నందమూరి బాలకృష్ణ
సినీరంగంలో ఎన్టీఆర్ వారసుడిగా నిలిచిన బాలయ్య బాబు (నందమూరి బాలకృష్ణ) రాజకీయాలలో కూడా వారసుడిగా నిలుస్తారా? ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తారా? అన్న నందమూరి హరికృష్ణ ఖాళీ చేసిన రాజ్యసభ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారా? అన్నిటికి అవుననే సమాధానం వస్తోంది. బాలయ్య బాబు పెద్దల సభలో అడుగుపెడతారని ప్రచారం జరుగుతోంది. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పెద్ద బావమరిదికి రాజ్యసభ స్థానం అప్పగిస్తే, ఆయన సమైక్యాంధ్ర కోసమని నిజాయితీగా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానాన్ని చిన్న బావమరిది బాలయ్య బాబుతో నింపాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను పెద్దల సభకు పంపితే ఇక్కడ కొంత రాజకీయ ఒత్తిడి తగ్గించుకోవచ్చన్నది ఆయన ఆలోచన. ఎటూ ఒక రాజ్యసభ స్థానం నందమూరి కుటుంబానికి ఇవ్వాలని అనవాయితీగా కూడా పెట్టుకున్నట్లున్నారు.
టిడిపికి ప్రస్తుత రాజ్యసభలో హరికృష్ణ రాజీనామా చేయడంతో ఒక స్థానం ఖాళీ అయింది. ఆ స్థానంతోపాటు మన రాష్ట్రానికి సంబంధించి మరో అయిదు స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం ఆరు స్థానాలలో టిడిపికి రెండు స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఉన్నది రెండు సీట్లు. పోటీ మాత్రం అధికంగా ఉంది. మాక్కావాలంటే మాకని ఒత్తిడి పెరుగుతోంది. పైరవీల జోరందుకుంది. రాజ్యసభ సీట్ల రాజకీయం రసవత్తరంగా ఉంది.
టిడిపిలో ఇరవై మందికి పైగా నేతలు రాజ్యసభ సీటు కోసం పోటీపడుతున్నారు. రాష్ట్ర విభజన విషయంలో రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న చంద్రబాబు, ఇప్పుడు ఆ ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో తల పట్టుకునే పరిస్థితి ఏర్పడినట్లు వినికిడి. 2008, 2012లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఒకరికి, సీమాంధ్ర నుంచి ఒకరిని రాజ్యసభకు పంపుతున్నారు. అదే సిద్ధాంతం ఇప్పుడు కూడా అనుసరిస్తారని చెబుతున్నారు. అయితే అంతా కావాల్సిన వాళ్లే. ఒకరికిస్తే మరొకరితో తంటా. ఈ స్థితిలో చంద్రబాబు ఏం చేయాలా? అని దీర్ఘ ఆలోచనలో మునిగిపోయారు.
తెలంగాణకు సంబంధించిన అభ్యర్థిగా తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అయిదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. అన్నిటికీ మించి నమ్మినబంటు. దానికి తోడు ఆయన ఎస్సి. టీఆర్‌ఎస్‌పై తిరగబడటంలో ఆయన దిట్ట. ఇవన్నీ నరసింహులుకు కలసివచ్చినట్లు భావిస్తున్నారు.
మరి మిగిలిన ఒక్క సీటుతోనే తంటా అంతా. పెద్ద బావమరిది హరికృష్ణ ఖాళీ చేసిన సీట్లో చిన బావమరిది బాలయ్యను కూర్చొబెడితే బాగుంటుందని భావిస్తున్నారు. అదీగా రేపు ఆయన శాసనసభకు పోటీ చేస్తానని అనకుండా ఉంటారన్న ఆలోచన కూడా ఉంది. ఆయన ఎన్నికల బరిలో ఉంటే రాష్ట్రమంతా ప్రచారం చేయడానికి ఇబ్బందవుతుంది. ఇన్ని రకాలుగా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. బాలయ్య బాబు కూడా ఢిల్లీ పెద్దల సభలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మన సినీ హీరో చిరంజీవి రాజ్యసభలో ఉన్నారు. బాలయ్య కూడా అదే బాటలో పెద్దల సభలో అడుగుపెట్టాలని అనుకుంటున్నారేమో!