
నిదురించిన మా పౌరుషాగ్ని రగిలించిన వాడా!
తెల్లజాతి దోపిడీని ఎదిరించిన అల్లూరి సీతారామ రాజు (జూలై 4, 1897-మే 7, 1924) దేశభక్తి నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకోద్యమంలో భాగంగా మన్యం పోరాటం సుమారు రెండేళ్లపాటు సాగింది. కాలం గడుస్తున్న కొలదీ, దెబ్బలు తింటున్న కొలదీ బ్రిటిష్ సామ్రాజ్య వాదులు తమ సైనికశక్తిని సమీకరించుకొని గిరిజన ప్రాంతాలపై కేంద్రీకరించి దాడి చేయడం అధికమైం ది. సామ్రాజ్య సైనిక బలగాల ముందు సాంఘికం గాను, ఆర్థికంగాను వెనుకబడిన గిరిజన రైతాంగం జనసాంద్రత కలిగిన మైదాన ప్రాంతాల సహకారం లేకుండా ఎక్కువ కాలం తమ పోరాటాన్ని కొనసా గించలేకపోయింది. గెరిల్లా యుద్ధానికి అనువైన కొండలు, అరణ్యాలు తోడుగా ఉన్నాయి. గిరిజన సమాజం పూర్తి తోడ్పాటునందించింది. ఈ అనుకూ లమైన అంశాలను అతి చాకచక్యంగా వినియోగిం చుకొని సీతారామరాజు అద్భుతమైన విజయాలు సాధించగలిగాడు. ఈ ఉజ్జ్వల పోరాటానికి రావా ల్సిన ప్రాచుర్యం లభించలేదు.
ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతా లకు దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడీ, ఆస్తుల దోపిడీ, స్త్రీల మాన హరణం సర్వ సాధారణంగా జరుగుతుండేవి. మ న్యంలో గిరిజనుల జీవితం దుర్భ రంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకొని జీవించే వారిపై బ్రిటిష్ వారు దుర్మా ర్గంగా ప్రవర్తించేవారు. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్‌స్టేషన్ మీద దాడితో మన్యం పోరాటం ప్రారంభమైంది. మరుసటి రోజు కృష్ణదేవిపేట, మూడవ రోజు రాజవొమ్మంగి పోలీసు స్టేషన్‌లపై దాడిచేశారు. రాజు పోరాటంలో అత్యంత సాహసో పేతమైనది అడ్డుతీగల పోలీసుస్టేషన్‌పై దాడి. ఎం దుకంటే ముందే సమాచారమిచ్చి దాడి చేశారు.
వారం రోజులలో విప్లవకారు ల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజ లను కాల్చివేస్తామని కృష్ణదేవిపేట సభలో కలెక్టర్ (స్పెషల్ కమిషనర్) రూథర్‌ఫర్డ్ ప్రకటించాడు. బ్రిటిష్ వారి బాధల నుండి విముక్తి ప్రసా దించడానికి సీతారామరాజు లొంగి పోవాలని నిశ్చయించుకున్నట్టు ఒక వాదన ఉంది. 1924 మే 7న కొ య్యూరు గ్రామ సమీపంలో స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరుపరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజును (ఒక చెట్టుకు కట్టివేసి) ఏ విచా రణా లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. కేవలం 27 ఏళ్ల వయసులోనే అల్లూరి సీతారామరాజు అమర వీరుడయ్యాడు.
దేశంలోనూ, ఆంధ్రలోను కూడా సామ్రాజ్య వాదుల దోపిడీని సహించలేక చిన్నవే, పెద్దవే అయినా అనేక రైతాంగ తిరుగుబాట్లు జరిగాయి. నాడు స్వాతంత్య్ర వీరుల సమస్తం ఒడ్డి అసమాన తెగువ, సాహసాలను ప్రదర్శించారు. తమ త్యాగాల ద్వారా ప్రజలలో దేశభక్తిని పురిగొల్పారు. విఫల మైన వీరోచిత పోరాటాలు తాత్కాలిక వైఫల్యాలకు గురైనప్పటికీ అంతిమ పోరాటానికి దోహదం చేశాయి, చేస్తాయని గుర్తు పెట్టుకోవాలి. నేటికీ మన ప్రజలలో అత్యధికులు ప్రధానంగా గిరిజనులు ఆర్థి కంగా, సాంఘికంగా ఎంతో వెనుకబడి ఉన్నారని గమనిస్తే నాడు బలిదానాలు చేసిన త్యాగధనుల జీవితం నుంచి ఉత్తేజం పొంది ప్రజా విముక్తికీ, సుఖజీవనానికీ పాటుపడాల్సిన కర్తవ్యం ఇంకా ఉం దన్నది సుస్పష్టమవుతుంది.
(అల్లూరి 91వ వర్ధంతి సందర్భంగా)
ఎం. శోభన్‌నాయక్ (ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ (టీఎస్‌యూ) రాష్ట్ర కన్వీనర్) సెల్: 9490095427