
బెస్ట్ 4 నాల్డెజ్
సంకల్పమనే ఇంధనం రగిలితే.. తపన ప్రజ్వలిస్తే.. ఆశయాలు రెక్కలు తొడిగితే.. ఆకాశమే హద్దుగా యువత చెలరేగిపోతుంది. చేతులే తెడ్లుగా కల్లోల కడలిని కూడా అవలీలగా ఈది పారేస్తుంది. అందుకు ఆ నలుగురే నిదర్శనం. తమ కాన్సెప్ట్ ఫార్ములాకు డిజిటల్ అస్త్రం జోడించి మరీ దూసుకుపోతున్నారు వీరు. ‘వింగ్స్ అండ్ ఓర్స్ డాట్ కామ్’ యూట్యూబ్ చానల్ రూపొందించి ‘డిజిటల్ లెర్నింగ్ ’ పేరుతో ఈ తరానికి కావాల్సిన విజ్ఞానాన్ని అందరికీ చేరుస్తున్నారు.
విద్యావేత్తల చర్చలు, శాస్త్రజ్ఞుల ప్రసంగాలు, ఆర్థిక మేధావుల కాన్ఫరెన్స్‌లు కొందరికే పరిమితమవుతున్నాయి. వాటిని అందరికీ అందుబాటులోకి తేవాలన్న ఓ నలుగురు విద్యార్థుల ఆలోచనే ‘వింగ్స్ అండ్ ఓర్స్ డాట్ కామ్’ యూట్యూబ్ చానల్. గౌత మి చల్లగుల్ల, మణికృష్ణ, శ్రీనివాస్, సాగర్‌వర్మ.. అందరూ పీజీ చేసిన వారే. గౌతమి ఇంజనీరింగ్ పూర్తయ్యాక అమెరికాలో కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. సమాజానికి ఉపయోగపడే పని చేయాలనే ఉద్దేశంతో తిరిగి ఇండియాకి వచ్చారు. ఆమె ఆలోచనకు ఈ ముగ్గురు స్నేహితులు తోడయ్యారు. వీడియోగ్రఫీ ఆయుధంగా డిజిటల్ లెర్నింగ్‌పై దృష్టి సారించారు.
ఎక్స్‌ట్రా నాలెడ్జ్..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న మిత్ర చతుష్టయం.. అక్కడి నుంచే ఈ కార్యానికి శ్రీకారం చుట్టింది. వర్సిటీలోని అన్ని డిపార్ట్‌మెంట్లపై డాక్యుమెంటరీలు రూపొందించి యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేసింది. వర్సిటీకి వచ్చే ప్రముఖుల ప్రసంగాలు చిత్రీకరించి.. తమ క్రియేటివిటీతో వాటికి అనుబంధంగా ఇతర అంశాలను జోడించి నిండుదనం తెచ్చారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొదలు యానిమేషన్ వరకూ అన్ని రకాల డిజిటల్ సాఫ్ట్‌వేర్లను వాడారు.
ఆల్ యాంగిల్స్..
యూనివర్సిటీల్లో జరిగే ప్రసంగాలు, కాన్ఫరెన్స్‌లతో మొదలైన వీరి కెమెరా పనితనం.. తర్వాత విభిన్న రంగాలపై ఫోకస్ చేసింది. ఇటీవల బిర్లా ప్లానెటోరియంలో జరిగిన సైన్స్ ఎగ్జిబిట్స్‌పై ప్రత్యేక చిత్రాలు రూపొందించారు. శాస్త్రవేత్తల సలహా సూచనలతో వీడియోలు రూపొందించి చానల్‌లో పోస్ట్ చేశారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తరఫున ప్రముఖ శాస్త్రవేత్తల బయోగ్రఫీలను లఘు చిత్రాలుగా మలి చారు. సిటీలో జరిగే కొన్ని ప్రత్యేక సమావేశాలను షూట్ చేసి.. వాటికి అదనపు సమాచారాన్ని కూర్చి స్పెషల్ స్టోరీలు రూపొందించారు. ఫ్యూచర్‌లో అన్ని వర్సిటీల్లో తమ టీం ఉంటుందని చెబుతున్నారు.
పేషెంట్ వర్షన్..
మృత్యువుతో పోరాడి బయటపడిన ఓ రోగి అనుభవాలు ఎందరికో ధైర్యాన్నిస్తాయి. అందుకే ఈసారి ఈ బృందం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేర్ ఆస్పత్రి సెంటర్లకు వెళ్లి.. దాదాపు 300 మంది రోగులను పలకరించింది. వారిలో వంద మంది ఇంటర్వ్యూలను చిత్రీకరించింది. ఈ వీడియోలు కేర్ ఆస్పత్రి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ‘రోగుల ద్వారా జబ్బులపై అవగాహన కల్పించాలని ఈ ప్రాజెక్ట్ చేపట్టాం’ అని చెబుతారు ఆ నలుగురు.
షార్ట్ అండ్ షార్ప్
డిజిటల్ లెర్నింగ్ పేరుతో ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ఫిల్మ్‌లే కాదు.. అప్పుడప్పుడూ ఇతర అంశాలపైనా షార్ట్‌ఫిల్మ్‌లు తీసి శభాష్ అనిపించుకుంటుంది ఈ టీమ్. చెన్నైలో నటి రేవతి నేతృత్వంలోని ‘ఎబిలిటీ’ అనే స్వచ్ఛంద సంస్థ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వీళ్లు పంపిన లఘుచిత్రం ‘మై బ్రదర్ నవనీత్’ నేషనల్ అవార్డ్ సాధించింది. ఆల్ ఇండియా లెవల్లో ఈ పొట్టి చిత్రం రెండో బహుమతి పొందింది. ‘ఈ చిత్రాన్ని ఎంపిక చేసిన జ్యూరీలో డెరైక్టర్ మణిరత్నం కూడా ఉన్నారు. అది తలుచుకుంటేనే చాలా ఆనందం వేస్తుంది’ అని అంటుంది గౌతమి అండ్ కో. వీడియోల ద్వారా విజ్ఞానాన్ని సరికొత్తగా అందిస్తున్న వీరికి మనం కూడా
హ్యాట్సాఫ్ చెబుదాం.
- భువనేశ్వరి
ఫొటో: ఎన్.రాజే ష్‌రెడ్డి