట్ ‘లుక్ వాట్ యు మేడ్ మీ డు’ ప్లే అవుతోంది.
ఒక జిరాఫీ తన బిడ్డకు జన్మనిచ్చే భారమైన సుదీర్ఘ క్షణాలను కూడా యూట్యూబ్ దీనికి యాడ్ చేసింది. ఇక ‘స్లో–మో’ కొల్లీషన్‌ని ఎవరు మర్చిపోగలరు? పట్టాలపై పేరుకుపోయిన మంచుగడ్డల్ని దుమ్ములా రేపుకుంటూ ట్రైన్ దూసుకువచ్చే దృశ్యం అది. బిట్టు బిట్టు దాహపు బొట్టులా ఉంది చూడండి.
డైనోసార్స్ మళ్లీ వస్తున్నాయి
జురాస్సిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్
నిడివి : 2 ని. 26 సె.
హిట్స్ : 2,55,51,886
మితి మీరిన సంతతితో అదుపు తప్పిన డైనోసార్స్ కొన్ని.. ‘జురాస్సిక్ వరల్డ్’ అనే యానిమల్ థీమ్ పార్క్‌ను ధ్వంసం చేస్తాయి. ఆ విధ్వంసంలో కొన్ని డైనోసార్స్ చనిపోగా కొన్ని బతికి బట్టకడతాయి. ఆ తర్వాత, నాలుగేళ్లకు అక్కడికి సమీపంలోని ‘ఐలా నుబ్లార్’ దీవిలోని అగ్నిపర్వతాలు బద్దలై, ఆ జ్వాలా ప్రవాహంలో డైనోసార్స్ భస్మమైపోతుంటాయి. వాటిని కాపాడటం కోసం క్లెయిర్ డియరింగ్ అనే పూర్వపు పార్క్ మేనేజర్ నడుం బిగిస్తుంది.
అప్పటికే ఆమె ‘డైనోసార్ ప్రొటెక్షన్ గ్రూప్’ అని ఒక ఆర్గనైజేషన్‌ని నడుపుతుంటుంది. ఆమెకు సహాయంగా ఒవెన్ గ్రేడీ అనే డైనోసార్ శిక్షకుడు పనిచేస్తుంటాడు. ఇద్దరూ కలిసి డైనోసార్స్ అంతరించిపోకుండా ఉండడం కోసం సర్వశక్తులూ ఒడ్డుతారు. అది ఎంత ప్రాణాంతకమైన సాహసమో ఈ ట్రైలర్‌లో మీరు కనిపిస్తుంది. 2015 నాటి జురాస్సిక్ వరల్డ్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ వచ్చే ఏడాది జూన్ 22న విడుదల అవుతోంది.
మాటలు రావే ఎలా?!
ఎవ్రీ ఇంట్రావర్ట్ అమ్మాయి ఎవర్ ‘ గర్ల్ ఫార్ములా
నిడివి : 6 ని. 38 సె.
హిట్స్ : 1,67,631
లోపల భావాల బ్లాస్టింగ్. పైన బ్లాంక్ ఫేసింగ్. ఎలా ఈ అమ్మాయిలు ఇలా ఉంటే? ఎలా బతుకుతారు ఈ పాడు లోకంలో? బాయ్‌ఫ్రెండ్ వస్తానన్నాడు. వచ్చాక వాణ్ణెలా ఇంప్రెస్ చెయ్యాలి? డ్రెస్‌తోనా? పెర్‌ఫ్యూమ్‌తోనా? విద్య రెండు వేలు అప్పు తీసుకుంది. తిరిగి ఇవ్వదే! మర్చిపోయినట్లుంది. అడుగుదామా వద్దా. ఊ.. వద్దులే. అమ్మో! వీడొచ్చాడు దేవుడా! చేతిలో చెయ్యేసిగానీ మాట్లాడడు. (‘కొంచెం మమ్మల్నీ పట్టించుకుంటుండండీ, మాకూ టైమ్ ఇస్తుండండీ..’) హమ్మయ్య. వెళ్లిపోయాడు.
బతుకు జీవుడా! నైస్ కాన్సెప్ట్! ‘బుక్ అవ్వకూడదంటే.. మనసుకు మేకప్ చెయ్యకూడదు. సో.. వేకప్ గర్ల్స్’ అనే థీమ్‌తో ఈ వారం యూట్యూబ్‌లో ‘గర్ల్ ఫార్ములా’ ఛానెల్ అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఓస్సమ్. బాయ్స్ అండ్ గర్ల్స్. రెగ్యులర్‌గా ఈ ఛానెల్‌ను ఫాలో అవుతుండండి. మనసులో ఉన్నది ధైర్యంగా మాటల్లోకి వచ్చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment