
తన బలం తనకు తెలియని చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన బలం ఏమిటో తను తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు తలచుకుంటే రాష్ట్ర విభజన ఆగిపోతుంది. అతని నిర్ణయానికి అంత శక్తి ఉంది. ఆ విషయం ఆయనకు అర్థం కావడంలేదు. రాష్ట్రాన్ని విభజించవద్దని సమైక్యంగా ఉంచమని మొదటి నుంచి సిపిఎం, ఎంఐఎం కోరుతున్నాయి. రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. విభజన విషయం తెలియగానే అందుకు నిరసనగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేశారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో దీక్ష చేశారు.పోలీసులు దానిని భగ్నం చేశారు. ఆ తరువాత జగన్ జైలులో ఉండే నిరవధిక నిరాహారదీక్ష చేశారు. ఆస్పత్రికి తరలించినా ఆయన దీక్ష కొనసాగించారు. అక్కడా ఆయన దీక్షను భగ్నం చేశారు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా పట్టువదలని విక్రమార్కుడులాగా మళ్లీ సమైక్య దీక్ష కోనసాగిస్తున్నారు. సమైక్య రాష్ట్రానికి సిపిఎం, ఎంఐఎం సంపూర్ణ మద్దతు ఇస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉద్యమాన్ని కొనసాగిస్తూ, పోరాటం చేస్తోంది. రాష్ట్ర విభజన ప్రకటించిననాటి నుంచి రాజకీయ పార్టీలతో సంబంధంలేకుండా సీమాంధ్రలో ప్రజలు, ఉద్యోగులు ఉధృతస్థాయిలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మరోపక్క విజయమ్మ తమ పార్టీ ముఖ్యనేతల బృందంతో కలిసి దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతిని మొదలుకొని జాతీయ పార్టీల నేతలను కలుస్తూ సమైక్యాంధ్ర రాష్ట్రానికి మద్దతు కూడగడుతున్నారు.
ఈ పరిస్థితులలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి తోడైతే విభజన ఆగిపోవడం ఖాయం. జగన్ పిలుపునకు చంద్రబాబు స్పందిస్తే కాంగ్రెస్ వెనక్కు తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. 'వారు చెబితే మేం వినాలా?' అని ఇటువంటి సందర్భాలలో చంద్రబాబు అనడం సరికాదు. ప్రజల కోసం ఎవరు చెప్పినా తప్పక వినాలి. విని తీరాలి. ప్రజా సంక్షేమం కోసం రాజకీయ పార్టీలు కలిసి ఉద్యమాలు చేయడం, కలసి పోరాటాలు చేయడం కొత్తేమీకాదు. గతంలో వామపక్షాలతో కలిసి అనేక ఉద్యమాలు చేయలేదా? ఒకే లక్ష్యం, అదీ అత్యధిక మంది ప్రజల ఆకాంక్ష మేరకు కలసి ఉద్యమం చేయడంలో తప్పులేదు. అది ఆ పార్టీ ప్రతిష్టనే పెంచుతుంది.
మహానటుడు ఎన్టి రామారావు తెలుగు జాతి గౌరవం నిలిపేందుకే ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన స్థాపించిన పార్టీ ఈ రోజు ఈ తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి సహకరిస్తుందంటే ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుంది?! ఆయన ఫొటోకు దణ్ణం పెడుతూ ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. తెలుగు జాతిని చీలుస్తున్నందుకు, రాష్ట్రాన్ని రెండు ముక్క్లులు చేస్తున్నందుకు క్షమించమని కోరుతున్నట్లుంది ఆ దృశ్యం. తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు సంస్కృతి పునాదులపై నిర్మించిన పార్టీ నేతలు ఈ విధంగా ప్రవర్తించడాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు ఇలాగే ముందుకు పోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న విషయం ఆయనకు అర్ధం కావడంలేదు. ఇప్పటికైనా చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన లేఖ వెనక్కు తీసుకొని, తన తప్పు సరిదిద్దుకొని, తన శక్తి తెలుసుకొని జగన్ పిలుపు మేరకు ముందుకు వస్తే రాష్ట్రం విడిపోకుండా అడ్డుపడినవాడుగా చరిత్రలో మిగిలిపోతారు. ఆ మహానాయకుడు స్థాపించిన పార్టీ పరువు నిలిపినవాడవుతారు.