ఆంధ్రప్రదేశ్ జీజేపీ కార్యదర్శి కేవీ లక్ష్మీపతి రాజా (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి: టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కేవీ లక్ష్మీపతి రాజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్షలో కేంద్రంపై, నరేంద్ర మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో లక్ష్మీపతి రాజా.. టీడీపీపై విమర్శలు గుప్పించారు.
బాలకృష్ణ ఒళ్లు తెలియకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఆయనకు మతిభ్రమించిందనీ, అందుకే ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం చేసిన సహకారాన్ని మరచి బరితెగించి చవకబారు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అవినీతి బయట పడితే తన బావ, అల్లుడికి రాజకీయంగా పుట్టగతులుండవనే అభద్రతా భావంతో బాలకృష్ణ పొగరుబోతు మాటలు పేలుతున్నారని అన్నారు.
ప్రజలతో నాలుగు విషయాలు నేరుగా చెప్పడం చేతగాని దద్దమ్మ దేశ ప్రధానిపై వ్యాఖ్యలు చేయడమేంటని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది అధర్మ, అవకాశవాద దీక్ష అని అన్నారు. కేంద్రంపై, మోదీపై పెంచుకున్న కక్షను వెల్లడించేందుకే ముఖ్యమంత్రి ఈ దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. తమ అవినీతి, అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ దొంగ దీక్ష చేపట్టారని మండిపడ్డారు. బీజేపీపై, మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది మచ్చుతునక అని లక్ష్మీపతి అన్నారు.
తన తండ్రిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచి రాజకీయంగా, నైతికంగా చావుదెబ్బతీసినప్పుడు ఈ పౌరషం ఏమైందని బాలకృష్ణను ప్రశ్నించారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు టీడీపీ కార్యకర్తలతో నిర్దాక్షిణ్యంగా చెప్పలు, రాళ్లు వేయించినప్పుడు ఈ ‘హీరోయిజం’ ఎటుపోయిందని బాలకృష్ణకు చురకలంటించారు. టీడీపీ అవినీతి, కుంభకోణాలు బయటపడే సమయం దగ్గర్లోనే ఉందని లక్ష్మీపతి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని చంద్రబాబు ఖండించాలి. మోదీపై చేసిన వ్యక్తిగత విమర్శల్ని వెనక్కి తీసుకుని భేషరతుగా బాలకృష్ణ మోదీకి క్షమాపణలు చెప్పాలని లక్ష్మీపతి డిమాండ్ చేశారు.
బాలకృష్ణను పిచ్చాసుపత్రికి తరలించాలి
అనంతపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర‍్థన్ రెడ్డి ఖండించారు. బాలకృష్ణను పిచ్చాసుపత్రికి తరలించాలని, టీడీపీ నీచ సంస్కృతికి బాలయ్య వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment