మనల్ని కాపీ కొట్టేవాళ్లే!
మన నగరాన్ని అంతర్జాతీయ నగరం చేస్తామనీ, విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చాలామంది నేతలు అంటున్నారుగానీ... నాకేమో ఇప్పటికే ఇది ఆల్రెడీ విశ్వనగరమే అని గట్టినమ్మకం. అంతర్జాతీయంగా అనేక నగరాలు మన పేర్లనూ, ప్రతిష్ఠలనూ, విశిష్టతలనూ కాపీ కొట్టాయేమోనని అనుమానం కూడా. ఉదాహరణకు మన లిబర్టీ సెంటర్‌నే తీసుకుందాం. అక్కడ లిబర్టీ థియేటర్ అని సినిమా హాల్ ఉండేదట. కాలక్రమాన సినిమాహాలు కాలగర్భంలో కలిసిపోయినా మన స్వేచ్ఛా ప్రియత్వానికి చిహ్నంగా ‘లిబర్టీ సెంటర్’ మాత్రం అలాగే మిగిలింది. ఈ పేరును కాపీ కొట్టి న్యూయార్క్ నగరం వాళ్లు ఒక ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ అని ఒక విగ్రహాన్ని తయారు చేయించుకుని, వాళ్ల సెంటర్‌కు ఆ పేరు పెట్టుకున్నారేమో మనకు తెలియదు. కానీ వాళ్లకు దీటుగా మన దగ్గరా ఓ ‘స్టాట్యూ లెస్ లిబర్టీ’ సెంటర్ ఆల్రెడీ ఉందన్నమాట మాత్రం వాస్తవం.
ఇక మన రోడ్డు పేర్లలో కోఠీని తీసుకోండి. దీని పేరును కాపీ కొట్టే... జపాన్ దేశస్తులు వాళ్ల దేశంలో ఒక నగరానికి క్యోటో అని పేరు పెట్టారు. అంతెందుకు... వాళ్ల రాజధానికి ఏ పేరు పెట్టాలో తెలియక ఇదే నగరం పేరును తిరగేసి ‘టోక్యో’ అని పిలుస్తూ, దాన్ని తమ రాజధాని చేసుకున్నారు. ఎందుకంటే... కింగ్ కోఠీలో అప్పట్లో రాజప్రసాదం ఉండేదని తెలుసుకున్న తర్వాత, జపనీయులు తమ నగరం పేరు తిరగేసి, దాన్ని రాజధానిగా చేసుకున్నారేమోనని నా
అభిప్రాయం.
మన నగర వాసులం... ఎంత హాస్యప్రియులమో తెలుసా? పాతబస్తీలో చాలా కాలం క్రితం ఒకాయన నివసించేవాడట. అతడెప్పుడూ కోపంగా కనిపించేవాడట. అతణ్ణి చూడగానే అందరికీ వేపాకు తిన్నట్లుగా చేదుగా అనిపించేదట. అందుకే అతడి అసలు పేరును మరిచి అందరూ అతడికి ‘కడ్‌వే సాబ్’ (చేదు మహనీయుడు) అని నిక్‌నేమ్ పెట్టారట. చివరకు ఆయన పేరిట కూడా ఒక గల్లీకి కడ్వే సాబ్ కీ గల్లీ అని ఆటోమేటిగ్గా నామకరణం జరిగిపోయిందట. మళ్లీ జపాన్‌వాడికి అర్థాలతో నిమిత్తం లేదు కదా. మన పేర్లు కాపీ కొట్టడమే అతడి పని కదా. అందుకే వాళ్ల నగరాల్లో ప్రముఖమైన ఒకదానికి ‘కడోమా’ అని నామకరణం చేసుకున్నారట.
అది కూడా మన పొరుగు రాష్ట్ర నగరం విశాఖ పేరును కాపీ కొట్టి ‘ఒసాకా’గా మార్చుకున్న నగరానికి దగ్గర్లో ఉందట ఈ కడోమా సిటీ. ఇక పాకిస్థాన్ వాడికైతే మరీ సిగ్గు లేదు కదా. అందుకే మొత్తానికి మొత్తం మన నగరం పేరుతో మరో హైదరాబాద్‌నే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కాపీ రాయుళ్లతో ఎంతకని ఛస్తాం. కాబట్టి మన గొప్పతనానికి తార్కాణంగా ఒక్కమాట అనుకుందాం. అద్భుత రచయిత ఆస్కార్‌వైల్డ్ ఏమన్నాడు? గొప్పవాళ్లకు మామూలు వాళ్లిచ్చే గౌరవమే ‘అనుకరణ’ అన్నాడు. విశ్వమంతా ఇప్పటికే మనల్ని అనుకరిస్తుంటే... కొత్తగా చెప్పేదేం లేదు... ఆల్రెడీ మనది ప్రపంచ పట్టణం... విశ్వమహానగరం!