
143 I MISS YOU
లవ్‌కుమార్.. తనకు తాను ప్రేమకు ‘సింబాలిక్’ అనుకుంటాడు. అందుకు తగ్గట్టే చిన్నప్పటి నుంచే మనోడు ప్రేమించడం మొదలుపెట్టాడు.
లవ్‌కుమార్.. తనకు తాను ప్రేమకు ‘సింబాలిక్’ అనుకుంటాడు. అందుకు తగ్గట్టే చిన్నప్పటి నుంచే మనోడు ప్రేమించడం మొదలుపెట్టాడు. స్కూల్ డేస్‌లోనే అతని హార్ట్ లవ్‌లవ్ అని కొట్టుకుంది. ఏడో తరగతిలో సునీత.. ఎనిమిదిలో ఫర్‌హీన్.. తొమ్మిదిలో పుష్పలత.. పదికొచ్చే సరికి రాధిక.. ఇలా క్లాస్‌కో గ్లామర్‌ను ప్రేమించేసిన మనోడికి టెన్త్‌లో అచ్చంగా వచ్చిన మార్కులు 413. దీన్నే ‘143’గా తిరగరాసుకుని... కాలరెగిరేసి మరీ ఇంటర్‌లోకి వచ్చేశాడు.
టీనేజీ మోజు.. కాలేజీ ఏజ్.. తొలిప్రేమ సినిమా రిలీజైన తొలినాళ్లు.. నా మనస్సే.. స్సే.. సే..సే.. అంటూ కాలేజీలోకి ప్రవేశించాడు. కట్ చేస్తే.. ఇంట్రడక్షన్ క్లాస్ బై కెమిస్ట్రీ లెక్చరర్. ఒక్కొక్కరి పేరు.. టెన్త్‌లో వచ్చిన మార్కులు అడుగుతున్నాడు. తన కంటికి ఇంపుగా ఏ అమ్మాయి కనిపిస్తుందా అని ఎదురుచూస్తున్నాడీ నిత్య ప్రేమికుడు. ఇంతలో ఒకమ్మాయి ‘పేరు స్వప్న కుమారి.. మార్కులు 413’ అని చెప్పి కూర్చుంది. ఈ కుర్రాడి గుండెల్లో గంట మోగింది. ఆ వెంటనే తన వంతు.. చప్పున లేచి. పేరు చెప్పి, మార్కులు ‘ఫోర్ వన్ త్రీ సార్’ అని చెప్పేశాడు. ఆ అమ్మాయి చెప్పిన మార్కుల ను రిపీట్ చేశాననుకుని కెమిస్ట్రీ లెక్చరర్.. ‘ఏంట్రోయ్..
అప్పుడే కటింగ్‌లు ఇస్తున్నావా’ అంటూ కాస్త కోపంగా.. ఇంకాస్త కొంటెగా ప్రశ్నించి ఇద్దరి మధ్య కెమిస్ట్రీకి క్యాటలిస్టు పాత్ర పోషించాడు. ఆనాటి నుంచి వాళ్లిద్దరి మధ్య కొంటె చూపులు.. చిలిపి నవ్వులు.. ఎన్నో విరబూశాయి. ఏడాది గడిచింది. సెకండియర్.. స్వప్నకుమారి అందాన్ని తలదన్నే మరో స్వప్నతో పరిచయం ఇష్క్‌వాలాకు కొంగొత్తగా అనిపించింది. ఇంటర్ అయిపోయింది. డిగ్రీ కోసం మనోడు హైదరాబాద్ వచ్చేశాడు. మూడేళ్లు గడిచాయి. అప్పటికి నో మొబైల్స్, నో మెసేజెస్. మూడేళ్లు తనను కలవలేకపోయినా, స్వప్న తన మదిలోనే కొలువై ఉందనిపించింది. అప్పుడు తనది నిజమైన ప్రేమని తెలిసొచ్చింది. ఓ రోజు ధైర్యం చేసి.. ఇంటికెళ్లి మరీ ఆ అమ్మాయి ముందు మనసు పరిచేశాడు. అప్పటికే స్వప్నకు పెళ్లి నిశ్చయమైందని తెలిసింది. లవ్‌కుమార్ సైడైపోయాడు.
పీజీలో...
స్వప్న ఒక స్వప్నం అనుకుని.. పీజీలో చేరాడు. సరితను చూడగానే సరిజోడనుకున్నాడు. కొత్తగా తాకిన చెలిగాలితో ఊహల్లో చెలరేగిపోయాడు. మాటా మాటా కలిసింది. ఆలస్యం అమృతం విషం అనుకుని.. మనసులో మాట చెప్పగానే.. మాటామాటా పెరిగింది.. వెరసి సరిత నిష్ర్కమించింది. లవ్ పేరులోనే ఉందికాని.. లైఫ్‌లో లేదనుకుని.. నిరుత్సాహంలో కుంగిపోతున్న భగ్నప్రేమికుడి జీవితంలోకి జీవిత ఎంటరైంది. మొదట తనే ప్రపోజ్ చేసింది. ఇన్నాళ్లకు సార్థక నామధేయుడ్ని అవుతున్నానని సంబరపడ్డాడు. ప్రేమలో ఇద్దరూ మునిగితేలారు. సిటీరోడ్లపై చక్కర్లు కొట్టారు. మెసేజ్ ఆఫర్లు వేయించుకుని మరీ ప్రేమ ‘చాట్’కున్నారు. ఇది పెద్దలకు తెలిసి కిరికిరి మొదలైంది. ప్రేమపక్షుల్లా ఎగిరిపోవాలనుకున్నారు. జీవిత అందుకు సాహసం చేయలేకపోయింది. జీవితంలో తొలిసారి సొంతమైన ప్రేమను దక్కించుకునేందుకు లవ్‌కుమార్ విఫలయత్నం చేశాడు. కొన్నాళ్లకు జీవిత మరొకరితో జీవితం పంచుకుంది. లవ్‌కుమార్ మళ్లీ ఓడిపోయాడు.
సాహసం చేయరా...
ఓ ప్రేమను కమిట్‌మెంట్ లేక మిస్సయ్యాడు. మరో ప్రేమను ఆలస్యం చేసి పొందలేకపోయాడు. ఇంకోసారి తొందరపడి కోల్పోయాడు. మరోసారి పెద్దల పెత్తనంతో అందుకోలేకపోయాడు. వెరసి లవ్‌కుమార్ ఒంటరిగా మిగిలిపోయాడు. గుర్తుకొస్తున్నాయంటూ మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ.. ప్రేమికులకు ఓ మాట చెబుతున్నాడు. ప్రేమికులకు టైమింగ్ కావాలి. ప్రేమను వ్యక్తం చేయడానికి ధైర్యం కావాలి. అంతకుమించి కమిట్‌మెంట్ కావాలి. ఇవేవీ లేకపోతే ప్రతి ప్రేమికుడూ తనలా మిగిలిపోవాల్సిందే అని చెబుతున్నాడు.
- త్రిగుళ్ల నాగరాజు