గేదెల కోసం.. పోలీసుల ఉద్యోగాలు హుష్ కాకి!! | 3 policemen punished in azam khan buffeloes missing case | Sakshi
Sakshi News home page

గేదెల కోసం.. పోలీసుల ఉద్యోగాలు హుష్ కాకి!!

Published Mon, Feb 3 2014 12:11 PM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM

గేదెల కోసం.. పోలీసుల ఉద్యోగాలు హుష్ కాకి!! - Sakshi

గేదెల కోసం.. పోలీసుల ఉద్యోగాలు హుష్ కాకి!!

అది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరం. ఆ జిల్లా ఎస్పీ సాధనా గోస్వామి విపరీతంగా టెన్షన్ పడుతున్నారు. పోయినవాటన్నింటినీ ఎలాగైనా పట్టుకోవాలని సిబ్బందికి ఆదేశాలిస్తున్నారు. వైర్లెస్ సెట్లు, వాకీటాకీలు, సెల్ఫోన్లు అన్నీ బర బరా మోగుతూనే ఉన్నాయి. ''ఏం చేస్తారో నాకు తెలీదు, వెంటనే పట్టుకుని అప్పజెప్పాలి. లేకపోతే ఎంతమంది ఉద్యోగాలు పోతాయో చెప్పలేను. అది నా చేతుల్లో లేదు'' అని సాధనా గోస్వామి మండిపడుతున్నారు. ఇంతకీ వాళ్లంతా గాలిస్తున్నది ఎవరి కోసమో ... కాదు కాదు వేటి కోసమో తెలుసా? ఏడు గేదెల కోసం. ఏంటి.. గేదెలు కనిపించకపోతేనే పోలీసుల ఉద్యోగాలు పోతాయా, ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా? అవును మరి, అవి అలాంటి, ఇలాంటి గేదెలు కావు.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలోనే అత్యంత శక్తిమంతుడైన మంత్రి ఆజంఖాన్ ఇంట్లో గేదెలు.

ఇంతకీ విషయం ఏమిటంటే, ఆజంఖాన్కు ఓ ఫాంహౌస్ ఉంది. దానికి పటిష్ఠమైన బందోబస్తు ఉంటుంది. కానీ, ఇనుప గొలుసులు తెంచి మరీ దొంగలు ఆ ఫాంలోంచి ఏడు గేదెలను అపహరించుకుపోయారు. దీంతో లక్నోలోని పోలీసులంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. రోడ్ల మీద గాలిస్తూ, దొరగారి గేదెలు ఎక్కడున్నాయోనని పగలు, రాత్రి శ్రమించారు. జిల్లా ఎస్పీ సాధనా గోస్వామి నేతృత్వంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆ గేదెల కోసం గాలింపు మొదలుపెట్టారు. పొలాలు, గుట్టలు, చెట్లు, చేమలు, అడవులు... అన్నీ చూశారు. అంతేకాదు, ఏకంగా వాసన పసిగట్టగల పోలీసు కుక్కలను కూడా తీసుకెళ్లారు. ఎందుకైనా మంచిదని కబేళాల్లోని సీసీటీవీ ఫుటేజిలను కూడా నిశితంగా పరిశీలించారు.

ఎట్టకేలకు వేర్వేరు ప్రదేశాల్లో ఈ గేదెలన్నీ ఆదివారానికి కనిపించాయి. అయితే, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, గేదెలను కాపాడలేకపోయినందుకు గాను ముగ్గురు పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించారు. పేరుకు మైనారిటీ, పట్టణాభివృద్ధి శాఖలే చూస్తున్నా.. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో ఆజాంఖాన్ నెంబర్ 2 అని, చక్రం తిప్పేందంతా ఆయనేనని అందరికీ తెలుసు. అందుకోసమే పోలీసులు చెమటలు కక్కి మరీ గేదెల ఆచూకీ కనుక్కోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు తప్పిపోతున్నా, ఆడపిల్లల ఆచూకీ దొరకకపోయినా పట్టించుకోని పోలీసులు ఈ గేదెల విషయంలో మాత్రం చొక్కాలు చించుకున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

ముజఫర్నగర్ అల్లర్ల బాధితులను ఏమాత్రం పట్టించుకోని ఆజంఖాన్.. తన గేదెలు పోయేసరికి మాత్రం నింగీ నేలా ఏకం చేసి, పోలీసుల ఉద్యోగాలు సైతం పీకించి నానా హడావుడి చేశారు. ముజఫర్నగర్ జిల్లాకు ఆయన ఇన్చార్జి మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. దానికితోడు మైనారిటీ సంక్షేమం కూడా ఆయన శాఖే. అదీ మంత్రిగారి నిర్వాకం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement