జిప్పోరా మధుకర్
‘కోవిడ్ –19 సోకితే కనిపించే లక్షణాలు’ అనే కరపత్రాన్ని చదువుతున్నాడు బ్యాట్‌మన్. గాల్లో ఎగురుతూ ముందుకెళ్తున్నాడు సూపర్‌మన్. కొంచెం దూరంలో... నలుగురి మధ్యలో కూర్చొని ఉన్నాడు హల్క్. అందులో ఒకతను హల్క్ మొహం మీదే తుమ్ముతున్నాడు.. దగ్గుతున్నాడు. ఇదంతా టీవీ చానెల్‌లో ప్రసారం అవుతున్న యానిమేషన్ సీరియల్ అనుకునేరు. కామిక్ క్యారెక్టర్స్ బొమ్మలతో అల్లిన స్టోరీ. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అవుతోంది. కన్‌ఫ్యూజన్ లేకుండా కథ తెలుసుకుందాం.
కరోనా వైరస్ ఆకారంలోని క్యాప్‌లతో పోలీసులు
ఈ కామిక్ క్యారెక్టర్స్ బొమ్మలతో కరోనా కథ నడిపిస్తున్న అమ్మ పేరు జిప్పోరా మధుకర్. చెన్నైవాసి. వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. లాక్‌డౌన్ కాబట్టి.. బయటకు వెళ్లడానికి వీల్లేదు. భర్త, ఇద్దరు కొడుకులు పదేళ్ల మాథ్యూస్, అయిదేళ్ల లుకస్‌తో కలిసి ప్రతి సాయం కాలం ఇలా కామిక్ బొమ్మలతో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కరోనా’ కథను చెప్తున్నారు జిప్పోరా. ‘సూçపర్‌హీరోస్ కూడా కరోనాకు అతీతులు కారు .. కాబట్టి ఇంట్లో ఉండడమే శ్రేయస్కరం’ అని పిల్లలకూ అర్థమయ్యేలా’ చెప్పడమే ఆమె ఉద్దేశం.‘దీనివల్ల మా పిల్లలకూ ఈ వైరస్ మీద అవగాహన కలుగుతోంది. తెల్లవారి ఏ ఐడియాతో ఈ కథ చెప్పాలా అని ఆలోచిస్తూ పడుకుంటున్నారు. పొద్దున్నే కొత్త ఆలోచనతో నిద్రలేస్తున్నారు. ఇంట్లో టీవీ పెట్టట్లేదు. కరోనా గురించి టీవీ చానెళ్ల హంగామా చూస్తుంటే పెద్దవాళ్లం మాకే భయమేస్తోంది. ఇక పిల్లలు.. వాళ్లెంత బెదిరిపోతారోనని. అప్‌డేట్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే చూస్తున్నాం. గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలను పిల్లలకు వాళ్ల భాషలో వివరిస్తున్నాం. మేము అందిస్తున్న సమాచారంలోంచే ఐడియాస్ ఆలోచిస్తూ కామిక్ క్యారెక్టర్ల కరోనా కథను సిద్ధం చేసుకుంటున్నారు. రోజుకో కొత్త కాన్సెప్ట్‌తో సాయంత్రానికల్లా వాళ్లు స్టోరీ రెడీ చేస్తూంటే .. దాన్ని నేను ఫొటోలుగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నాను’ అంటోంది జిప్పోరా మధుకర్.
భౌతిక దూరం పాటిస్తూ నిత్యావసరాలు తెచ్చుకోవడం, కరోనా పేషంట్ల కోసం రైలు ఆసుపత్రి
కరోనా కాన్సెప్ట్స్
భౌతిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, శుభ్రత వంటి ప్రాథమిక విషయాల నుంచి వలసల ప్రయాణాలు, ఐసోలేషన్ వంటి గంభీరమైన అంశాల దాకా ఈ పిల్లల ఆలోచనలు సాగుతున్నాయి. నిత్యావసర సరుకుల దుకాణాలకు గుంపులుగా వెళ్లకూడదు అనే నియమాన్ని బొమ్మలతో చక్కగా చూపిస్తున్నారీ పిల్లలు. బ్యాట్‌మన్ తన అపార్ట్‌మెంట్‌లో కూర్చొని డ్రోన్‌తో నిత్యావసర వస్తువులను కిందికి వదులుతుంటాడు.. ఒక్కొక్కరే వరుసగా వచ్చి వాటిని తీసుకెళ్తుంటారు. అలాగే వలసకూలీలు అంతా కాలినడకన తమ ఇళ్లకు వెళ్లడం, కరోనా రోగులకు చికిత్స చేసి ఇంటికి వచ్చిన తమ తల్లిని చూసిన పిల్లలు ఆత్రంగా ఆ డాక్టరమ్మను వాటేసుకునే ప్రయత్నం చేయడం.. వాళ్లను ముట్టుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి.. దూరం నుంచే పిల్లలను పలకరించి తన ప్రత్యేకమైన (ఐసోలేషన్) గదిలోకి ఆ అమ్మ వెళ్లిపోవడం, ‘కరోనా’ పేషంట్ల కోసం రైలును ఆసుపత్రిగా మార్చడం, రోగనిరోధక శక్తి పెంచుకోవడం కోసం తీసుకోవాల్సిన ఆహారం మొదలైన అన్ని విషయాలతో ఈ కామిక్ క్యారెక్టర్ల ‘కరోనా’ కథలను తయారు చేస్తున్నారు జిప్పోరా కుటుంబం.
తన ఇంటి ఐసోలేషన్ గదిలో డాక్టరమ్మ
‘ఈ ప్రయోగం వల్ల చాలా ప్రయోజనాలు కనపడ్తున్నాయి. వైరస్ మీద పిల్లలకు అవగాహన కలగడం ఒకటైతే.. లాక్‌డౌన్ సమయంలో వాళ్లకు బోర్ కొట్టకుండా చేతినిండా పని కల్పించిన వాళ్లమవుతున్నాం. దీంతో వాళ్ల సృజనాత్మక శక్తి బయటపడుతోంది. కొత్తగా ఆలోచిస్తున్నారు. ఈ క్రియేటివ్ స్టోరీస్‌తో పిల్లలనే కాదు, పెద్దవాళ్లనూ ఆకట్టుకుంటున్నారు,‘ కరోనా’ మీద వాళ్లకు తెలిసిన పద్ధతిలో అవగాహన కల్పిస్తున్నారు’ అని చెప్తున్నారు జిప్పోరా మధుకర్. నిజమే కదా!
– సరస్వతి రమ
రోగనిరోధక శక్తి కోసం తీసుకోవాల్సిన ఆహారం
Comments
Please login to add a commentAdd a comment